Rise of Rahul Gandhi: ఒక్కడే నడిచారు.. కమలాన్ని కుదిపారు..! రాహుల్ గాంధీ.. ద కింగ్ ఆఫ్ అలయన్స్..!
రాహుల్‌గాంధీపై ఎన్నెన్ని కామెంట్లో. తడబడ్డాడన్నారు, నిలబడలేడన్నారు, గెలవలేరన్నారు.. ఎంత తొక్కాలో అంత తొక్కే ప్రయత్నం చేశారు. బట్.. వీటన్నింటికీ ఒకేసారి సమాధానం ఇచ్చేశారు. కాంగ్రెస్‌ను ఫామ్‌లోకి తీసుకొచ్చి, కూటమిని నడిపించగలనని నిరూపించారు. సో, రాహుల్‌గాంధీ నెక్ట్స్ స్టెప్ ఏంటి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకుంటారా? కూటమి తరపున ప్రధాని అభ్యర్థి అని చెప్పేస్తారా?
రాహుల్‌గాంధీపై ఎన్నెన్ని కామెంట్లో. తడబడ్డాడన్నారు, నిలబడలేడన్నారు, గెలవలేరన్నారు.. ఎంత తొక్కాలో అంత తొక్కే ప్రయత్నం చేశారు. బట్.. వీటన్నింటికీ ఒకేసారి సమాధానం ఇచ్చేశారు. కాంగ్రెస్‌ను ఫామ్‌లోకి తీసుకొచ్చి, కూటమిని నడిపించగలనని నిరూపించారు. సో, రాహుల్‌గాంధీ నెక్ట్స్ స్టెప్ ఏంటి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకుంటారా? కూటమి తరపున ప్రధాని అభ్యర్థి అని చెప్పేస్తారా?
ఫలితాల ముందు వరకు.. బీజేపీని ఢీకొట్టగలరా అనే సందేహించారంతా. 2014లోనే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, 2019లో అంతకుమించి ఫలితాలు సాధించి.. 2024కి ఏకంగా 400 టార్గెట్ పెట్టుకుంది బీజేపీ. ప్రత్యర్ధిని తలెత్తి చూడాలంటేనే గుండెలు జారిపోవాలనే రీతిన ఎదిగి కూర్చుంది కమలం పార్టీ. ప్రధానిగా మోదీ ఛరిష్మా అంతకంతకూ పెరుగుతోంది. అయినా సరే.. కాంగ్రెస్ కూటమి అధికారానికి అడుగు దూరం వరకు రాగలిగిందంటే కారణం.. కచ్చితంగా రాహుల్ గాంధీనే. బిహార్‌లో కూటమి పార్టీ అయిన ఆర్జేడీ అనుకున్నన్ని సీట్లు దక్కించుకోలేకపోయింది. తెలంగాణలో 14కు పైగా సీట్లు వస్తాయని టార్గెట్ పెట్టుకుంటే.. 8 సీట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో ఏపీలో టీడీపీ కూటమికి ఏకంగా 21 సీట్లు వచ్చాయి. ఈ రెండు మూడు పరిణామాల వల్లే అధికారానికి అడుగుదూరంలో ఆగిపోయారు గానీ.. లేదంటే సంచలనమే జరిగేది.
2014 నుంచి దేశంలో అంతకంతకూ పెరుగుతూ వెళ్తోంది బీజేపీ. ప్రాంతీయ పార్టీలకే కాదు.. కొన్ని జాతీయ పార్టీలకు సైతం బీజేపీ ఓ బాహుబలి పార్టీ. అలాంటి పార్టీని ఢీకొట్టేందుకు ఒక్కడై బయల్దేరారు రాహుల్‌గాంధీ. దేశవ్యాప్తంగా బీజేపీని ఢీకొట్టడం అసాధ్యం కాదనేలా.. ఓ ప్రణాళిక రూపొందించుకున్నారు. అదే.. భారత్ జోడో యాత్ర. తమిళనాడు నుంచి మొదలుపెట్టి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. జోడో యాత్ర కొనసాగుతున్నప్పుడే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది రాహుల్ సాధించిన తొలి విజయం. ఆ తరువాత ఆర్నెళ్లలోనే.. పార్టీ ఉనికే లేదనుకున్న తెలంగాణలో ఏకంగా అధికారం చేపట్టింది. అలా ఒక్కొక్కటిగా రాహుల్ యాత్రతో పాటు కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగింది. ఎక్కడైతే రాహుల్ జోడో యాత్ర మొదలైందో.. అక్కడే కాంగ్రెస్ కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. తమిళనాడులో పట్టుసాధించేందుకు, తమిళులను ఆకర్షించేందుకు బీజేపీ పెద్దలు చేయని ప్రయత్నం లేదు. ఆల్‌మోస్ట్ అందరూ తమిళనాట పాగా వేసి ప్రచారం చేశారు. అలాంటి రాష్ట్రంలో బీజేపీ బోణీ కూడా కొట్టకుండా చేయగలిగారు.
కాంగ్రెస్ ముక్త్ భారత్. ఇదీ బీజేపీ నినాదం. దేశంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనేదే కమలదళం లక్ష్యం. టార్గెట్‌లో భాగంగా కాంగ్రెస్ చేతిలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్నీ చేజిక్కించుకుంటూ వచ్చింది. ఈ ఐదేళ్లలో పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెజారిటీ విజయాలన్నీ బీజేపీవే. సో, ఆ పరిస్థితుల నుంచి ఓ స్ట్రాటజీ తయారుచేసుకున్నారు రాహుల్‌గాంధీ. బీజేపీ నిలువరించాలంటే.. ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలనే ఓ నిర్ణయం తీసుకున్నారు. అదే లక్ష్యంగా ఇండియా పేరుతో ఓ కూటమిని ఏర్పాటుచేశారు. ఈ కూటమికి వచ్చిన బాలారిష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకరు సై అంటే మరొకరు నై అనేవారు. కూటమిలో, కూటమి పార్టీల మధ్య అనైక్యత. ఆ సమయంలో బీజేపీ నుంచి ఇండీ కూటమి ఎదుర్కొన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావసలు. పైగా పొత్తుల లెక్కలు తేలక.. కూటమి నుంచి ఒక్కో పార్టీ వెళ్లిపోతూ వచ్చింది. ఈ వరస చూసి ‘సరిపోయిందిక’ అని పెదవి విరిచారంతా. కాని, కూటమి ఓ జట్టుగా ఉండేలా చేయగలిగారు రాహుల్ గాంధీ.
ఇక ప్రధాన ఘట్టం.. ఎన్నికల ప్రచారం. ఎలక్షనీరింగ్, క్యాపైనింగ్‌లో బీజేపీని ఢీకొట్టడమంటే కూటమి కట్టడం కంటే టఫ్‌టాస్క్. అప్పటికే, అయోధ్య అంశంతో దూసుకెళ్తోంది బీజేపీ. ‘అబ్‌కీ బార్ 400 పార్’ అంటూ దూకుడు మీదున్న బీజేపీకి.. అదే 400 నెంబర్‌తో చెక్ పెట్టాలనుకున్నారు. ఒకవేళ బీజేపీ కూటమికి గనక 400 సీట్లు వస్తే.. భారత రాజ్యాంగాన్నే మారుస్తారంటూ ప్రచారం మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఎత్తేయాలనే పాలసీ ఆర్ఎస్ఎస్‌ది కాబట్టి.. మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లనీ ఎత్తేస్తారని గట్టిగానే ప్రచారం చేశారు. ఇది బాగా వర్కౌట్ అయింది. ఎంతగా అంటే.. ప్రధాని మోదీ-అమిత్ షా జోడీ దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని మార్చడం గానీ, రిజర్వేషన్లు ఎత్తేయడం గానీ ఉండబోదని చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే.. బీజేపీని కొంత వరకు డిఫెన్స్‌లో పడేయగలిగారు రాహుల్. మరోవైపు, బీజేపీ ప్రచారాన్ని కూడా రాహుల్‌గాంధీ ధీటుగానే ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజల ఆస్తులను పంచి పెడుతుందంటూ పెద్ద ఎత్తున దాడి చేసింది బీజేపీ. మహిళల మంగళసూత్రాలు కూడా మిగలవంటూ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టారు. కాని, దానిపై చర్చ మరింత లోతుగా వెళ్లనీయకుండా డైవర్ట్ చేయగలిగారు. ఆ అంశంపై డ్యామేజ్ జరక్కుండా ఆపగలిగారు రాహుల్ గాంధీ.
రాహుల్ గాంధీ దూకుడు కారణంగానే.. ఈ ఎన్నికల్లో సత్తా చాటగలిగింది కాంగ్రెస్. 2019లో కేవలం 52 ఎంపీ స్థానాలకే పడిపోయి.. చరిత్రలోనే ఘోరమైన ఓటమిని ఎదుర్కొంది. దేశంలో ఇక కాంగ్రెస్ పార్టీకి ఆశలు లేనట్టేనని అనుకున్నారంతా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత పడిపోతుందని ఊహించారు. కూటమి కట్టినా సరే.. సెంచరీ మార్కును మాత్రమే దాటగలరని ఎగ్జిట్ పోల్స్ అన్నీ తేల్చి చెప్పాయి. కాని, రాహుల్‌గాంధీకి పూర్తి నమ్మకం. అవి ఎగ్జిట్ పోల్స్ కాదు.. మోదీ మీడియా పోల్స్ అంటూ అప్పుడే వాయిస్ రైజ్ చేశారు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే.. కాంగ్రెస్ 99 స్థానాలు గెలిచింది, కూటమికి ఏకంగా 234 ఎంపీ స్థానాలు వచ్చాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 38 స్థానాల దూరంలో మాత్రమే ఆగారు.
ఇక రాహుల్‌గాంధీ ఎదుర్కొన్న విమర్శల జడివాన అంతాఇంతా కాదు. ఉత్తరాదిన నిలబడలేక దక్షిణాదికి వెళ్లిపోయారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలను సవాల్‌గా స్వీకరించారు. కేరళలోని వయనాడ్‌లో పోటీకి నామినేషన్ వేసిన తరువాత.. రాయ్‌బరేలీలో సైతం పోటీకి దిగారు. ఈసారి రెండు స్థానాల్లోనూ ఓటమి ఖాయం అని బీజేపీ ఎంత విమర్శించినా.. మొండిధైర్యంతోనే ఆ ఛాలెంజ్‌ను తీసుకున్నారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు.
ఈ ఎన్నికల ఫలితాలతో రాహుల్‌గాంధీ బలమైన సంకేతాలు పంపించగలిగారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకి. అందరూ ఒకే జట్టుగా నిలబడి కలబడితే.. కమలదళాన్ని ఎదుర్కోవచ్చనే దారి చూపించారు. నిన్నటి వరకు ‘అది సాధ్యమేనా’ అని అనుమానించిన వారికి కాంగ్రెస్ కూటమి సాధించిన విజయం కచ్చితంగా ఓ నమ్మకాన్నైతే కలిగించింది. అదే సమయంలో.. కాంగ్రెస్ నాయకత్వంపైనా.. ముఖ్యంగా రాహుల్‌గాంధీ లీడర్‌షిప్‌పైనా నమ్మకం పెరిగింది. కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు.. కూటమిని సైతం ముందుండి నడిపించగలరన్న నమ్మకం సాధించగలిగారు రాహుల్‌గాంధీ. ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఏమాత్రం ఊహించని ఫలితాలు వచ్చాయంటే కారణం రాహుల్‌గాంధీనే. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో కలిసి చేసిన సోషల్ ఇంజనీరింగ్ కారణంగానే.. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి తగిలిన ఈ షాక్ కారణంగానే.. సొంతంగా అధికారంలోకి రాలేకపోయింది బీజేపీ. ఈ విషయంలో రాహుల్‌గాంధీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్.
మొత్తానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాకు రాహుల్‌గాంధీనే కరెక్ట్ అని తనను తాను నిరూపించుకున్నారు. 2019లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్‌గాంధీ.. పార్టీలో ప్రజాస్వామ్యబద్ద ఎన్నికలు జరిపి మల్లికార్జున ఖర్గేకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు పార్టీని, కూటమిని ముందుండి నడిపించి.. అపోజిషన్ లీడర్‌కు కావాల్సిన అర్హతలన్నీ సాధించారు. అంతేకాదు, నరేంద్ర మోదీని ఎదుర్కోవడం అంత కష్టమేం కాదనే భావనను కూటమిలోని పార్టీలకు కల్పించగలిగారు రాహుల్ గాంధీ. కూటమిలోని మిత్రపక్షాల మధ్య.. తన మాటకు మరింత విలువ పెంచుకునేలా గట్టి ఫలితాలను సాధించి చూపించారు రాహుల్‌గాంధీ. ప్రస్తుతం.. పార్లమెంట్‌లో ఓ బలమైన నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రొజెక్ట్ అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…