హాలీవుడ్ సినిమా చూసి బ్యాంకు దోపిడీకి యత్నం.. కట్‌చేస్తే పోలీసులకు దిమ్మతిరిగే స్టోరీ చెప్పాడు
హాలీవుడ్ సినిమా చూసి ఓ వ్యక్తి బ్యాంకు చోరీకి యత్నించి.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. రీల్ వేరు రియల్ వేరని తెలుసుకునేలోపు సదరు వ్యక్తి జైల్లో ఊచలు లెక్కెట్టాడు. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం..
హాలీవుడ్ సినిమా చూసి ఓ వ్యక్తి బ్యాంకు చోరీకి యత్నించి.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. రీల్ వేరు రియల్ వేరని తెలుసుకునేలోపు సదరు వ్యక్తి జైల్లో ఊచలు లెక్కెట్టాడు. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) నార్త్ వెస్ట్ జితేంద్ర మీనా తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని అలహాబాద్‌లోని కరవాల్ నగర్‌లో నివాసం ఉంటున్న ఇమ్రాన్ అలియాస్ రాజా షర్టుల ఫ్యాక్టరీలో టైలర్ పనిచేసేవాడు. ఒక్కో షర్ట్ కుట్టినందుకు రూ.30లు కూలీగా తీసుకునేవాడు. ఇలా వారానికి 100 షర్టుల చొప్పున కుట్టి రూ.3 వేలు సంపాదించేవాడు. మూడు వారాల క్రితం తన మొబైల్ ఫోన్‌లో ది సీక్రెట్ ఏజెంట్ మువీ చూసి బ్యాంక్ రాబరీకి పథకం పన్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సహోద్యోగులతో మద్యం సేవించి యజమానితో గొడవపడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం కూడా మరోమారు ఫ్యాక్టరీ యజమానితో గొడవపడి కోపంగా బయటికి వెళ్లిపోయాడు. అనంతరం మద్యం సేవించి బస్ ఎక్కి నేరుగా మోడల్ టౌన్ ప్రాంతంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చేరుకుని చోరీకి యత్నించాడు. తనతోపాటు తెచ్చుకున్న తుపాకీతో గాల్లో ఐదుసార్లు కాల్పులు జరిపాడు. దీంతో బ్యాంక్ సిబ్బంది సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి చాకచక్యంగా ఇమ్రాన్‌ను అరెస్టు చేశారు.
అనంతరం నిందితుడి నుంచి రెండు మ్యాగజైన్‌లు, ఏడు లైవ్ కాట్రిడ్జ్‌లు, వినియోగించిన ఐదు కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో ఇమ్రాన్‌ణు విచారించగా విచిత్రమైన కథ ఒకటి వినిపించాడు. దాదాపు కోటి రూపాయల చోరికీ ఇమ్రాన్ పథకం పన్నాడు. ఎవరినీ చంపాలనే ఉద్ధేశ్యంలేదని.. కేవలం బ్యాంకు సిబ్బందిని తుపాకీతో బెదరించడానికే కాల్పులు జరిపినట్లు తెలిపాడు. తుపాకీ ఎక్కడి నుంచి సేకరించావని ప్రశ్నించగా.. రెండేళ్ల క్రితం యమునా నదిలో స్నానానికి వెళ్లినప్పుడు అక్కడ ఒడ్డుకు సమీపంలో ఓ తుపాకీ కనిపించిందని, దానిని బట్టల్లో చుట్టి దాచిపెట్టానని, గతంలో ఎప్పుడు దానిని వినియోగించలేదని వెల్లడించాడు. యమునా నది స్టోరీ నమ్మశక్యంగా లేకపోవడంతో లోకల్ గ్యాంగ్‌స్టర్‌లతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని డీసీపీ మీడియాకు వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.