Manipur Violence: రగులుతున్న మణిపూర్.. పార్లమెంటులో రభస.. ఏ నిబంధనతో ఏంటి ? ఎందుకీ ప్రతిష్టంభన?

మే 4నే మహిళలపై అకృత్యం జరిగినప్పటికీ రెండున్నర నెలల తర్వాత ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో సర్క్యులేట్ కావడంతో దేశం భగ్గుమంది. అన్ని వర్గాల వారు మణిపూర్ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే, మే 3,4 తేదీలలో...

Manipur Violence: రగులుతున్న మణిపూర్.. పార్లమెంటులో రభస.. ఏ నిబంధనతో ఏంటి ? ఎందుకీ ప్రతిష్టంభన?
Amit Shah, PM Modi, Rahul Gandhi, Mallikarjun Kharge
Follow us

|

Updated on: Aug 04, 2023 | 9:40 PM

Manipur discussion in Parliament: మణిపూర్‌లో మే నెల నుంచి రగులుతున్న హింసాత్మక ఘటనలు, మరీ ముఖ్యంగా ఇద్దరు మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన విధానం యావత్ దేశాన్ని కదిలించింది. మే 4నే మహిళలపై అకృత్యం జరిగినప్పటికీ రెండున్నర నెలల తర్వాత ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో సర్క్యులేట్ కావడంతో దేశం భగ్గుమంది. అన్ని వర్గాల వారు మణిపూర్ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మోదీని తీవ్రంగా వ్యతిరేకించే వారంతా ఆయన్నే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. రగులుకున్న మణిపూర్‌లో ప్రధాని ఎందుకు పర్యటించరు? అలాంటి కీలకాంశంపై పార్లమెంటులో ఎందుకు ప్రధాని మాట్లాడరు? అన్నవి వారు లేవనెత్తుతున్న అంశాలు. మణిపూర్ శాంతి భద్రతల సమస్య. అంతర్గత భద్రతా వ్యవహారాలు హోం మినిస్ట్రీ పరిధిలోకి వస్తాయి. అందుకే హోం మంత్రి అమిత్ షా స్వయంగా అక్కడ పర్యటించడంతోపాటు డెయిలీ మణిపూర్ పరిస్థితిపై రివ్యూ చేస్తున్నారన్న సంగతి విపక్షాలతోపాటు మోదీ వ్యతిరేకులు వ్యూహాత్మకంగా విస్మరిస్తున్నారు. అయితే, మే 3,4 తేదీలలో జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత రాపిడ్ యాక్షన్ ఫోర్స్, అసోం రైఫిల్స్ సహా ఇండియన్ మిలిటరీ కూడా రంగంలోకి దిగి శాంతి నెలకొల్పేందుకు యత్నాలు ప్రారంభించాయి. చాలా ప్రాంతాల్లో భద్రతా బలగాలను నియంత్రించేందుకు మహిళలను పెద్ద ఎత్తున వాడుకున్న అల్లరి మూకలు సైన్యానికి చాలా సార్లు సవాళ్ళు విసిరారు. కుకీ తెగల వారు చాలా ప్రాంతాల్లో అత్యంత ఆధునిక ఆయుధాలను ఆటబొమ్మల్లా వాడుకుంటున్న వీడియోలను యావత్ దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. ఇలాంటి అత్యంత ఆధునిక ఆయుధాలు అల్లరి మూకలకు ఎలా దొరికాయి? వీరికి వీదేశీ సాయమేదైనా వుందా? అన్న అనుమానాలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. ప్రస్తుతం మణిపూర్ సైన్యం పహారాలో వుంది. మైతీ, కుకీ వర్గాల మధ్య సయోధ్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదంతా కాయిన్‌కు ఒకవైపు అయితే, మణిపూర్ హింస ఆధారంగా గత పదిహేను రోజులుగా పార్లమెంటులో రభస కొనసాగుతోంది. మణిపూర్ అంశాన్ని వెంటనే చర్చకు టేకప్ చేయాలని కాంగ్రెస్ సహా విపక్షాలు జులై 20 వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన దగ్గర్నించి డిమాండ్ చేస్తున్నాయి. ప్రతీ రోజు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించడం, దాన్ని స్పీకర్ రిజెక్ట్ చేసిన వెంటనే పోడియంలోకి దూసుకువెళ్ళి సమావేశాలను అడ్డుకోవడం తంతుగా మారింది. ఓ పక్క సభాధ్యక్షులు సభా కార్యకలాపాలను కొనసాగిస్తున్న నినాదాలతో సభను డిస్టర్బ్ చేయడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, మణిపూర్ అంశంపై చర్చకు సిద్దమని ప్రభుత్వం తరపున తొలుత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆ తర్వాత పలు మార్లు అమిత్ షా, ప్రహ్లాద్ జోషీ వంటి మంత్రులు విపక్షాలు చెబుతూనే వున్నారు. చర్చ కావాలని విపక్షం అంటోంది. చర్చకు సిద్దమని ప్రభుత్వమూ చెబుతోంది. కానీ పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతూనే వుంది. ఎందుకీ ప్రతిష్టంభన అంటే మణిపూర్ అంశాన్ని ఏ నిబంధన కింద చర్చించాలనే విషయంలో ప్రభుత్వానిదో దారి అయితే, విపక్షాలది ఇంకో దారి. అందుకే పార్లమెంటులో డెయిలీ సీరియల్‌ని తలపిస్తున్న ఈ రభస.

ప్రతిష్టంభనకు తెరపడేది అప్పుడే!

మణిపూర్ అంశంపై చర్చ జరగాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఎందుకంటే అసలు హింసకు కారణమేంటి? మైతీ, కుకీ వర్గాల మధ్య ఈ ఘర్షణకు అసలు కారణం ఏంటి అన్నది తేలాలంటే లోతైన చర్చ జరగాల్సిందే. రాష్ట్రంలో మైదాన ప్రాంతంలో నివసించే మైతీ వర్గీయులకు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ వర్గీయులకు ఘర్షణ అన్నది సింపుల్‌గా చెప్పుకుంటున్న అంశం. కానీ ఆ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టిన అంశాలు, అందుకు దశాబ్ధాలుగా పడిన బీజాలు తేలాలంటే స్వతంత్రం వచ్చిన్నాటి నుంచి ఈశాన్య రాష్ట్రాలలో ఏం జరుగుతోందన్నది తేలాలి. దేశంలో రాజకీయ పార్టీల రోల్ ఏ మేరకు వుంది? ఈశాన్య రాష్ట్రాలపై కన్నేసిన చైనా పాత్ర ఏంటి? మయన్మార్ నుంచి వచ్చి చేరుతున్న వలస వాదుల పాత్ర ఏంటి? ఇలాంటి అంశాలు తేలాలి. కుకీ వర్గీయులు వినియోగిస్తున్న అత్యంత ఆధునిక ఆయుధాలు వారి చేతుల్లోకి చేర్చిందెవరు? దశాబ్దాలుగా కొనసాగిన చొరబాట్లకు ఎవరి పాలన తావిచ్చింది? అన్న అంశాలు కూడా తాజా పరిస్థితి కారకులెవరన్నది చర్చించినపుడు బయటికి వస్తుంది. అయితే, ఇదంతా లోతైన చర్చ సానుకూల వాతావరణంలో జరిగితేనే పార్లమెంటు ద్వారా యావత్ దేశప్రజలకు నిజానిజాలు తెలిసి వస్తాయి. ఈ విషయం రాజకీయ పార్టీలకు తెలియనిది కాదు. కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత నిస్తాయి. ఇందులో విపక్షాలతోపాటు అధికార పక్షమూ మినహాయింపు కాదు. చర్చకు అంతా ఒకే కానీ ఎందుకు ప్రతిష్టంభన ? దీనికి కారణం.. మళ్ళీ రాజకీయ ప్రయోజనాలేనని చెప్పాలి. ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ మణిపూర్ అంశంపై 267 నిబంధన కింద చర్చ జరగాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. ఈ నిబంధన కింద చర్చ జరిగితే చివరిలో ఓటింగుకు ఆస్కారముంటుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ 267 నిబంధన కింద చర్చకు డిమాండ్ చేస్తోంది. దాంతో పాటు చర్చ ముగింపులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సభలో సమాధానం చెప్పాలని విపక్షాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. 267 చర్చకు ఓ దశలో ప్రభుత్వమూ సిద్దపడింది. కానీ ప్రధానికి బదులుగా దేశ అంతర్గత భద్రత వ్యవహారాలను పర్యవేక్షించే హోం మంత్రి అమిత్ షా సభలో సమాధానం చెబుతారని ప్రభుత్వం చెబుతోంది. దీనికి విపక్షాలు అంగీకరించడం లేదు. అందుకే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆగస్టు 3న ప్రభుత్వం ఓ మెట్టు దిగి వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ, రాజ్యసభలో అధికార పక్ష నాయకుడు పీయూష్ గోయెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా విపక్ష నేతలతో భేటీ అయ్యారు. విపక్షాలను అనునయించేందుకు యధాశక్తి యత్నించినా ఫలితం లేకపోయింది. మణిపూర్ అంశంపై 267 లేదా 176 నిబంధన కింద చర్చ జరిగినా ప్రధాని స్వయంగా సమాధానమిస్తేనే తమకు అంగీకరమని విపక్షాలు కాస్త గట్టిగానే చర్చలకొచ్చిన కేంద్ర మంత్రులకు చెప్పారు. అయితే ఈ రెండు నిబంధనలు కాకుండా తాజాగా 167 నిబంధన కింద చర్చ జరపాలని విపక్షాలు ప్రతిపాదిస్తున్నాయి. ఈ నిబంధన ప్రకారం చర్చ జరిగితే దానికి నిర్దిష్ట సమయం కేటాయిస్తారు కానీ చివరిగా ప్రధాని సమాధానం చెప్పాల్సి రావచ్చు. అందుకే విపక్షాలు తాజాగా 167 నిబంధనను ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 4న మరోసారి విపక్షాలకు నచ్చ చెప్పేందుకు ప్రహ్లాద్ జోషి యత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాత ఆగస్టు 11న రాజ్యసభలో మణిపూర్ అంశాన్ని స్వల్ప కాలిక చర్చ రూపంలో టేకప్ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీ గగోయ్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8, 9, 10  తేదీలలో చర్చ జరపాలని స్పీకర్ ఓం బిర్లా ఇదివరకే నిర్ణయించారు. పదో తేదీన చర్చకు నరేంద్ర మోదీ సమాధానమివ్వనున్నారు. ఆ తర్వాతి రోజున మణిపూర్ అంశాన్ని రాజ్యసభలో టేకప్ చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే, అవిశ్వాస తీర్మానంపై చర్చలోనే మణిపూర్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. అవిశ్వాసంపై మాట్లాడే సభ్యులు తమ విధానాన్ని వ్యక్తపరిచే క్రమంలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించ వచ్చు. తాజా పరిస్థితులలో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలతోపాటు బీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతాయి. అదేసమయంలో అధికార బీజేపీ సహా దాని మిత్ర పక్షాలు రాజస్థాన్, చత్తీస్‌గఢ్, బెంగాల్‌లలో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించి, విపక్షాలను కార్నర్ చేసేందుకు యత్నిస్తాయి. తాజాగా హర్యానాలో ప్రజ్వరిల్లిన హింస కూడా పార్లమెంటులో అవిశ్వాసంపై చర్చలో ప్రస్తావనకు వస్తాయి. సో.. ఇపుడు పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన ఆగస్టు 8న అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలయ్యే దాకా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.