Snowfall in Kashmir: మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీర్.. భూతల స్వర్గాన్ని తలపిస్తున్న లోయలు..
భూతల స్వర్గం కశ్మీర్‌ను మంచు దుప్పటి కప్పేసింది. కనుచూపుమేర ఎటు చూసినా.. హిమపాతమే కనిపిస్తోంది. కశ్మీర్ పరిసరాలన్నీ శ్వేతవర్ణంతో మెరిసిపోతూ పర్యాటకులను మురిపిస్తున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు మైదాన ప్రాంతాల్లో మంచుకురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
కశ్మీర్‌లోని బందిపొరా, ద్రాస్, కార్గిల్, సోనామార్గ్, జోజిలా పాస్ ఏరియాల్లో.. ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తోంది. దాంతో ప్రకృతి సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది. శ్రీనగర్ లాంటి చోట్ల ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి చేరాయి. పర్యాటకుల స్వర్గధామంగా చెప్పే గుల్మార్గ్ అందాల్ని వర్ణించాలంటే మాటలు చాలవు. గట్టకట్టించే చలిలో మంచుతో ఆటలాడుతూ టూరిస్టులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. భూతలస్వర్గం అంటే ఇదేనేమో అంటూ సంబర పడుతున్నారు. మంచుకురిసే వేళలో కశ్మీర్ అందాలు రెట్టింపయ్యాయి. గుల్మార్గ్, పహల్గా వంటి ప్రాంతాల్లోని కొండలు, లోయలు.. మంచు అందాలను సంతరించుకున్నాయి. మైనస్ ఉష్ణోగ్రతలు కాస్త ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. మంచు అందాలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి.
హిమపాతంతో..అక్కడి కొండలు, లోయలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. కుప్వారాలోని మచిల్ సెక్టార్‌లో మంచు కురవడంతో ఆ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది. భారీగా పేరుకున్న హిమపాతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. గురేజ్, తులైల్, కంజల్వాన్ సరిహద్దు ప్రాంతాలతో సహా బందిపోరా ఎగువ ప్రాంతాలలో కూడా తెల్లటి మంచు దుప్పటి అందంగా పరుచుకుంది.
మైదాన ప్రాంతాల్లో కురుస్తున్న పొగమంచు ప్రభావం సిమ్లా వరకు వ్యాపించింది. రాబోయే మూడు రోజుల పాటు మైదాన ప్రాంతాల్లో మంచుకురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలపై పడుతున్న మంచు దృశ్యాలు ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మరోవైపు.. రహదారులపై పేరుకుపోతున్న.. మంచును అధికారులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.
View this post on Instagram
రాత్రి సమయంలో భారీగా కురుస్తున్న హిమపాతం కారణంగా జమ్మూలోని పూంచ్ , రాజౌరి జంట సరిహద్దు జిల్లాలను దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాతో కలిపే మొఘల్ రహదారిని కొంత సమయం మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు, కిష్త్వార్‌ను అనంతనాగ్ జిల్లాతో కలిపే సింథాన్ టాప్ రహదారిపై కూడా ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..