AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురు పరీక్షకు తండ్రే ఇన్విజిలేటర్‌! ఇంటర్‌బోర్డు సీరియస్‌

మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్ష రాస్తున్న తన కుమార్తె గదిలోనే ఓ తెలుగు అధ్యాపకుడు ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహించారు. రక్తసంబంధీకులు పరీక్ష రాస్తున్నప్పుడు విధులకు దూరంగా ఉండాలనే నిబంధనను ఉల్లంఘించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై ఇంటర్‌బోర్డు అధికారులు రహస్య విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు..

కూతురు పరీక్షకు తండ్రే ఇన్విజిలేటర్‌! ఇంటర్‌బోర్డు సీరియస్‌
Teacher Performs Invigilation Duty In Daughters Exam Hall
Srilakshmi C
|

Updated on: Nov 25, 2026 | 6:12 AM

Share

మిర్యాలగూడ, నవంబర్ 25: నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆసక్తికర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్మీడియట్‌ పరీక్ష రాస్తున్న తన కుమార్తె గదిలోనే స్వయంగా తండ్రి ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. పరీక్షల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై ఇంటర్‌బోర్డు అధికారులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే..

మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓ తెలుగు అధ్యాపకుడు పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె పట్టణంలోని ఓ ప్రైవేటు కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఇంప్రూవ్‌మెంట్‌ కోసం ఆమెకు మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పరీక్ష కేంద్రం కేటాయించారు. అయితే గణితం పరీక్ష రోజున సదరు విద్యార్థిని పరీక్ష రాసిన గదిలోనే ఆమె తండ్రి ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహించారు. నిబంధనల ప్రకారం రక్తసంబంధీకులు ఎవరైనా పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తుంటే సంబంధిత అధ్యాపకుడు ముందుగానే ప్రిన్సిపల్‌కు సమాచారం ఇవ్వాలి. అంతేకాకుండా పరీక్ష విధులకు దూరంగా ఉండాలి. కానీ, ఈ నిబంధనలను పట్టించుకోకుండా కుమార్తె పరీక్ష రాసిన గదిలోనే తండ్రి విధులు నిర్వహించడం వివాదానికి దారితీసింది.

ఈ విషయం బయటకు రావడంతో కొందరు ఇంటర్‌బోర్డు అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సుమారు పది రోజుల క్రితం కళాశాలను సందర్శించి రహస్యంగా విచారణ చేపట్టారు. సంబంధిత వివరాలను సేకరించి, ఉద్దేశపూర్వకంగానే కుమార్తె పరీక్ష రాసిన గదిలో తండ్రి ఇన్విజిలేషన్‌ విధులు నిర్వహించినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

విచారణలో నిబంధనల ఉల్లంఘన నిజమే: దస్రూనాయక్‌

ఈ వ్యవహారంపై ఇంటర్‌బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి దస్రూనాయక్‌ స్పందించారు. ఇంటర్‌బోర్డు అధికారుల ఆదేశాల మేరకు పది రోజుల క్రితం మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. కుమార్తె గణితం పరీక్ష రాసిన రోజున ఆమె తండ్రి, తెలుగు అధ్యాపకుడు ఇన్విజిలేషన్‌ విధులు నిర్వహించినట్లు విచారణలో గుర్తించామన్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌కు ముందుగా తెలియజేయకుండా వ్యవహరించిన అధ్యాపకుడిపై నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు దస్రూనాయక్‌ వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిబంధనల అమలు ఎంతో కీలకం. అలాంటి బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న అధ్యాపకుడే నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us