Chaddi Row: కాంగ్రెస్ – బీజేపీ నేతల మధ్య ‘చెడ్డీ’ల వివాదం.. హీటెక్కిన కర్ణాటక రాజకీయాలు..
కర్నాటక స్కూల్ పుస్తకాల్లో ఆర్‌ఎస్‌ఎస్ నేత హెగ్డేవార్ పాఠ్యాంశాన్ని చేర్చడంపై గత కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ (Congress) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.
Karnataka Chaddi Row: కర్ణాటకలో కాంగ్రెస్ – బీజేపీ నేతల మధ్య చెడ్డీల వివాదం మరింత రాజుకుంది. ఆర్ఎస్‌ఎస్ (RSS) పై మాజీ సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు బీజేపీ (BJP) నేతలు. రాష్ట్రం లోని కాంగ్రెస్ కార్యాలయాలకు చెడ్డీలను పంపించి నిరసన తెలుపుతున్నారు. కర్నాటక స్కూల్ పుస్తకాల్లో ఆర్‌ఎస్‌ఎస్ నేత హెగ్డేవార్ పాఠ్యాంశాన్ని చేర్చడంపై గత కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ (Congress) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSUI కర్ణాటక విద్యా మంత్రి బీసీ నగేష్ ఇంటి ముందు ఈ నిరసనలో ఖాకీ చెడ్డీలను కాల్చి నిరసన తెలిపింది. NSUI కార్యకర్తలను పూర్తిగా సమర్ధించారు కాంగ్రెస్ నేత సిద్దరామయ్య. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు చెడ్డీలను మార్చి ప్యాంట్లు వేసుకుంటున్నారని, అవసరమైతే చెడ్డీలను మళ్లీ కాలుస్తాం.. ఎక్కడైనా కాలుస్తాం, ఎప్పుడైనా కాలుస్తాం అంటూ సిద్దరామయ్య విమర్శలు చేశారు.
కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ఏమన్నారంటే..?
‘‘ఆర్ఎస్‌ఎస్ కార్యకర్తలు ఇప్పుడు చెడ్డీలు వేసుకోవడం లేదు. ప్యాంట్లు వేసుకుంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లు చెడ్డీలు వేసుకుంటేనే బాగుంటుంది. చెడ్డీలు మాత్రమే వాళ్లు బాగుంటాయి. ఇలా మాట్లాడితే ఏదో పెద్ద నేరం చేసినట్టు ప్రభుత్వం , పోలీసులు భావిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
కర్నాటక సీఎం ఫైర్
అయితే సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కర్నాటక ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్‌ను తిరస్కరించారని, అందుకే సిద్దరామయ్య ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని సీఎం బస్వరాజు బొమ్మై విమర్శించారు. కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. సిద్దరామయ్యకు ఏ సబ్జెక్ట్ మీద కూడా అవగాహన లేదు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. కర్నాటక ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు. కర్నాటక అభివృద్ది , భవిష్యత్ గురించి మాట్లాడకుండా ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
సిద్దరామయ్య వ్యాఖ్యలకు బీజేపీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ చెడ్డీ ఊడిపోయిందని, తమ చెడ్డీ కాపాడుకోలేనివారు ఇతరుల చెడ్డీలు కాలుస్తామంటూ హెచ్చరిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఎద్దేవాచేస్తున్నారు. సిద్దరామయ్యకు మతిభ్రమించిందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు.
వరుస ఒటమిలతో కుంగిపోవడంతోనే సిద్దరామయ్య ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేతలంటున్నారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు సిద్దరామయ్య. ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భావం నుంచి అగ్రవర్ణాల వాళ్లే చీఫ్‌గా ఉంటున్నారని , దళితులను , ఓబీసీలకు ఆ పదవి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు . అందుకే ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు చెడ్డీలు వేసుకొని తిరుగుతారని సిద్దరామయ్య తీవ్ర విమర్శలు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..