AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthana: విజయ్ కేబినెట్‌లో తెలుగమ్మాయి.. కీర్తన గురించి మీకు తెలుసా..?

విజయ్ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 29 ఏళ్ల ఎస్. కీర్తన విజయగాథ ఆదర్శప్రాయం. ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేసి, సోషల్ మీడియా ప్రభావంతో శివకాశి నుండి ఎమ్మెల్యేగా గెలిచింది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా, సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, యువతకు, మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన కీర్తన.. ప్రథమ ప్రాధాన్యత బాణసంచా పరిశ్రమ కార్మికుల భద్రత అని ప్రకటించారు.

Keerthana: విజయ్ కేబినెట్‌లో తెలుగమ్మాయి.. కీర్తన గురించి మీకు తెలుసా..?
Mla Keerthana
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: May 10, 2026 | 4:34 PM

Share

తమిళనాడులో కోట్లాది అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. విజయ్ అనే నేను అంటూ.. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు జోసెఫ్ విజయ్‌. వేలాదిమంది అభిమానుల అరుపుల మధ్య.. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అంటూ ఓత్ సెర్మనీ పూర్తి చేశారు. రాహుల్ గాంధీ, విజయ్ తల్లిదండ్రులు, త్రిష తమిళనాడు సినీ ప్రముఖులు విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. విజయ్‌తో పాటు మరో 9మంది మంత్రుల ప్రమాణం చేశారు. సీనియర్లు, జూనియర్లతో కలిపి తన కేబినెట్ ఏర్పాటు చేసుకున్నారు. ఎన్‌.ఆనంద్, అర్జున్, అరుణ్‌రాజ్‌, సెంగొట్టయన్, వెంకటరమణన్, నిర్మల్‌కుమార్, రాజ్‌మోహన్, టీకే ప్రభు తోపాటు.. ఎస్‌.కీర్తన మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సాధారణ 30 ఏళ్ల యువతి కీర్తన.. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేసి సరికొత్త చరిత్ర సృష్టించడం ఆసక్తికరంగా మారింది. . నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తరపున శివకాశి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కీర్తన భారీ మెజారిటీతో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు.

రాజకీయ వ్యూహకర్త నుంచి..

సెల్వి ఎస్. కీర్తన స్వగ్రామం.. విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి.. ఆమె డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నారు. తరువాత పాండిచ్చేరి యూనివర్శిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. ఆ తరువాత ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేశారు. గోవా, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. 2021 ఎన్నికల్లో తమిళనాడులో స్టాలిన్ కోసం కూడా పనిచేశారు. అంతేకాకుండా.. హైదరాబాద్‌లోని టీడీపీ సోషల్ మీడియా లీడ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఆమె తెలుగు, సోషల్ మీడియాపై మంచి పట్టు సాధించారు. సోషల్ మీడియాలో ఆమెకున్న పట్టును సద్వినియోగం చేసుకుంటూ శివకాశి నియోజకవర్గంలోని సమస్యల గురించి వీడియో పోస్టులు చేయడం మొదలుపెట్టి.. లక్షలాది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

సామాన్య కుటుంబం నుంచి వచ్చి..

కీర్తన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్.. అలాగే.. ఆమె ప్రతిభను చూసి టీవీకే శివకాశి సీటు కేటాయించింది.. దీంతో ఆమె తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. పలుచోట్ల ప్రచార కార్యక్రమాల్లో తెలుగులో మాట్లాడి ఆయా వర్గాలను ఆకట్టుకున్నారు. శివకాశి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జి. అశోకన్‌పై సుమారు 11వేల ఓట్ల మెజార్టీతో కీర్తన విజయం సాధించి.. సంచలనం సృష్టించారు.

ఒక సాధారణ మహిళకు, అందునా యువతికి విజయ్ అవకాశం కల్పించడం తనకెంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఏ విధమైన రాజకీయ నేపథ్యం లేకపోయినా ప్రజలు తనను ఆదరించి గెలిపించడం తమిళనాడులో వచ్చిన మార్పునకు సంకేతమని ఆమె అభిప్రాయపడ్డారు. శివకాశి నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న బాణసంచా పరిశ్రమలోని ప్రమాదాలను అరికట్టడమే తన ప్రథమ ప్రాధాన్యత అని కీర్తన స్పష్టం చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడే జరిగిన పేలుడు ఘటనలో సుమారు 32 మంది మరణించారని, అలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటానని మంత్రి కీర్తన భరోసా ఇచ్చారు

సాధారణ ప్రజల కష్టాలు తెలిసిన వారికే అధికారం ఇవ్వాలన్న విజయ్ ఆలోచనే నేడు తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని కీర్తన కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఆటో డ్రైవర్, ఒక సాధారణ మహిళ ఇలా కొత్త తరం నాయకులు అసెంబ్లీకి వెళ్లడం రాజకీయాల్లో పెను మార్పు అని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో యువతకు, మహిళలకు రాజకీయాల్లో పెద్దపీట వేసేలా తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us