ఆ ఊరివారి రూటే సపరేటు.. ఉండేది ఒక దేశం.. తినేది మరో దేశంలో.. లోంగ్వా గ్రామస్తుల కథే వేరు..!
ఒక్క దేశం పౌరసత్వం పొందాలంటే నానాతంటాలు పడాలి. అలాంటిది, పరాయి దేశం వెళ్లాలంటే పాస్‌పోర్టు, వీసా పేరుతో అధికారుల వేధింపులు అంతా ఇంతా కాదు.
Man living at border Village : ఒక్క దేశం పౌరసత్వం పొందాలంటే నానాతంటాలు పడాలి. అలాంటిది, పరాయి దేశం వెళ్లాలంటే పాస్‌పోర్టు, వీసా పేరుతో అధికారుల వేధింపులు అంతా ఇంతా కాదు. అలాంటిది ఓ వ్యక్తి ఒక దేశంలో తిండి తింటూ మరో దేశంలో నివాసముంటున్నాడు. ఈ ఘటన భారత్-మయన్మార్ సరిహద్దులో చోటుచేసుకుంటుంది.
ఇక, వివరాల్లోకి వెళ్తే…భారత ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్. నాగాలాండ్‌కు ఉత్తర భాగంలో మన్ అనే ఓ జిల్లా. ఆ జిల్లాలో ఓ గ్రామం పేరు లోంగ్వా. ఆ గ్రామానిక ఓ ప్రత్యేక ఉంది. ఆ గ్రామంలో ఉండే ఓ ఇల్లు వెరీ వెరీ స్పెషల్. భారత్-మయన్మార్ దేశాల సరిహద్దుల్లో లోంగ్వా గ్రామం ఉంటుంది. లోంగ్వా గ్రామం రెండు దేశాలతో ముడిపడి ఉంటుంది. ఈ గ్రామం మధ్యలో నుంచి రెండు దేశాల సరిహద్దు రేఖ వెళుతుంది. సాధారణంగా ఇటువంటి గ్రామాల్లోని ప్రజలకు ఏదో ఒక దేశానికి చెందిన పౌరసత్వమే ఉంటుంది. కానీ లోంగ్వా గ్రామస్తులు ప్రత్యేకతే వేరు. ఇక్కడ నివసించే కొణ్యక్ తెగ గిరిజనులకు రెండు దేశాలూ తమ దేశ పౌరసత్వం కల్పించాయి.
ఈ గ్రామమే ఓ ప్రత్యేకత అంటే ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. ఈ గ్రామ పెద్ద లోక్‌నంగ్ ఇల్లు సరిగ్గా ఇరు దేశాల సరిహద్దు రేఖపై ఉంటుంది. ఈ ఇల్లు సగం భారత్ లోనూ.. మరో సగం మయన్మార్‌లోనూ ఉంటుంది. అంటే గ్రామ పెద్దా.. వారి కుటుంబం సభ్యులు.. ప్రతీ రోజూ భారత్‌లో భోజనం చేసి మయన్మార్‌లో నిద్రపోతారట..!! దీనిపై స్పందించిన గ్రామపెద్ద ఇదంత పెద్ద విషయమే కాదని కొట్టిపారేస్తున్నారు. రెండు దేశాలను సమానంగా ప్రేమిస్తున్నామంటున్నారు.
అంతేకాదు లోంగ్వా గ్రామంలోని ప్రజలు.. ముఖ్యంగా యువకులు వారి వారి వీలుకు తగినట్లుగా కొంతమంది భారత్‌లో వ్యాపారం చేస్తుంటే మరికొందరు ఏకంగా మయన్మార్ సైన్యంలోనే చేరిపోయారు. ఈ విషయం గురించి లోంగ్వా గ్రామస్తుల్ని అడిగితే వారు ఒకటే చెబుతారు. తమ దృష్టిలో భారత్- మయన్మార్ ఒక్కటేనంటారు. రెండు దేశాలకు మధ్య మాకు పెద్ద తేడా ఏమీ తెలీదని చెబుతున్నారు.
ఇదిలావుంటే, కొణ్యక్ తెగకు చెంది గిరిజనులు భారత్‌లోని అతి పురాతనమైన ‘హెడ్ హంటర్స్’ ఆదివాసీలుగా పేర్కొంటారు. తమకు శత్రువులుగా భావించే ఇతర గిరిజన తెగ ప్రజల తలలు నరికి తేవడం కొణ్యక్ తెగ సంప్రదాయంలో భాగంగా ఉండేదట. కానీ.. 1960 తర్వాత వీరు క్రమేపీ అంతరించిపోయారు. దీనికి కారణం ఆ ప్రాంతంలో మతమార్పిడులు పెరగటమేనంటారు. అయినా ఇప్పటికీ కొంత తమ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. వేరే జాతికి చెందిన గిరిజనుల తలలు నరికి తెచ్చినవారిని హీరోల్లా చూసేవారట కొణ్యక్ తెగలవారు. అలా ఎవరు చేసినా ఏదో ఘనకార్యం అన్నట్లు గుర్తుగా ఆ వ్యక్తి ఒంటిమీద పచ్చబొట్టు వేయించి..కొణ్యక్ గిరిజన సంప్రదాయంలో సంబరాలు జరుపుకునేవారట. కానీ కాలంతో పాటు లోంగ్వా గ్రామస్తులు..ఆ ప్రాంతంలో నివసించే ఇతర గిరజనులు కూడా మారారు.
ప్రస్తుత అధునిక ప్రపంచంలో అటువంటి ఛాయలు కూడా అక్కడ కనిపించడంలేదు. కానీ, ఆ ప్రాంతంలోని వృద్ధులు గతంలో జరిగినవి చెబుతుంటే నిజమా అంటూ వింటారట నేటి తరం వారు. అక్కడి వృద్ధుల ఒంటిమీద కనిపించే పచ్చబొట్లు వాళ్లు ‘హెడ్ హంటర్స్’ అని ఇప్పటికీ గుర్తు చేస్తుంటాయట. భారత్, మయన్మార్ దేశాల్లోని గ్రామాల్లో కలిపి దాదాపు 20లక్షల మంది కొణ్యక్ గిరిజనులు నివసిస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. ఎవరికి తోచిన వ్యాపారాలు.. ఇతరత్రా పనులు చేసుకుంటు జీవిస్తున్నారు. ఇటు భారత్ అన్నా, అటు మయన్మార్ అన్నా వారికి ఎనలేని ప్రేమ.. ఈ రెండు దేశాలు మావేనంటారు.. రెండు దేశపట్ల వారు చూపించే దేశభక్తి కూడా గొప్పదే.