CM Mamata Banerjee: నా ప్రాణాన్ని ఇస్తాను కానీ బెంగాల్‌ను ముక్కలు కానివ్వను.. మరోసారి విరుచుకుపడిన సీఎం మమతా బెనర్జీ
నా ప్రాణాన్ని ఇస్తాను కానీ బెంగాల్‌ను విభజించడానికి ఒప్పుకోనన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధ్యక్షురాలు మమతా బెనర్జీ. బెదిరించవచ్చు, ఛాతీపై తుపాకీ పెట్టవచ్చు..
నా ప్రాణాన్ని ఇస్తాను కానీ బెంగాల్‌ను విభజించడానికి ఒప్పుకోనన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధ్యక్షురాలు మమతా బెనర్జీ. బెదిరించవచ్చు, ఛాతీపై తుపాకీ పెట్టవచ్చు, ఇంకా నేను సమైక్య బెంగాల్ కోసం పోరాడుతూనే ఉంటానని దీదీ అన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన కొందరు నాయకులు బెంగాల్ నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించిన మమతా బెనర్జీ.. ఉత్తర బెంగాల్‌లోని అన్ని వర్గాల ప్రజలు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారని అయితే బిజెపి ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు మమతా బెనర్జీ.
బెంగాల్‌ను విభజించనివ్వను…
టీఎంసీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. “బిజెపి కొన్నిసార్లు గూర్ఖాలాండ్‌ను డిమాండ్ చేస్తోంది. కొన్నిసార్లు ప్రత్యేక ఉత్తర బెంగాల్‌ను డిమాండ్ చేస్తోంది. అవసరమైతే నా రక్తాన్ని చిందించడానికైనా సిద్ధమే కానీ రాష్ట్ర విభజనను మాత్రం ఎప్పటికీ అనుమతించను. “కొందరు నన్ను బెదిరిస్తున్నారు. నేను వారికి భయపడను” అని హెచ్చరించారు. కంతాపూర్ ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని జీవన్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ హెచ్చరికపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు.