AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections 2024: బీజేపీ, కాంగ్రెస్ రెండో జాబితాలు సిద్ధం.. నేడో, రేపో విడుదల.. తెలంగాణ నుంచి లిస్టులో ఉన్నది వీళ్లేనా..?

జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఒకేరోజు లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల రెండో జాబితా కోసం కసరత్తు చేశాయి. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో 6 రాష్ట్రాల్లోని 62 స్థానాల్లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చర్చించగా, అందులో దాదాపు 40 సీట్లకు ఆమోదం లభించింది. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థుల రెండో జాబితా వెలువడే అవకాశం ఉంది.

Lok Sabha Elections 2024: బీజేపీ, కాంగ్రెస్ రెండో జాబితాలు సిద్ధం.. నేడో, రేపో విడుదల.. తెలంగాణ నుంచి లిస్టులో ఉన్నది వీళ్లేనా..?
Bjp Congress
Mahatma Kodiyar
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Mar 12, 2024 | 11:59 AM

Share

జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఒకేరోజు లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల రెండో జాబితా కోసం కసరత్తు చేశాయి. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో 6 రాష్ట్రాల్లోని 62 స్థానాల్లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చర్చించగా, అందులో దాదాపు 40 సీట్లకు ఆమోదం లభించింది. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థుల రెండో జాబితా వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు సీఈసీలోని పలువురు నేతలు, ఆయా రాష్ట్రాల ఇన్‌చార్జులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. రాహుల్ గాంధీ మాత్రం హాజరుకాలేదు. సమావేశంలో రాజస్థాన్‌లోని 13, మధ్యప్రదేశ్‌లోని 16, ఉత్తరాఖండ్‌లోని 5, గుజరాత్‌లోని 14, అస్సాంలోని 13, కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్ డయ్యూలోని ఒక సీటుపై చర్చించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంపైనా చర్చ జరగలేదు. సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా జరిగిందని, అక్కడి నుంచి జాబితా సీఈసీకి రాగానే ఆ రాష్ట్రంలోని అభ్యర్థుల ఎంపిక కూడా జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తదుపరి సమావేశం మార్చి 15న జరిగే అవకాశం ఉంది.

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ పేర్లు ఈ జాబితాలో కనిపించవచ్చు. రాజస్థాన్‌లోని జలోర్-సిరోహి స్థానం నుంచి వైభవ్ గెహ్లాట్ పేరు ఆమోదం పొందిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రాహుల్ కశ్వాన్ ప్రస్తుత పార్లమెంట్ నియోజకవర్గం చురు నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. టోంక్‌ సవాయ్‌ మాధోపూర్‌ నుంచి హరీశ్‌ మీనాను అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశాలున్నాయి. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, జితేంద్ర సింగ్, దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్‌లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిసింది. కాంగ్రెస్ విడుదల చేసిన 39 మంది అభ్యర్థుల తొలి జాబితాలో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి మరోసారి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అమేథీ నుంచి కూడా మళ్లీ పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ వాద్రా రాయ్ బరేలీ నుంచి పోటీ చేయాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన కొందరు నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు.

100కు పైగా సీట్లకు బీజేపీ కసరత్తు

సోమవారం జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర ఎన్నికల కమిటీ రెండో సమావేశంలో 100కు పైగా సీట్ల కోసం మేధోమథనం చేసింది. అభ్యర్థుల రెండో జాబితా దాదాపు ఖరారైంది. ప్రధాని మోదీ సమక్షంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, బీహార్, హిమాచల్‌తో పాటు తెలంగాణలోని మిగతా 8 స్థానాలపై చర్చ జరిగింది. అదే సమయంలో బీహార్, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నందున అక్కడ అభ్యర్థుల జాబితా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బీహార్‌లో జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్ వర్గం) సహా ఇతర చిన్న పార్టీలు, తమిళనాడులో ఏఐఏడీఎంకే, ఒడిశాలో బీజేడీతో కుదిరిన పొత్తుల్లో ఇంకా సీట్ల సర్దుబాటు ఖరారు కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం (TDP), జనసేన పార్టీలతో పొత్తులు, సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చినప్పటికీ.. ఏయే సీట్లలో ఎవరెవరు పోటీ చేస్తారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అందుకే ఈ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగలేదు. చర్చించిన రాష్ట్రాల్లో గుజరాత్‌లోని మిగిలిన 11 సీట్లు ఉండగా.. వాటిలో 7 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. మధ్యప్రదేశ్‌లోని మిగిలిన 5 సీట్లపై చర్చ పూర్తయింది, వాటిలో 4 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో 25, తెలంగాణలో 8, కర్ణాటకలోని మొత్తం 28 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై మేధోమథనం జరిగింది. అయితే కర్ణాటకలో జేడీ(ఎస్)కు 3 సీట్లు ఇవ్వనున్నట్టు తెలిసింది. హిమాచల్‌లోని మొత్తం 4 సీట్లపై చర్చ పూర్తయింది. తెలంగాణలో చర్చించిన 8 సీట్లలో 7 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. వాటిలో ఆదివారం పార్టీలో చేరిన నేతలు ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక సీటును పెండింగులో పెట్టగా.. అది ఏ స్థానం అన్నది బహిర్గతం కాలేదు.

చర్చించిన 8 సీట్లలో..

  • ఆదిలాబాద్ – జి. నగేశ్
  • పెద్దపల్లి – శ్రీనివాస్ గోమాస
  • వరంగల్ – కృష్ణ ప్రసాద్ / ఆరూరి రమేశ్
  • మహబూబాబాద్ – సీతారాం నాయక్
  • ఖమ్మం – జలగం వెంకటరావు
  • నల్గొండ – సైది రెడ్డి
  • మెదక్ – రఘునందన్ రావు / అంజిరెడ్డి
  • మహబూబ్‌నగర్ – డీకే అరుణ / ఏపీ జితేందర్ రెడ్డి

ఈ పేర్లపై చర్చ జరిగగా.. వీటిలో ఒక స్థానం మినహా మిగతా 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ బీజేపీ 2వ జాబితా విడుదల చేయనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..