Air India: ఎయిర్ ఇండియా కోసం టాటా ఫైనాన్షియల్ బిడ్.. రేసులో స్పైస్ జెట్ ప్రమోటర్ కూడా..
ఎయిర్ ఇండియా సొంతం చేసుకోవడం కోసం టాటా వేగంగా ముందుకు కదులుతోంది. దానిలో భాగంగా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది.
Air India: ఎయిర్ ఇండియా సొంతం చేసుకోవడం కోసం టాటా వేగంగా ముందుకు కదులుతోంది. దానిలో భాగంగా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. ఎయిర్ ఇండియాను చేజిక్కించుకోవడానికి టాటా ఈరోజు ఆర్ధిక బిడ్ (ఫైనాన్షియల్ బిడ్) సమర్పించినట్లు తెలుస్తోంది. టాటాతో పాటు స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కూడా బిడ్ వేసినట్లు బిజినెస్ మీడియా చెబుతోంది. ఈ విషయంలో టాటా నుంచి ధృవీకరణ కూడా వెలువడింది. లావాదేవీల సలహాదారు ద్వారా ఎయిర్ ఇండియా డివెస్ట్‌మెంట్ కోసం ఆర్థిక బిడ్‌ల ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది అని టాటా పేర్కొంది.
ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం టాటా కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయితే, ఎయిర్ ఇండియా పుట్టినింటికి తిరిగి చేరినట్టే అవుతుంది. ఎందుకంటే, 1932 లో టాటా ఎయిర్‌లైన్స్‌గా జెఆర్‌డి టాటా ప్రారంభించిన ఎయిర్‌లైన్స్ తరువాత ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియాగా మారింది. ఈ విషయంపై ఒక ఎయిర్ ఇండియా ఉద్యోగి “AI (ఎయిర్ ఇండియా) సేవ్ అవుతోంది, అది దాని యజమాని దగ్గరకు తిరిగి వెళుతుంది” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మరో మార్గం లేదు..
నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను వదిలించుకోవాలని ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఎయిర్ ఇండియా సంస్థలో ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకొని పూర్తిగా ప్రైవేటీకరించడం.. లేదా మూసివేయడం తప్ప వేరే మార్గమే లేదంటూ మార్చి నెలలో వ్యాఖ్యానించారు. ప్రైవేటీకరించడమా.. లేదా ప్రైవేటీకరించకపోవడమా అన్న ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ముందు లేవని పేర్కొన్నారు. పెట్టుబడులు పూర్తిగా వెనక్కి తీసుకోవాలన్న విషయంపై ప్రత్యామ్నాయ మార్గాలేవీ లేవని, ప్రైవేటీకరణే ఫైనల్ అంటూ ఆయన వివరించారు. ఎయిర్ ఇండియాకు రోజూ రూ.20 కోట్ల చొప్పున నష్టం వస్తోందని వెల్లడించారు. ఆస్తుల పరంగా ఎయిర్ ఇండియాకు మొదటి రేటు ఉన్నప్పటికీ.. ఇప్పటికే రూ.60,000 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. అయితే ఈ రుణ భారాన్ని తగ్గించడం కోసం కొత్త యాజమాన్యం రాక తప్పదని హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు.
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు సంబంధించిన బిడ్‌ల ప్రక్రియ పూర్తయ్యేందుకు 64 రోజుల సమయం పడుతుందని అప్పట్లో హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇదంతా మే ఆఖరు నాటికి పూర్తికావచ్చని తెలిపారు. అయితే దీనికి సంబంధించి పలు పెద్ద కంపెనీలు పోటీపడుతున్నట్లు సమాచారం ఉంది. కానీ, కరోనా కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యం అయింది. ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణ దిశగా ప్రభుత్వం వేగంగా కదులుతోంది.
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్