AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.10 లక్షల బంగారు నగలు పోగొట్టుకున్న వృద్ధురాలు.. పోలీసుల సమయస్పూర్తికి హాట్సాఫ్!

ప్రొద్దుటూరులో 70 ఏళ్ల వృద్ధురాలు ఆటోలో ప్రయాణిస్తూ రూ.10 లక్షల విలువైన బంగారు నగలను పోగొట్టుకున్నారు. ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెంటనే స్పందించారు. సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టి, కోల్పోయిన బ్యాగ్‌ను గుర్తించి, నగలను సురక్షితంగా బాధితురాలికి అప్పగించారు. పోలీసుల సమయస్పూర్తి, చాకచక్యంపై ప్రజల ప్రశంసలు.

రూ.10 లక్షల బంగారు నగలు పోగొట్టుకున్న వృద్ధురాలు.. పోలీసుల సమయస్పూర్తికి హాట్సాఫ్!
Proddatur Police Gold Recovery
Balaraju Goud
|

Updated on: Aug 13, 2026 | 4:24 PM

Share

ప్రొద్దుటూరు: ఆటోలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా కిందపడిపోయిన పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను బాధితురాలికి తిరిగి అప్పగించారు. ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసుల సమయస్పూర్తిని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు నేతాజీ నగర్‌కు చెందిన 70 ఏళ్ల ఎస్‌కే ప్యారిజాన్ ఆగస్టు 13న గురువారం రోజున తన ఇంటి నుంచి ఆటోలో ప్రొద్దుటూరు పాత బస్టాండ్‌కు బయలుదేరారు. ప్రయాణిస్తున్న సమయంలో ఆమె వద్ద ఉన్న బ్యాగ్ అనుకోకుండా ఆటో నుంచి జారి రహదారిపై పడిపోయింది. అయితే ఈ విషయం ఆమెకు వెంటనే తెలియలేదు.

ఆటోలో పాత బస్టాండ్‌కు చేరుకున్న తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో ప్యారిజాన్ ఆందోళనకు గురయ్యారు. బ్యాగ్‌లో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని గుర్తించి వెంటనే ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తన బ్యాగ్, అందులో ఉన్న బంగారు నగల వివరాలను పోలీసులకు తెలియజేశారు.

విషయాన్ని తెలుసుకున్న ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ టీవీ కొండారెడ్డి వెంటనే స్పందించారు. ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బందిని రంగంలోకి దించారు. మొదట ప్యారిజాన్ ప్రయాణించిన ఆటోను గుర్తించి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె ప్రయాణించిన మార్గంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా బ్యాగ్ ప్రొద్దుటూరు టౌన్‌లోని ఆర్ట్స్ కాలేజీ సమీపంలో పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ వెతకగా బ్యాగ్ లభించింది. అందులో సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించి, వాటిని భద్రంగా స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఆ బంగారు ఆభరణాలను ఎస్‌కే ప్యారిజాన్‌కు పోలీసులు అప్పగించారు. విలువైన నగలను తిరిగి పొందడంతో ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. బ్యాగ్ పోయిన వెంటనే ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో తక్కువ సమయంలోనే ఆచూకీ గుర్తించి నగలను తిరిగి అప్పగించడంపై ఇన్‌స్పెక్టర్ టీవీ కొండారెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బందిని అభినందించారు. పోలీసుల అప్రమత్తత, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వల్ల బాధితురాలికి భారీ నష్టం తప్పింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us