AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్వతాల కింద మరో అద్భుతం.. ప్రపంచంలోనే పొడవైన రైల్వే టన్నెల్ నిర్మాణం!

ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే సొరంగంగా స్విట్జర్లాండ్‌లోని 57 కిలోమీటర్ల గోథార్డ్ బేస్ టన్నెల్ ఉంది. మౌంట్ సెనిస్ సొరంగం పూర్తయితే ఆ రికార్డును అధిగమిస్తుంది. ప్రయాణికుల రైళ్లు, సరుకు రవాణా రైళ్ల వేగాన్ని పెంచడం ద్వారా పారిస్–టురిన్ వంటి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సుమారు 235 మీటర్ల పొడవైన భారీ టన్నెల్ బోరింగ్ యంత్రాలతో లోతైన రాతి పొరలను ఛేదిస్తూ 2033 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పర్వతాల కింద మరో అద్భుతం.. ప్రపంచంలోనే పొడవైన రైల్వే టన్నెల్ నిర్మాణం!
Mont Cenis Base Tunnel
Jyothi Gadda
|

Updated on: Nov 25, 2026 | 7:38 AM

Share

ఐరోపా ఖండంలో రవాణా మౌలిక సదుపాయాలను కొత్త పుంతలు తొక్కించేలా ఫ్రాన్స్, ఇటలీ మధ్య మౌంట్ సెనిస్ బేస్ సొరంగం రూపుదిద్దుకుంటోంది. ఆల్ప్స్ పర్వతాల కింద నిర్మిస్తున్న ఈ సొరంగం మొత్తం పొడవు 57.5 కిలోమీటర్లు. ఇందులో సుమారు 45 కిలోమీటర్లు ఫ్రాన్స్ పరిధిలో, మిగిలిన 12.5 కిలోమీటర్లు ఇటలీ పరిధిలో ఉంటాయి. లియోన్–టురిన్ హై-స్పీడ్, సరుకు రవాణా రైలు కారిడార్‌లో ఇది అత్యంత కీలకమైన ఘట్టం.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగంగా స్విట్జర్లాండ్‌లోని 57 కిలోమీటర్ల గోథార్డ్ బేస్ సొరంగం నిలిచింది. మౌంట్ సెనిస్ బేస్ సొరంగం పూర్తయితే 57.5 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే సొరంగంగా సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్టులో వేర్వేరు దిశల్లో రైళ్లు రాకపోకలు సాగించేందుకు రెండు ప్రధాన సమాంతర ట్యూబులు, అత్యవసర భద్రత కోసం అనుసంధాన మార్గాలు, యాక్సెస్ సొరంగాలను నిర్మిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సొరంగం పైభాగంలో సుమారు రెండు కిలోమీటర్ల వరకు దట్టమైన పర్వత శిలలు ఉంటాయి.

ఈ భారీ నిర్మాణ పనుల కోసం సుమారు 235 మీటర్ల పొడవైన అత్యాధునిక టన్నెల్ బోరింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. పర్వత మార్గాల్లో గంటల తరబడి సాగే ప్రయాణాలు, రహదారి సరుకు రవాణా వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. టురిన్ నుంచి పారిస్‌కు రైలు ప్రయాణ సమయం సుమారు నాలుగు గంటల స్థాయికి తగ్గే అవకాశం ఉంది, తద్వారా సుమారు గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఐరోపా ట్రాన్స్-యూరోపియన్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌లోని మెడిటరేనియన్ కారిడార్‌లో భాగమైన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2033 నాటికి పూర్తి చేసి సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us