BJP: ప్రధాని నివాసంలో కీలక సమావేశం.. ఏపీ, తెలంగాణలో సంచలన మార్పులు?
హస్తినలో కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో బీజేపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. కొందరు కేంద్రమంత్రులను ఆయా రాష్ట్రాలకు అధ్యక్షులుగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
హస్తినలో కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో బీజేపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. కొందరు కేంద్రమంత్రులను ఆయా రాష్ట్రాలకు అధ్యక్షులుగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీలోనూ అధ్యక్షులు మారవచ్చనే ప్రచారం జరుగుతోంది.
మోదీ నివాసంలో కీలక భేటీ..
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటు వచ్చే యేడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోంది. ఎన్నికలు జరగబోయే ఆయా రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుపై అధిష్ఠానం కసరత్తు చేపట్టింది. బుధవారం రాత్రి ప్రధాని మోదీ అధికారిక నివాసం 7- లోక్ కళ్యాణ్ మార్గ్‌లో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా మరికొందరు ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ నివాసంలో అర్థరాత్రి వరకు జరిగిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుతో పాటు కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రాల అధ్యక్షులుగా కేంద్ర మంత్రులను పంపాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. మరికొద్ది నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తోపాటు తెలంగాణ, మిజోరం, బెంగాల్, ఒడిశా, ఏపీ రాష్ట్రాల నాయకత్వ మార్పుపై నేతలు చర్చించినట్లు సమాచారం.
ఆయా రాష్ట్రాల్లో కేంద్రమంత్రులను పార్టీ అధ్యక్షులుగా పంపిస్తే, స్థానికంగా బలంగా ఉన్న ప్రత్యర్థిపార్టీకి ధీటైనా నేతలను రంగంలోకి దించినట్లు అవుతుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. మధ్యప్రదేశ్‌కి నరేంద్రసింగ్ తోమర్, ఒడిశాకు ధర్మేంద్ర ప్రధాన్, తెలంగాణకు కిషన్‌రెడ్డి, రాజస్థాన్‌కు గజేంద్రసింగ్ షేకావత్‌లను అధ్యక్షులుగా పంపించనున్నట్లు సమాచారం. ఏపీ, బెంగాల్, కర్నాటక నాయకత్వ మార్పుపై కూడా కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది.
ఆ సత్తా కిషన్‌రెడ్డికే ఉంది..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో అగ్రనేతల మధ్య లుకలుకలు, విభేదాలు, వర్గపోరుకు దారితీశాయని అధిష్ఠానం గ్రహించింది. బీజేపీలో కొత్తగా వచ్చి చేరిన నేతలు, మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకు మధ్య అగాథం ఏర్పడిందని భావిస్తోంది. పాత-కొత్తనేతల మధ్య సమన్వయం సాధించగలిగే సత్తా, సీనియారిటీ కిషన్‌రెడ్డికి మాత్రమే ఉందని, కొత్తగా పార్టీలో చేరినవారికి పగ్గాలు అప్పగిస్తే పార్టీశ్రేణులు తీవ్ర నైరాశ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అధిష్ఠానం అంచనా వేసింది. ఈ క్రమంలో కిషన్‌రెడ్డికి ఇష్టంలేకపోయినా సరే, గురుతర బాధ్యతను ఆయనకు అప్పగిస్తూ రాష్ట్రానికి పంపించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలను కిషన్‌రెడ్డి ఖండించినా..హైదరాబాద్ వెళ్లేందుకు కాన్వాయ్ సిద్ధం చేసుకొని ఆగిపోవడం, అదే సమయంలో ప్రధాని నివాసంలో కీలకసమావేశం జరడగం ఊహాగానాలకు ఊతమిస్తోంది. బీజేపీలో సంస్థాగత మార్పులు అత్యంత సహజమన్నారు ఈ పార్టీ నేత ప్రకాశ్‌రెడ్డి.
ఏపీ బీజేపీలోనూ సంస్థాగత మార్పులు?
ఇక ఏపీ బీజేపీలోనూ సంస్థాగత మార్పులు ఉండబోతున్నాయానే టాక్ వినిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మార్పు తథ్యమని..ఆ స్థానంలో కొత్త వ్యక్తికి బాధ్యతలు ఇవ్వవచ్చనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కమలం పార్టీ తీసుకునే డెసిషన్ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..