Mahakumbh Mela 2025: కుంభమేళా వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ నడపనున్న రైల్వే
ప్రముఖ ఆధ్యాత్మిక జాతర మహాకుంభమేళాను ప్రయాగ్ రాజ్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు శర వేగంగా చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్లో జరగనున్న మహాకుంభమేళా కోసం 1300 రైళ్లను నడపనున్నది రైల్వే సంస్థ, ఇప్పటికే నడిచే 140 సాధారణ రైళ్లు కాకుండా.. ఈ మేళాలో స్నానమాచరించే భక్తుల కోసం 1,225 ప్రత్యేక రైళ్లను నడపనుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభమేళాకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు సహా దాదాపు 40 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళాను నిర్వహించనున్నారు. ఈ జాతర కోసం ప్రత్యెక రైళ్ళను నడుపుతున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రయాగ్ రాజ్ కు 140 సాధారణ రైళ్లు నడుస్తూ ఉంటాయి. అయితే ఈ మహా కుంభ మేళా సమయంలో.. ఆరు ప్రధాన పండగల సమయంలో రైల్వే శాఖ 1,225 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించింది. ప్రయాగ్ రాజ్ లో స్నానం చేసి అనంతరం అయోధ్య, కాశీని సందర్శించాలనుకునే యాత్రికుల కోసం ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్, అయోధ్య, వారణాసి, రాంబాగ్ మొదలైన ప్రధాన స్టేషన్‌లలో ఈ రైళ్ళు ఆగే విధంగా తమ సేవలను ప్రయాణీకుల సౌకర్యం కోసం అందించే విధంగా రైల్వే సిబ్బంది ఆలోచిస్తుందని రైల్వే ప్రతినిధి తెలిపారు.
చిత్రకూట్ సందర్శించాలనుకునే యాత్రికుల కోసం, ఝాన్సీ, బందా, చిత్రకూట్, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ఫతేపూర్, గోవింద్‌పురి , ఒరాయ్‌లను కవర్ చేసే మరో రింగ్ రైలు సర్వీస్ ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.
స్పెషల్ ట్రైన్ షెడ్యుల్ వివరాలు
ఈ 1,225 ప్రత్యేక రైళ్లలో.. 825 తక్కువ మార్గాల్లో నడప నుండగా.. 400 స్పెషల్ ట్రైన్స్ దూర ప్రాంతాల కోసం రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు నడప నున్న రైళ్ళ సంఖ్య 2019 సమయంలో నడిచిన రైళ్ల కంటే దాదాపు 177 శాతం ఎక్కువ అని చెప్పారు. అప్పుడు 533రైళ్ళు తక్కువ దూరంలో నడపగా.. 161 దూరంలో ప్రయాణించే రైళ్ళు నడిపిమ్చినట్లు రైల్వే ప్రతినిధి తెలిపారు.
కుంభమేళాకు వచ్చే యాత్రికులకు సహాయం చేసేందుకు రైల్వే శాఖ టోల్ ఫ్రీ నంబర్ – 1800-4199-139ను ప్రారంభించింది. అంతేకాదు కుంభ్ 2025 మొబైల్ యాప్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ యాప్ కు 24×7 కాల్ సెంటర్ సపోర్ట్ చేస్తుంది.
రైల్వే శాఖ రూ. 933.62 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో ప్రయాణీకుల సౌకర్యాల మెరుగుదల కోసం రూ. 494.90 కోట్లు, రోడ్డు ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 438.72 కోట్లు కేటాయించారు. కొత్త స్టేషన్ భవనం, CCTV ఏర్పాట్లతో సహా ప్రయాణీకుల సౌకర్యాల కల్పనపై పని చేస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌లో 4,000 మంది ప్రయాణికులకు వసతి కల్పించే అదనపు ప్యాసింజర్ ఎన్‌క్లోజర్‌ను ఏర్పాటు చేస్తారు. స్టేషన్‌లో ఇప్పటికే అలాంటి నాలుగు ఎన్‌క్లోజర్‌లు అందుబాటులో ఉన్నాయి. అన్ని స్టేషన్లతో పాటు కుంభ మేళా జరిగే ప్రాంతంలో మొత్తం 542 టికెటింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ల ద్వారా రోజుకు 9.76 లక్షల టిక్కెట్లను పంపిణీ చేయగలవని అధికార ప్రతినిధి తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అదనంగా 651 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. వీటిలో దాదాపు 100 కెమెరాలు దొంగలు, సంఘ వ్యతిరేక అంశాలను గుర్తించేందుకు AI ఆధారిత ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..