Maharashtra: మార్చినాటికి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలో వచ్చే మార్చి నెలనాటికి కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణె సంచలన వ్యాఖ్యలు చేశారు.
Maharashtra New Govt: మహారాష్ట్రలో వచ్చే మార్చి నెలనాటికి కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణె సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో త్వరలోనే మార్పులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఆ మార్పును మార్చి నాటికల్లా చూస్తారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అక్కడ శివసేన -ఎన్సీపీ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం(మహా వికాస్ అఘాడి ప్రభుత్వం) మహారాష్ట్రలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నారాయణ రాణె చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటు.. లేదా ప్రస్తుత ప్రభుత్వంలో చీలికలకు సంబంధించిన అంశాలను సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఉందని రాణె అన్నారు. రాజస్థాన్ పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉద్ధవ్ థాకరే అనారోగ్యంతో ఉన్నారని.. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడవద్దని తమ పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సూచించినట్లు రాణె తెలిపారు. అయితే మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మహారాష్ట్రలో ఎక్కువ రోజులు మనుగడ సాధించలేదని అభిప్రాయపడ్డారు. త్వరలోనే మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని రాణె చెప్పుకొచ్చారు.
#WATCH | “Change will be seen in Maharashtra very soon. The change will be seen by March. To form a government, to break a govt, some things have to be kept secret,” Union Minister Narayan Rane in Jaipur (25.11) pic.twitter.com/GAlDtDr1xO
— ANI (@ANI) November 26, 2021
ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ విపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. 2019లో ఆ రెండు పార్టీలు మెజార్టీ సాధించినా… ముఖ్యమంత్రి పదవికి శివసేన పట్టుబట్టింది. దీనికి బీజేపీ అంగీకరించకపోవడంతో శివసేన..ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంది. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపిన శివసేన.. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Also Read..
Acharya: మెగాస్టార్ మూవీకి భారీ డిమాండ్.. “ఆచార్య” ఓటీటీ రైట్స్ దక్కించుకుంది ఎవరో తెలుసా..