INS Nistar: సబ్ మెరైన్లకు ఆపద్బాంధవుడు INS నిస్తార్..! సేవలు మొదలు.. విశేషాలు ఇవే!
భారత నౌకాదళం తన సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ, ఆధునిక సాంకేతికతతో నిర్మించబడిన జలాంతర్గామి రక్షణ నౌక ఐఎన్‌ఎస్ నిస్తార్‌ను విజయవంతంగా ప్రారంభించింది. విశాఖపట్నం నౌకాశ్రయంలో జరిగిన వేడుకలో, ఈ నౌక జాతికి అంకితం చేయబడింది. ఐఎన్‌ఎస్ నిస్తార్, ఆపద్ధర్మంలో ఉన్న జలాంతర్గాములను రక్షించడానికి అత్యాధునిక సదుపాయాలతో నిర్మించబడింది.

భారత నావికాదళ అమ్ములపదలోకి మరో అస్త్రం చేరింది. ఆపదలో చిక్కుకొనే సబ్ మెరైన్‌లను రక్షించేందుకు ఐఎన్ఎస్ నిస్తార్ నౌక నావికాదళంలో తన సేవలను ప్రారంభించింది. నావికాదళ అధికారులు, ఉద్యోగులు మధ్య కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి నిస్తార్ ను ప్రారంభించారు. విశాఖ తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంలో వేడుకగా ఈ కార్యక్రమం జరిగింది. ఇంతకీ నిస్తార్ విశేషాలు ఏంటి..?
భారత రక్షణ రంగానికి ఆయువుపట్టు నౌక దళం. మూడు వైపుల సముద్రం ఒకవైపు పర్వతాలు ఉన్న భారతదేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది నేవీ. అటువంటి నేవీ మరింత బలోపేతం దిశగా దూసుకుపోతోంది. ఇటీవల సబ్ మెరైన్లను గుర్తించి తుదముట్టించే ఐఎన్ఎస్ అర్నాలా తూర్పు నావికా దళంలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆపదలో ఉన్న సబ్మెరైన్ల రక్షణ కోసం, రెస్క్యూ ఆపరేషన్ కోసం మరో నౌక తూర్పు నావికాదళంలో చేరింది. ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, నేవీ అధికారులు షిప్ యార్డ్ సిఎండి సమక్షంలో ఐఎన్ఎస్ నిస్తార్ ను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఆపదలో చిక్కుకునే జలాంతర్గాములను రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’ నౌకను నిర్మించారు. విశాఖ షిప్ యార్డ్ లో నిస్తార్ రూపు దిద్దుకుంది. ప్రత్యేక డైవింగ్ టీమ్, బహుళపక్ష వినియోగ డెక్‌లు, హెలికాప్టర్ కలిగి ఉండటం ఈ ఐఎన్‌ఎస్ నిస్తార్ ప్రత్యేకతలు అని అన్నారు నేవి చీఫ్ దినేష్ త్రిపాఠీ. డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్‌ఎస్ నిస్తార్ ను హిందుస్థాన్ షిప్ యార్డ్ తయారు చేసింది. ఈ నౌక విశాఖ కేంద్రంగా సేవలు అందించనుంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా పూర్థిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌక రూపు దిద్దుకుంది. దాదాపు 15 సార్లు సీ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది ఈ నిస్తార్ నౌక. తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రంగా నిస్తార్ సేవలందిస్తుంది.
స్వదేశీ పరిజ్ఞానం.. 120కి పైగా MSMEల సహకారం..
ఐఎన్‌ఎస్ నిస్తార్ నిర్మాణానికి 120కి పైగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ కంపెనీలు సహకారం అందించాయి. ఈ నౌక బరువు 10,500 టన్నులు. 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉంటుంది. సబ్ మెరైన్లలో రెస్క్యూ ఆపరేషన్లు, సబ్ మెరైన్‌లలో సిబ్బందిని అత్యవసరంగా తరలించడానికి , సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వారిని రెస్ట్యూ చేయడానికి ఐఎన్‌ఎస్ నిస్తార్ నౌక ఉపయోగపడుతుంది. ఈ నౌకలో ఎయిర్, మిక్స్‌డ్ డైవింగ్ కాంప్లెక్స్ షిప్ ఏర్పాటు చేశారు. ఇది 75 మీటర్ల లోతు వరకు డైవింగ్ చేయడానికి వీలు ఉంటుంది. అలాగే ఈ నౌకలో మెరైన్ క్రేన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇది సముద్ర గర్భం నుంచి 15 టన్నుల బరువును ఎత్తేందుకు సహాయపడుతుంది. దీని తయారీకి 80 శాతానికిపైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. పూర్తి రిమోట్ ఆధారంగా పని చేసే వెసల్ నిస్తార్. ప్రపంచ దేశాలన్నీ భారత రక్షణ వ్యవస్థ వైపు చూస్తున్నాయన్నారు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్.
షిప్ యార్డ్ కేంద్రంగా
దేశ రక్షణలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఇండియన్ నేవీకి సహాయపడేలా.. అత్యవసర సేవలను అందించేందుకు విశాఖ కేంద్రంగా ఉన్న నౌకా నిర్మాణ సంస్థ.. హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ రెండు ముఖ్యమైన నౌకలను నిర్మించింది. డైవింగ్ సపోర్టు వెసల్స్ ఐఎన్‌ఎస్ నిస్తార్, ఐఎన్‌ఎస్ నిపుణ్ లను ఏకకాలంలోనే జలప్రవేశం చేయించింది. కొద్ది రోజుల క్రితం విశాఖ నేవల్ డాక్ యార్డ్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఐఎన్ఎస్ అర్నాల యుద్దనౌకను జాతికి అంకితం చేశారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సెథ్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు
యుద్ధనౌకలకు మళ్లీ పునర్జీవం..
నిస్తార్ కమిషనింగ్ వేడుకకు ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి హాజరయ్యారు. ‘1971 లో పాక్ సబ్ మెరైన్ ఘాజి నాశనమైనట్లు నిస్తార్ నౌక గుర్తించింది. దాని విజయానికి ప్రతీకగా నిస్తార క్లాస్ వార్షిప్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సబ్ మెరైన్ రెస్క్యూ ఆపరేషన్స్, డైవింగ్ సపోర్ట్ ను నిర్వహించగల సత్తా తో నిస్తార నిర్మాణం జరిగింది. ఇండియన్ నేవీ సేవల నుంచి నిష్క్రమించిన యుద్ధనౌకలు మళ్లీ పునరుజ్జివం పొందుతున్నాయి. ఆత్మ నిర్భరభారతతో స్వదేశీ పరిజ్ఞానంతో వర్షిప్ సంఖ్య పెరుగుతుంది. ఇందులో హిందుస్థాన్ షిప్ యార్డ్ సేవలు ప్రశంసనీయం.’ అని అన్నారు నేవీ చీఫ్ త్రిపాఠి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




