Madhya Pradesh: బీజేపీకి ఓటు వేసినందుకు ముస్లిం మహిళను కర్రతో చితకబాదిన బంధువులు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా అయిన సెహోర్‌లో దారుణం జరిగింది. ఒక మహిళ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిందని అనుచితంగా ప్రవర్తించాడు ఆమె బంధువు. సదరు మహిళ బీజేపీకి ఓటు వేసి గెలుపొందిన తర్వాత సంబరాలు చేసుకోవడంతో కోపోద్రిక్తుడైన ఆ మహిళ బావ ఆమెను తీవ్రంగా చితకబాదాడు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా అయిన సెహోర్‌లో దారుణం జరిగింది. ఒక మహిళ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిందని అనుచితంగా ప్రవర్తించాడు ఆమె బంధువు. సదరు మహిళ బీజేపీకి ఓటు వేసి గెలుపొందిన తర్వాత సంబరాలు చేసుకోవడంతో కోపోద్రిక్తుడైన ఆ మహిళ బావ ఆమెను తీవ్రంగా చితకబాదాడు. దీంతో బాధిత మహిళ న్యాయం కోసం కలెక్టరేట్‌ను ఆశ్రయించింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు అహ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఐపీసీ 294, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
సెహోర్ అసెంబ్లీ పరిధిలోని బర్ఖేదా హసన్ గ్రామానికి చెందిన బబ్లూ ఖాన్ భార్య సమీనా బీ అనే మహిళ తన వృద్ధ తండ్రితో కలిసి కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చింది. డిసెంబర్ 4వ తేదీన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులతో కలిసి బీజేపీ విజయతో సంబరాలు జరుపుకుంటున్నామని, ఈ సమయంలో ఆమె బావ జావేద్ ఖాన్, అతని తండ్రి బహీద్ ఖాన్ అడ్డుకున్నారని ఫిర్యాదు చేసింది మహిళ. బీజేపీకి ఎందుకు ఓటేశావని నిలదీసి.. ప్రశ్నించి సమీనాపై దాడికి తెగబడ్డారు జావేద్ ఖాన్. కర్రతో తీవ్రంగా కొట్టాడు. మహిళ అరుపులు విన్న ఇరుగుపొరుగు వ్యక్తులు రక్షించి, ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన సమయంలో తన భర్త బబ్లూ ఖాన్ అందుబాటులో లేరని ఫిర్యాదులో పేర్కొంది సమీనా బీ. బీజేపీకి ఓటు వేసినందుకు తన బావ శిక్షించారన్నారు. ఇప్పుడు న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చానని తెలిపింది బాధితురాలు.
జాతీయ పస్మాండ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నౌషాద్ ఖాన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఘటనపై సమాచారం అందుకున్న నౌషాద్‌ఖాన్ కలెక్టరేట్‌కు చేరుకున్న వెంటనే బాధిత ముస్లిం మహిళ, ఆమె తండ్రికి అండగా నిలిచారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
