సుర్రుమంటున్న సూర్యుడు.. వారి రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు NHRC కీలక సూచనలు..
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దేశవ్యాప్తంగా వడగాలను ఎదుర్కొనేందుకు ఢిల్లీ సహా 21 రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్థికంగా బలహీన వర్గాలు, బహిరంగ కార్మికులు, వృద్ధులు, చిన్నారులు వేడి గాలుల బారిన పడకుండా నీరు, ఆశ్రయం, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించింది. ప్రాణనష్టాన్ని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, హీట్ యాక్షన్ ప్లాన్లను సమర్థవంతంగా అమలు చేయాలని NHRC నొక్కి చెప్పింది.

నడినెత్తిన సూర్యుడు సుర్రమంటున్నాడు. 45 డిగ్రీలకు తగ్గేదే లేదంటూ జనాన్ని కాల్చేస్తున్నాడు. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడంతో ప్రజలతో పాటు ప్రభుత్వాలకు పలు కీలక సూచనలు చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్.. వృద్ధులు, పిల్లలు, శిశువులతో పాటు ఉపాధి హామీ కూలీలపై ఈ ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పిన NHRC.. వారి రక్షణకు పలు చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఎండ, వేడి గాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బలహీన వర్గాల ప్రజల ప్రాణాలను కాపాడటానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఢిల్లీ సహా 21 రాష్ట్రాలు ఆదేశించింది.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, వృద్ధులు, పిల్లలు, నవజాత శిశువులు నిరాశ్రయులు ఎండలు, వేడి గాలుల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో తగినంత ఆశ్రయం, నీరు, వైద్య సౌకర్యాలు లేకపోవడం వీరి ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పు కలిగిస్తోందని జాతీయ మానవహక్కుల కమిషన్ గమనించింది. ఈ సందర్భంగా NHRC రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖలు రాసి, వడగాలు ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రాణనష్టాన్ని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) జారీ చేసిన మార్గదర్శకాలు రాష్ట్రాల వద్ద ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPలు) ప్రకారం సహాయక చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరింది.
వేడి గాలుల వల్ల ఎవరు ప్రభావితం అవుతున్నారంటే..
వేడి గాలులు ముఖ్యంగా అణగారిన వర్గాలు, బయట పనిచేసే కూలీలు, వృద్ధులు, చిన్నారులు, శిశువులపై ప్రభావం చూపుతాయని NHRC తెలిపింది. ఇలాంటి వేడి తీవ్రత వల్ల జీవనోపాధి కోల్పోవడం, అగ్ని ప్రమాదాలు పెరగడం వంటి సమస్యలు కూడా ఎదురవ్వవచ్చని హెచ్చరించింది. 2019 నుంచి 2023 మధ్య కాలంలో వడదెబ్బ వల్ల దేశవ్యాప్తంగా 3,712 మంది మరణించినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా సూచిస్తోందని కమిషన్ ప్రస్తావించింది.
ఢిల్లీ సహా 21 రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన NHRC..
ఎండల గురించి అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ సహా 21 రాష్ట్రాలకు NHRC ఆదేశాలు జారీచేసింది.. ఇందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి.. ఈ రాష్ట్రాలు జిల్లా స్థాయి నుంచి ఎండవేడిమి ప్రభావం నుంచి ప్రభావితమయ్యేవారి కోసం ఏకీకృత కార్యాచరణ నివేదికలను NHRCకి సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. సమీకృత, సమ్మిళిత చర్యల ద్వారా మాత్రమే వడగాలుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని NHRC స్పష్టం చేసింది.. రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం హీట్ యాక్షన్ ప్లాన్లను సిద్ధం చేసి, బలహీన వర్గాలకు మంచి నీరు, ఆశ్రయం, వైద్య సహాయం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
