AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heavy Rains: కుండపోత వర్షాలతో విలవిలలాడుతున్న ఒడిశా, చత్తీస్‌ఘడ్‌.. వరదల బీభత్సంతో అపారనష్టం

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. గుజరాత్‌ ఇప్పటికే వరదల బీభత్సం నుంచి తేరుకోలేదు. తాజాగా ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

Heavy Rains: కుండపోత వర్షాలతో విలవిలలాడుతున్న ఒడిశా, చత్తీస్‌ఘడ్‌.. వరదల బీభత్సంతో అపారనష్టం
Heavy Rains
Balaraju Goud
|

Updated on: Sep 15, 2021 | 7:02 PM

Share

Heavy Rains in Odisha and Chhattisgarh: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. గుజరాత్‌ ఇప్పటికే వరదల బీభత్సం నుంచి తేరుకోలేదు. తాజాగా ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఒడిశాలో భారీ వర్షాల కారణంగా అపారనష్టం జరిగింది. ఆ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు , వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహానదికి వరద పోటెత్తింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. 20 లక్షల మందిపై వరదల ప్రభావం ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. భారీవర్షాల కారణంగా ఒడిశాలో ఇప్పటికే ముగ్గురు చనిపోగా వేల ఎకరాల్లో పంటనష్టం జరిగింది.

మహానదిలో భారీగా వరదనీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేలాదిమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సమీక్షించారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగం లోకి దింపారు. పూరిలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఒడిశాలో 8 రైళ్లను అధికారులు రద్దు చేశారు. చాలా రైళ్లను దారి మళ్లించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. పూరితో పాటు కటక్‌లో కూడా వరదల కారణంగా అపారనష్టం జరిగింది. ఈ రెండు జిల్లాల్లో 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. చత్తీస్‌ఘడ్‌లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజధాని రాయ్‌పూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వీధులన్నీ జలమయమయ్యాయి.

మరోవైపు, రాగల 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ మీదుగా ప్రయాణించి.. 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్టు వివరించింది. ఇక రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నట్టుగా పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది.

అటు, ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోనూ కుండపోత వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గరియాబంద్ జిల్లా గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదవుతోందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వందలాది ఇళ్లు నీట మునిగాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సకాలంలో తరలించడానికి రాష్ట్ర విపత్తు నివారణ దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్), పోలీసు బృందాలను నియమించామని చెప్పారు. పైరియా నది పొంగిపొర్లుతోంది. భారీగా వస్తున్న వరద కారణంగా గరియాబండ్, రాయపూర్‌ జిల్లాల మధ్య జాతీయ రహదారి -130 సిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

వర్షపు ప్రభావిత ప్రాంత ఇళ్లలో నివసించే ప్రజలు పంచాయితీ భవనాలకు మారాలని, గరియాబండ్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలలో ఉంటున్న వారు మంగళ భవన్‌కు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఆహారం, వసతి ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. వరద పరిస్థితిని పరిశీలించడానికి మల్గావ్ పంతోరాను సందర్శించిన గరియాబండ్ కలెక్టర్ నీలేష్ క్షీరసాగర్, వర్షపాతం ప్రభావిత 30 గ్రామాల్లో ఆస్తి నష్టంపై నివేదిక సమర్పించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. గరియాబంద్‌లోని సికాసర్ డ్యామ్‌లోని 22 గేట్లలో 17 గేట్లు తెరిచామని, 20669 క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు అధికారి తెలిపారు.మరోవైపు, రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని బిలాస్‌పూర్, కోర్బా, సూరజ్‌పూర్, బలరాంపూర్, ముంగేలి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో రాజ్‌నందగాన్, దుర్గ్ మరియు కబీర్‌ధామ్‌తో సహా ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Read Also…  బ్యాంకు ఎకౌంట్లోకి లక్షలు.. మోడీ పంపించారట.. తిరిగి ఇవ్వనంటూ మడత పేచీ! ఈ స్టోరీ వింటే నవ్వాలో.. జాలిపడాలో అర్ధం కాదు..