Video: ఈ పాము ఎంత మంచిదో.. రైతులకు చేసే మేలు అంతా ఇంతా కాదు.. వీడియో చూస్తే..
పాము పేరు వింటేనే కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. కాటు వేస్తే ప్రాణాలు పోతాయన్న భయంతో కనిపించిన సర్పాలన్నింటినీ కర్రలతో కొట్టి చంపేస్తుంటారు. నిజానికి పాములన్నీ శత్రువులు కావు.. కొన్ని పంటలను కాపాడే రైతు నేస్తాలు. దీనికి సంబంధించి మహిళా నేత ఇచ్చిన సందేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.

పాము పేరు వింటేనే భయపడేవారు ఎంతో మంది. ఇక పాము దగ్గరికొస్తే పరుగో పరుగు అంటాం. ప్రతి ఏటా విషసర్పాల కాటుతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుండటంతో, కనిపించిన ప్రతి పామునూ చంపేయడం సహజమైపోయింది. అయితే పాములన్నీ విషపూరితమైనవి కావు.. వాటిలో రైతులకు ఎంతో మేలు చేసే స్నేహపూర్వక పాములు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే పాములపై ఉన్న అపోహలను తొలగించి, వాటి పర్యావరణ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహారాష్ట్ర ఎన్సీపీ నేత రోహిణి ఖడ్సే తీసుకున్న చొరవ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముక్తాయి నగర్‌లోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో పర్యటిస్తున్న సమయంలో రోహిణి ఖడ్సేకు ఒక పెద్ద జెర్రిపోతు కనిపించింది. దాన్ని చూసి భయపడి పారిపోకుండా లేదా కర్రలతో కొట్టకుండా ఎంతో సమయస్ఫూర్తితో ఆ పామును తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ పామును పట్టుకుని, దానికి సంబంధించిన పూర్తి వివరాలను, వ్యవసాయ రంగంలో దాని ప్రాధాన్యతను వివరిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ఇది విషం లేని జెర్రిపోతు పాము. దీనిని నిజమైన రైతు నేస్తం అని అంటారు. పొలాల్లో పంటలను నాశనం చేసే ఎలుకలు, ఇతర క్రిమి కీటకాలను ఇది ప్రధాన ఆహారంగా తీసుకుంటుంది. కానీ భయంతోనూ, అవగాహన లేకపోవడం వల్లనూ చాలామంది ఈ విషరహిత పాములను చంపేస్తున్నారు. దీనివల్ల వీటి సంఖ్య తగ్గిపోయి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది’’ అని ఆమె అన్నారు.
జెర్రిపోతును ఎలా గుర్తుపట్టాలి?
ఈ పామును సులభంగా గుర్తించేందుకు కొన్ని ముఖ్యమైన లక్షణాలను కూడా ఆమె వివరించారు.
శరీర ఆకృతి: తల భాగం సన్నగా ఉంటుంది. మధ్యలో శరీరం కాస్త లావుగా ఉండి, తోక వైపు వచ్చేసరికి మళ్లీ సన్నగా ఉంటుంది.
రంగు: పైన గోధుమ లేదా నలుపు రంగులో ఉంటే పొట్ట కింది భాగం లేత పసుపు రంగులో ఉంటుంది.
పొడవు – చురుకుదనం: ఇది సాధారణంగా 5 నుండి 10 అడుగుల వరకు పెరుగుతుంది. చాలా వేగంగా, చురుగ్గా కదిలే స్వభావం దీనిది.
ఈ పాము కనిపించినప్పుడు కంగారుపడి దాన్ని కొట్టవద్దని, దయచేసి సంరక్షించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
తెలుగు రాష్ట్రాల రైతులకు ఇది ఎందుకు ముఖ్యం?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంట పొలాల్లో ఎక్కువగా కనిపించే పాములలో జెర్రిపోతు ఒకటి. ఎలుకల వల్ల పంటలకు జరిగే నష్టాన్ని నివారించడంలో ఇవి ప్రకృతి సిద్ధమైన పెస్ట్ కంట్రోల్‌లా పనిచేస్తాయి. అయితే మన దగ్గర కూడా అవగాహన రాహిత్యంతో దీన్ని చూసిన వెంటనే కొట్టి చంపేస్తుంటారు. అయితే పొలాల్లోనూ, నివాస ప్రాంతాల వద్దనూ ఎలుకల సంఖ్యను అదుపులో ఉంచడంలో జెర్రిపోతు పాత్ర వర్ణనాతీతం. కాబట్టి పొలాల్లో గానీ, ఇంటి పరిసరాల్లో గానీ ఇవి కనిపించినప్పుడు భయపడి ప్రాణాలు తీయకుండా స్థానిక స్నేక్ క్యాచర్స్ లేదా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడమే సరైన మార్గం.
