IMD Alert: చురుకుగా కదులుతున్న రుతుపవనాలు.. ముంబైలో కుంభవృష్టి.. జలమయమైన రోడ్లు..

రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా ముంబైలో కుంభవృష్టి కురుస్తోంది. వాతావరణశాఖ ముంబై నగరానికి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రుతుపవనాల ప్రభావంతో ముంబైతో పాటు మహారాష్ట్ర లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

IMD Alert: చురుకుగా కదులుతున్న రుతుపవనాలు.. ముంబైలో కుంభవృష్టి.. జలమయమైన రోడ్లు..
Rain Alert
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 29, 2023 | 9:08 AM

రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా ముంబైలో కుంభవృష్టి కురుస్తోంది. వాతావరణశాఖ ముంబై నగరానికి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రుతుపవనాల ప్రభావంతో ముంబైతో పాటు మహారాష్ట్ర లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అందేరి, చెంబూర్‌ తదితర ప్రాంతాల్లో సబ్‌వేలు నీట మునిగాయి.

థానేలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంబైతో పాటు కొంకణ్ ప్రాంతంలో రుతుపవనాలు ఉత్తరం వైపు పయనిస్తున్నందున వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. మలాడ్‌ ప్రాంతంలో చెట్టు కూలి ఓ వ్యక్తి చనిపోయారు.

రానున్న 24 గంటల్లో ముంబైతో పాటు మహారాష్ట్ర లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముంబైలోని అంధేరి, గోరేగావ్‌, దయసర్‌ తదితర ప్రాంతాల్లో వర్షాల కారణంగా జనజీవితం అస్తవ్యస్థంగా మారింది. రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో అసాధారణ వర్షాలు కురుస్తున్నాయి. అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈదురుగాలులు వణికిస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాల దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.

ఇవి కూడా చదవండి

ముంబైతో పాటు ఆ పక్కనే ఉన్న థానె, మరో ఎనిమిది జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావం మరో 5 రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ కేంద్రం. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రత్యేకంగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ముంబై, థానె, రత్నగిరి, పాల్ఘర్, రాయగఢ్.. జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అండర్‌పాస్‌లన్నీ వరదనీటితో నిండిపోయాయి. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించాయి. సబర్బన్ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. భారీ వర్షం, ఊదురుగాలుల కారణంగా మలాడ్‌లో చెట్టు కూలడంతో కౌశల్ దోషి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇక భారీ వరద ముంచెత్తడంతో అంధేరీ సబ్‌వేలో భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దాంతో బీఎంసీ అధికారులు దీన్ని మూసి వేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..