Telangana: మీ ఇంట్లో ఖాళీ రూమ్స్ ఉన్నాయా..? బోల్డెంత ఆదాయం మీ సొంతం.. తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్..
మీ ఇంట్లో పర్యాటకులకు వసతి, ఫుడ్ సౌకర్యం ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ మేరకు హోమ్ స్టే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇందుకోసం ముందుగా పర్యాటకశాఖకు దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అధికారులు పరిశీలించి మీకు అనుమతి మంజూరు చేస్తారు. ఇది ఎలా పని చేస్తుందంటే..

పర్యాటకులు వచ్చి హోటల్‌లోనే ఉండాల్సిన రోజులు మారబోతున్నాయి. ఒక గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజల మధ్య ఉండటం.. స్థానిక ఆహారం తినడం.. ఆ ప్రాంతపు సంస్కృతిని స్వయంగా అనుభవించడం వంటి అనుభూతిని పర్యాటకులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకు వస్తోంది. ఇకపై రాష్ట్రంలో సాధారణ ఇళ్లకూ పర్యాటక రంగంలో చోటు కల్పించేలా హోమ్‌స్టే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇంట్లో అదనపు గది ఉందా? పర్యాటక ప్రాంతానికి దగ్గర్లో ఇల్లు ఉందా? అయితే దానిని హోమ్‌స్టేగా మార్చుకునే అవకాశం లభించనుంది. పర్యాటకులు అక్కడ బస చేయడానికి వీలు కల్పించడం ద్వారా ఇంటి యజమానులు అదనపు ఆదాయం పొందవచ్చు. ఈ విధానం ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలకు దూరంగా ఉన్న గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో కొత్త అవకాశాలను సృష్టించనుంది. పెద్ద హోటల్ నిర్మించాల్సిన అవసరం లేకుండానే స్థానిక కుటుంబాలు పర్యాటక కార్యకలాపాల్లో భాగం కావచ్చు.
హోమ్‌స్టే ఆలోచన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కేవలం వసతి కల్పించడం కాదు. ఒక ప్రాంతానికి వెళ్లిన పర్యాటకుడు అక్కడి స్థానిక జీవన విధానాన్ని కూడా తెలుసుకునే అవకాశం కల్పించడమే. ఉదాహరణకు గ్రామీణ ప్రాంతానికి వెళ్లిన టూరిస్టులకు అక్కడి సంప్రదాయ వంటకాలు, పండుగలు, జానపద కళలు, హస్తకళలు, స్థానిక ఆచారాలు పరిచయం కావచ్చు. దీంతో పర్యాటకుడి ప్రయాణం కేవలం ఒక ప్రదేశాన్ని చూసి వెళ్లడంతో ముగియకుండా.. స్థానిక సంస్కృతితో అనుభవాన్ని ముడిపెట్టేలా మారుతుంది. సాధారణ ప్రైవేటు ఇళ్లతో పాటు వారసత్వ కట్టడాలు, సంప్రదాయ గృహాలు, గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాలు, గిరిజన ప్రాంతాల్లోని సంప్రదాయ ఇళ్లు కూడా ఈ విధానంలోకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని నివాస అపార్ట్‌మెంట్లను కూడా నిబంధనలకు అనుగుణంగా పరిశీలించనున్నారు. అయితే ఇప్పటికే వాణిజ్య ప్రాతిపదికన నడుస్తున్న హోటళ్లు, రిసార్టులు, లాడ్జీలు, హాస్టళ్లు, డార్మిటరీలు, పేయింగ్ గెస్ట్ వసతులు, సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లకు ఈ అవకాశం ఉండదు.
హోమ్‌స్టే ప్రారంభించాలనుకునే ఇంటి యజమానులు పర్యాటక శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు వివిధ శాఖల అధికారులతో కూడిన కమిటీ పనిచేయనుంది. ఇంటి వసతులు, పర్యాటకులకు అందించగల సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించిన తర్వాత హోమ్‌స్టేకు తగిన కేటగిరీని సిఫారసు చేస్తారు. తుది ఆమోదం పర్యాటక శాఖ ఇస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు హోమ్‌స్టే గుర్తింపు కొనసాగుతుంది. అర్హత పొందిన ఇళ్లకు కేటగిరీ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు తెలంగాణ టూరిజం ప్రచార వేదికల్లో వాటి వివరాలను డిజిటల్‌గా అందుబాటులో ఉంచనున్నారు. అంటే.. పర్యాటకులు ఆయా వసతి కేంద్రాలను గుర్తించే అవకాశం మరింత సులభమవుతుంది.
ఇప్పటివరకు పర్యాటక ప్రాంతాల చుట్టూ ఏర్పడే ఆర్థిక కార్యకలాపాల్లో హోటళ్లు, రిసార్టులు, పెద్ద వ్యాపార సంస్థల పాత్ర ఎక్కువగా ఉండేది. హోమ్‌స్టే విధానంతో ఆ ఆదాయంలో కొంత భాగం నేరుగా స్థానిక కుటుంబాలకు చేరే అవకాశం ఉంటుంది. పర్యాటకులు స్థానికంగా తయారయ్యే వస్తువులను కొనుగోలు చేయడం, స్థానిక ఆహారాన్ని తీసుకోవడం, కళాకారులను కలవడం వంటి కార్యకలాపాలు పెరిగితే గ్రామాల్లోని చిన్న వ్యాపారాలకు కూడా ప్రయోజనం కలగవచ్చు. పర్యాటకుల సంఖ్య పెరిగిన ప్రతిసారీ కొత్త హోటళ్లు, రిసార్టులు నిర్మించడం అవసరం లేకుండా ఇప్పటికే ఉన్న నివాస వసతులను వినియోగించుకోవచ్చన్నది ఈ విధానంలోని మరో ముఖ్యమైన అంశం. దీంతో భారీ నిర్మాణాలకు అవసరమయ్యే భూమి, పెట్టుబడి తగ్గడంతో పాటు పర్యావరణంపై ఒత్తిడిని కూడా కొంత మేర నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన టూరిజం పాలసీ 2025-30లో పర్యాటక రంగానికి పెద్ద లక్ష్యాలే పెట్టుకుంది. ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో టూరిజం వాటాను రెండంకెల స్థాయికి పెంచడం వంటి లక్ష్యాలను నిర్దేశించింది. ఈ నేపథ్యంలో హోమ్‌స్టేలు చిన్న స్థాయి ఆదాయ వనరులుగా కనిపించినా.. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఏర్పాటైతే పర్యాటక మౌలిక వసతుల్లో కీలక భాగంగా మారే అవకాశం ఉంది. అంటే.. తెలంగాణ టూరిజంలో ఇక పెద్ద హోటళ్లతో పాటు సాధారణ కుటుంబాల ఇళ్లకూ స్థానం దక్కనుంది. పర్యాటకుడికి కొత్త అనుభవం.. ఇంటి యజమానికి అదనపు ఆదాయం.. స్థానిక ఉత్పత్తులకు మార్కెట్.. ఈ మూడు ప్రయోజనాలను ఒకేసారి అందించడమే హోమ్‌స్టే విధానం లక్ష్యంగా కనిపిస్తోంది.
