AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HMPV Virus: భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు

చైనాలో ప్రస్తుతం హెచ్‌ఎంపీవీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 2024లో 327 HMPV కేసులు నమోదయ్యాయి. 2023లో 225 కేసులతో పోలిస్తే 45% పెరుగుదల కనిపించింది. చైనాతో సహా ఇతర దేశాలలో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధుల నివేదికల మధ్య ఈ పెరుగుదల భయాందోళనలు కలిగిస్తోంది.

HMPV Virus: భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
Hmpv Virus
Venkata Chari
|

Updated on: Jan 06, 2025 | 10:25 AM

Share

HMPV Virus: చైనాలో HMPV వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే తొలి కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో తొలి కేసు వెలుగు చూసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బెంగళూరులో 8 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. జ్వరం రావడంతో చిన్నారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రక్త పరీక్షలో HMPV వైరస్ ఉన్నట్లు తేలింది. అయితే, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ష్ గుప్తా ‘టీవీ9’కి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘HmPV వైరస్ భారతదేశంలోనూ ఉందని, అయితే, ఇది మ్యుటేషన్ అవునా, కాదా అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. చైనాలో వ్యాపించే వైరస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ కనిపించేది సాధారణ HMPV వైరస్ లేదా చైనీస్ జాతి అనే గందరగోళం ఉంది. సాధారణ HMPV వైరస్ కూడా భారతదేశంలో 0.78% కనిపిస్తుంది. ప్రస్తుతం ఈపాప ఫ్యామిలీకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా ఆరా తీస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని’ హర్షగుప్తా తెలిపారు.

నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది. తమ ల్యాబ్‌లో శాంపిల్‌ను పరీక్షించలేదని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపింది. ” రిపోర్టులు ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చాయి. ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను మేము అనుమానించాల్సిన అవసరం లేదు” అని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

HMPV వైరస్ అంటే ఏమిటి?

చైనాలో ఆందోళనకు కారణమైన హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ లేదా HMPV కొత్తది కాదు. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 2001లో ఇది మొదటిసారిగా కనుగొన్నారు. అయితే, కొన్ని సెరోలాజిక్ ఆధారాలు 1958 నుంచి ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించిందని నిపుణులు తెలిపారు.

ఇది కరోనా వైరస్‌కి భిన్నంగా ఉందా?

కరోనావైరస్ లేదా COVID-19 ఒక అంటు వ్యాధి. ఇది SARS-CoV-2 వైరస్ వల్ల వస్తుంది. HMPV వైరస్, కరోనా వైరస్ కొన్ని మార్గాల్లో సారూప్యతలను కలిగి ఉన్నాయి. ఈ వైరస్‌లు అన్ని వయసులవారిలో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంటాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులు ఎక్కువగా ప్రమాదంలో ఉంటారు.

ప్రస్తుతం, HMPV వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి టీకా లేదు. ప్రస్తుతం భారతదేశంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..