Virat Kohli : లార్డ్స్ వన్డే కోసం లండన్ చేరిన టీమిండియా.. హోటల్ వద్ద జట్టుకు దూరంగా వెళ్లిన విరాట్ కోహ్లీ
Virat Kohli : లార్డ్స్ వన్డే కోసం లండన్ చేరుకున్న విరాట్ కోహ్లీ, టీమిండియా హోటల్ వద్ద నుంచి ప్రత్యేక కారులో తన నివాసానికి వెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Virat Kohli : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఖరిదైన మూడో పోరుకు సమయం ఆసన్నమైంది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ స్టేడియంలో ఆదివారం (జూలై 19) ఈ నిర్ణయాత్మక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు ఇప్పటికే లండన్ చేరుకుంది. దీనికి సంబంధించిన ఒక అధికారిక వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అయితే ఈ వీడియో కంటే కూడా సోషల్ మీడియాలో మరో ప్రైవేట్ వీడియో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. అందులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ చేరుకున్నాక టీమిండియా ఆటగాళ్లందరి కంటే భిన్నంగా ఒంటరిగా వేరే దారిలో వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది.
బస్సు దిగిన వెంటనే ప్రత్యేక కార్లో ఎక్కడికి వెళ్లారంటే?
వైరల్ అవుతున్న ఆ వీడియో సమాచారం ప్రకారం.. విరాట్ కోహ్లీ మిగిలిన ఆటగాళ్లతో పాటే ఒకే ఫ్లైట్‌లో లండన్ వచ్చారు. ఎయిర్‌పోర్ట్ నుంచి టీమ్ బస్సులో కూడా తోటి క్రికెటర్లతో కలిసే ప్రయాణించారు. కానీ ఎప్పుడైతే భారత జట్టు ప్రయాణిస్తున్న బస్సు లండన్‌లోని హోటల్‌కు చేరుకుందో, అక్కడ ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. బస్సు దిగిన వెంటనే కోహ్లీ హోటల్ లోపలికి వెళ్లకుండా, తన లగేజీని తీసుకుని అక్కడ తన కోసం అప్పటికే వేచి ఉన్న ఒక ప్రత్యేక ప్రైవేట్ కార్లో కూర్చుని ఒంటరిగా బయలుదేరారు. ఈ విజువల్స్ నెట్టింట వైరల్ కావడంతో అభిమానుల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి.
లండన్ లోనే కింగ్ కోహ్లీ ఫ్యామిలీ నివాసం
అయితే విరాట్ కోహ్లీ ఇలా జట్టుతో కాకుండా విడిగా వెళ్లడం వెనుక ఒక బలమైన కుటుంబ కారణం ఉందని క్రీడా వర్గాల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా తన భార్య అనుష్క శర్మ, ఇద్దరు పిల్లలతో కలిసి లండన్ నగరంలోనే నివాసం ఉంటున్నారు. క్రికెట్ సిరీస్‌ల నుంచి విరామం దొరికినప్పుడల్లా ఆయన లండన్ లోని తన ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఈ క్రమంలోనే లండన్ మ్యాచ్ కోసం సిటీలోకి రాగానే, హోటల్ బసకు కాకుండా నేరుగా తన భార్యాపిల్లలను కలవడానికి తన సొంత ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. మ్యాచ్ సమయానికి ఆయన తిరిగి జట్టుతో చేరుతారని సమాచారం.
Virat Kohli arrived at the team hotel in London and then left for his home in his car.❤️ pic.twitter.com/XRezGiX0WO
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) July 17, 2026
కార్డిఫ్ వన్డేలో కోహ్లీ అద్భుత పోరాటం
ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ ప్రదర్శనను పరిశీలిస్తే.. ఈ వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ అతనికి ఆశించిన స్థాయిలో సాగలేదు. మొదటి మ్యాచ్‌లో చాలా తక్కువ పరుగులకే అవుట్ అయి నిరాశపరిచాడు. అయితే రన్ మెషీన్ ఎక్కువ కాలం ఫామ్ లేకుండా ఉండలేరని అభిమానులకు బాగా తెలుసు. అందుకు తగ్గట్లుగానే కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో కింగ్ కోహ్లీ అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 65 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దురదృష్టవశాత్తూ కోహ్లీ ఆడిన ఈ పోరాట ఇన్నింగ్స్ జట్టును గెలిపించలేకపోయింది. భారత్ 178 పరుగుల వద్ద కోహ్లీ వికెట్ కోల్పోయిన తర్వాత, మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో టీమిండియా 233 పరుగులకే ఆలౌట్ అయింది. కనీసం పూర్తి 50 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది.
లార్డ్స్ మ్యాచ్ ముగిశాక విరాట్‌కు సుదీర్ఘ విరామం
ఆదివారం జరగబోయే లార్డ్స్ వన్డేలో కోహ్లీ తన గత మ్యాచ్ తప్పుల నుంచి నేర్చుకుని మరింత సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడటానికి ప్లాన్ చేస్తున్నాడు. లార్డ్స్ వేదికగా అతని బ్యాట్ నుంచి ఒక సెంచరీ వస్తే అంతకంటే అభిమానులకు పెద్ద పండగ మరొకటి ఉండదు. జూలై 19న ఇంగ్లాండ్‌తో జరిగే ఈ ఆఖరి వన్డే మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీకి చాలా రోజుల పాటు సుదీర్ఘమైన విశ్రాంతి లభించనుంది. ఎందుకంటే కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించేశారు. ప్రస్తుతం ఆయన కేవలం వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. భారత జట్టు తదుపరి వన్డే సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో జరగనుంది. కాబట్టి ఈ మధ్యలో దొరికే ఖాళీ సమయాన్ని కోహ్లీ తన ఫామ్ కాపాడుకోవడానికి, అలాగే 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహాల కోసం లండన్ లోనే ప్రాక్టీస్ చేస్తూ గడపనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
