AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waqf Row: కర్ణాటకలో తారాస్థాయికి వక్ఫ్ పంచాయితీ..! జగదాంబికా పాల్‌ పర్యటనపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్..

కర్నాటకలోని వక్ఫ్‌ భూముల వివాదం నేపథ్యంలో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌ జగదాంబికా పాల్‌ హుబ్లీలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాకుండా.. ఫిర్యాదులను కూడా స్వీకరించారు. వక్ఫ్ బోర్డు రైతుల భూ ఆక్రమణలపై విచారణ జరిపేందుకు రాష్ట్రానికి వచ్చినట్లు జగదాంబిక పాల్‌ తెలిపారు. అయితే.. జగదాంబిక పాల్‌ పర్యటనపై కాంగ్రెస్ ప్రభుత్వం మండి పడుతోంది. ఈ సందర్భంగా డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Waqf Row: కర్ణాటకలో తారాస్థాయికి వక్ఫ్ పంచాయితీ..! జగదాంబికా పాల్‌ పర్యటనపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్..
Karnataka Waqf Row
Shaik Madar Saheb
|

Updated on: Nov 07, 2024 | 6:15 PM

Share

కర్ణాటకలోని హుబ్బళ్లి, విజయపురాలో రైతుల సాగు భూములు వక్ఫ్ ఆస్తులుగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులను ఉపసంహరించుకున్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.. తరతరాలుగా రైతులు సాగుచేసుకుంటున్న భూములపై ​​వక్ఫ్ బోర్డు నోటీసులు పంపడం పట్ల కర్ణాటక బీజేపీ వక్ఫ్‌ (సవరణ) బిల్లు 2024 జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ కి ఫిర్యాదు చేసింది.. దీంతో వక్ఫ్‌ జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌ జగదాంబికా పాల్.. గురువారం కర్ణాటకలో పర్యటించడంతో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.. వాస్తవానికి.. మొదట బోర్డు భూములను వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది.. దీంతో రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవ్వడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నోటీసులను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది.. ఈ క్రమంలో.. వక్ఫ్ నోటీసులు.. రైతుల భూవివాదాలను ప్రత్యక్షంగా చర్చించేందుకు విజయపురాకు రావాలని ఎంపీ తేజస్వీ సూర్య జేపీసీ చైర్మన్ ను ఆహ్వానించడంతో.. దీనిపై సత్యాన్వేషణకు జేపీసీ అధ్యక్షుడు జగదాంబిక పాల్‌ కర్ణాటకలోరీ ఎంట్రీ ఇచ్చారు. హుబ్బళ్లి, విజయపురాల్లో పర్యటించిన.. వక్ఫ్ జాయింట్ హౌస్ కమిటీ చైర్మన్ జగదాంబిక పాల్.. రైతుల నుంచి ఫిర్యాదులు సేకరించారు.

ఈ సందర్భంగా జగదాంబిక పాల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ‘వక్ఫ్ చట్టం-2024’కు సవరణలు చేయబోతోందన్నారు. గత 60-70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని వక్ఫ్ బోర్డు తమదని చెప్పడంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ రోజు రైతులతో మాట్లాడి వివరాలు సేకరించాని.. వక్ఫ్ రైతుల వ్యవసాయ భూములే కాదు, పురావస్తు శాఖ వారసత్వ ప్రదేశాలను కూడా క్లెయిమ్ చేస్తోందంటూ పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటిపై నిజానిజాలు తెలుసుకున్న తర్వాత నివేదిస్తానని జగదాంబిక పాల్ తెలిపారు.

కాగా.. కర్ణాటకలో జగదాంబికా పాల్‌ పర్యటనపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు సహా కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ జాయింట్ హౌస్ కమిటీ పర్యటనపై డీసీఎం డీకే శివకుమార్ హుబ్బళ్లిలో మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ జాయింట్ హౌస్ కమిటీ.. బీజేపీ పార్టీ పనిలోకి వచ్చిందన్నారు. జగదాంబిక పాల్ ప్రచారం కోసం కర్ణాటకకు వచ్చారని.. JPC ఒక కంపెనీ లాంటిదంటూ ఎద్దెవా చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బసవరాజు బొమ్మై కాలంలో పహాణీలో సవరణ జరిగిందని.. రైతుల ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రశ్నే లేదని తెలిపారు. రైతులను ఆదుకుంటామని.. ఈ విషయంలో తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

జేపీసీ కమిటీ సమావేశం రాజకీయ ప్రేరేపితమని మంత్రి ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే ఏమిటి? కమిటీ సమావేశాలకు సభ్యులందరూ హాజరుకావాలా? వద్దా.. చైర్మన్ ఒక్కరు మాత్రమే వచ్చారు.. వారితో బీజేపీ నేతలు ఉన్నారు. వీరందరికీ కమిటీతో సంబంధం ఏమిటి? అంటూ ప్రశ్నించారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు అని.. మరో మంత్రి ఈశ్వర్ ఖండ్రే హావేరిలో పేర్కొన్నారు.

కాగా.. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇప్పటికే.. పలు రాష్ట్రాలలో పర్యటించి వివరాలు సేకరిస్తోంది.. ఈ క్రమంలోనే కర్ణాటక వక్ఫ్‌ బోర్డు సాగు భూములు తమవంటూ పేర్కొంటూ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.. దీనిపై కర్ణాటక ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ.. రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..