Kerala Gold Smuggling Case: సీఎం విజయన్ ప్రమేయం ఉంది.. మలుపులు తిరుగుతున్న కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు
కేరళ గోల్డ్ స్కాం కొత్తమలుపు తిరిగింది. సీఎం విజయన్ .ఆయన కుటుంబ సభ్యులకు స్కాంతో ప్రమేయముందన్న నిందితురాలి స్వప్నా సురేశ్ ఆరోపణల్లో నిజం లేదని ఎల్‌డీఎఫ్ నేతలంటున్నారు. సీక్రెట్ ఏజెండాలో భాగంగా స్వప్న సీఎం కుటుంబాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసు మళ్లీ రాజకీయ ప్రకపంనలు రేపుతోంది. సీఎం విజయన్ , ఆయన భార్య , కూతురికి ఈ స్కాంతో సంబంధం ఉందని ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్ వెల్లడించడం అధికార పార్టీకి షాక్‌ను కలిగించింది. అయితే ఈ ఆరోపణలను కొట్టి పారేశారు సీఎం విజయన్. స్వప్నా సురేశ్ రాజకీయ ఏజెండా తోనే ఈ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కొద్దిగా విరామం తరువాత మళ్లీ స్కాంలో తమ పేర్లను ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగించలేదన్నారు విజయన్. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమె ఈ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అబద్దాలను ప్రచారం చేయడంతో తమ సంకల్పం సన్నగిల్లుతుందని అనుకోవడం భ్రమేనని అన్నారు సీఎం విజయన్.
స్వప్నాసురేశ్‌ది వృధా ప్రయాస అని అన్నారు సీఎం విజయన్. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్నాసురేశ్ బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే తాజా విచారణలో ఆమె సీఎం విజయన్‌తో పాటు కుటుంబసభ్యుల పేర్లను వెల్లడించడం సంచలనం రేపింది. సీఎంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు కూడా ఈ స్కాంలో పాత్ర ఉందన్నారు స్వప్నా సురేశ్. అయితే ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే స్వప్నా సురేశ్‌ను పావుగా వాడుకుంటున్నారని అధికార పార్టీ నేతలంటున్నారు. విపక్షాలు మాత్రం వెంటనే సీఎం పదవికి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ స్కాంలో ముమ్మాటికి సీఎం పాత్ర ఉందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల. కేంద్ర దర్యాప్తు సంస్థలపై తమకు నమ్మకం లేదని , కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలన్నారు.
గత ఏడాది జులై 5న త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌కు దుబాయ్ నుంచి వచ్చిన కార్గో విమానంలో 15 కోట్ల విలువైన 30 కేజీల బంగారం పట్టుబడింది. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. సాక్షాత్తూ సీఎం కార్యాలయం సిబ్బంది సాయంతోనే దుబాయ్ నుంచి త్రివేండ్రానికి బంగారం స్మగ్లింగ్ జరిగిందని విపక్షాలు ఆరోపించాయి. స్మగ్లింగ్ కేసులో సూత్రధారిగా ఉన్న స్వప్న సురేశ్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ అండగా ఉన్నారని..ఆమెను ఈ కేసు నుంచి తప్పించడానికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని కూడా ఆరోపణలొచ్చాయి.అయితే ఇప్పుడు స్వప్నా సురేశ్ రివర్స్ కావడంతో సీఎం విజయన్‌కు చిక్కులు వచ్చాయి.




