AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Lesson: మీ విలువ గుర్తించని వారి కోసం ఎందుకు ఆరాటపడాలి? ఈ కథ చెప్పే జీవిత సత్యం ఇదే!

మన జీవితంలో ఇతరులకు సహాయం చేయడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, స్నేహితుల కష్టాల్లో తోడుగా ఉండటం ఎంతో గొప్ప లక్షణాలు. అయితే ఎదుటివారి కోసం ఆలోచిస్తూ మనల్ని మనం మర్చిపోతే మాత్రం చివరికి మిగిలేది బాధ, ఒంటరితనమే. మనం అందరికీ ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు.. మనకు కూడా ఎవరైనా అదే స్థాయిలో విలువ ఇస్తున్నారా? అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. ఈ విషయాన్ని క్లారా అనే యువతి జీవితంలో జరిగిన ఓ సంఘటన ఎంతో అద్భుతంగా వివరిస్తుంది..

Life Lesson: మీ విలువ గుర్తించని వారి కోసం ఎందుకు ఆరాటపడాలి? ఈ కథ చెప్పే జీవిత సత్యం ఇదే!
Stop Losing Yourself While Trying To Make Everyone Happy
Srilakshmi C
|

Updated on: Nov 24, 2026 | 12:43 PM

Share

పచ్చని కొండల మధ్య ఉన్న ఓ అందమైన గ్రామంలో క్లారా అనే యువతి నివసించేది. ఆమెకు ఎంతో ఉదారమైన హృదయం. గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది క్లారానే. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వెళ్లి పలకరించేది. పొరుగువారికి సరుకులు మోయడంలో సహాయం చేసేది. స్నేహితులకు బాధ కలిగితే గంటల తరబడి వారి మాటలు వినేది. ఎవరి పుట్టినరోజు అయినా గుర్తుంచుకునేది. వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు, చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోయేది కాదు. ఇతరుల పట్ల శ్రద్ధ చూపడం మనిషి చేయగలిగే అత్యంత గొప్ప పని అని ఆమె నమ్మేది. కానీ ఆమెకు తెలియని విషయం ఒక్కటే. ఎదుటివారికి సహాయం చేయడం మంచిదే.. కానీ అందరి కోసం తనను తాను పూర్తిగా మర్చిపోవడం మాత్రం మంచిది కాదు.

క్లారాకు ఎలీనా అనే సన్నిహిత స్నేహితురాలు ఉండేది. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి పెరిగారు. ఎన్నో రహస్యాలు, కలలు, సంతోషాలు, బాధలు పంచుకున్నారు. ఎలీనా తన జీవితంలో ఎప్పటికీ ఉంటుందని క్లారా బలంగా నమ్మేది. ఎలీనాకు డబ్బు అవసరమైనప్పుడు క్లారా సహాయం చేసేది. ఆమె బాధలో ఉన్నప్పుడు రాత్రంతా మేల్కొని తన మాటలు వినేది. ఎక్కడికైనా వెళ్లాలంటే తన పనులను పక్కనపెట్టి తోడుగా వెళ్లేది. సలహా కావాలన్నా వెంటనే అందుబాటులో ఉండేది. అయితే కాలం గడిచేకొద్దీ ఎలీనా జీవితం మారిపోయింది. ఆమె మంచి ఉద్యోగంలో స్థిరపడింది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరిగాయి. తన కెరీర్, సామాజిక జీవితంతో బిజీ అయిపోయింది. మొదట్లో క్లారా తన స్నేహితురాలి ఎదుగుదలను చూసి సంతోషించింది. కానీ కొంతకాలానికి ఎలీనాకు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే క్లారా గుర్తుకొస్తోందని ఆమెకు అర్థమైంది.

అవసరం ఉన్నప్పుడే గుర్తొచ్చే స్నేహం!

ఒకరోజు సాయంత్రం ఎలీనా నుంచి క్లారాకు సందేశం వచ్చింది. ‘నువ్వు వెంటనే నా దగ్గరకు రాగలవా? నాకు నీ అవసరం చాలా ఉంది’ అని అందులో ఉంది. క్లారా వెంటనే తన పనులన్నీ పక్కనపెట్టి ఎలీనా ఇంటికి వెళ్లింది. గంటల తరబడి ఆమె సమస్యలను వింటూ కూర్చుంది. చివరకు తన జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలను ఎలీనాతో పంచుకోవాలని ప్రయత్నించింది. కానీ ఎలీనా మాత్రం తన ఫోన్ చూస్తూ.. ‘క్షమించు క్లారా.. నేను చాలా అలసిపోయాను. మనం మరోసారి మాట్లాడుకుందాం’ అని చెప్పింది. క్లారా నవ్వుతూ సరేనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు క్లారాకు ఒక ముఖ్యమైన సమావేశం ఉండటంతో కొంత ఆందోళనగా అనిపించింది. తన మనసులోని మాటలను పంచుకోవడానికి ఎలీనాకు ఫోన్ చేసింది. ఒకసారి కాదు.. పలుమార్లు ప్రయత్నించింది. కానీ ఎలీనా స్పందించలేదు. కొన్ని గంటల తర్వాత ఎలీనా నుంచి ఒక చిన్న సందేశం వచ్చింది.

ఇవి కూడా చదవండి

‘క్షమించు.. నేను బిజీగా ఉన్నాను.’ ఆ రెండు పదాలు క్లారా మనసును తీవ్రంగా బాధించాయి. ఎందుకంటే ఎలీనా కోసం తాను ఎన్నిసార్లు తన పనులను పక్కనపెట్టిందో ఆమెకు గుర్తొచ్చింది. తాను ఎలీనాను తన జీవితంలో ఒక ప్రాధాన్యతగా చూసుకుంటుంటే.. ఎలీనా మాత్రం తనను అవసరమైనప్పుడు గుర్తొచ్చే ఒక ఎంపికగా మాత్రమే చూస్తోందని అర్థం చేసుకుంది.

పగిలిన మట్టి గిన్నె చెప్పిన జీవిత పాఠం

అయినా క్లారా తన స్నేహాన్ని కోల్పోవడానికి ఇష్టపడలేదు. అందుకే మరింత శ్రద్ధ చూపించింది. తరచూ సందేశాలు పంపేది. భోజనానికి ఆహ్వానించేది. ప్రతి ముఖ్యమైన సందర్భాన్ని గుర్తుంచుకునేది. కానీ స్నేహాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆమెకు ఒంటరితనం మాత్రం పెరుగుతూనే ఉంది. ఒకరోజు వర్షం పడుతున్న సమయంలో క్లారా ఇంటికి వెళ్తూ ఓ చిన్న కుండల దుకాణం దగ్గర ఆగింది. అక్కడ ఒక వృద్ధురాలు పగిలిపోయిన మట్టి గిన్నెను జాగ్రత్తగా అతికిస్తూ కనిపించింది. దాన్ని చూసిన క్లారా.. ‘దాన్ని పారేయకుండా ఎందుకు మరమ్మతు చేస్తున్నారు?’ అని అడిగింది. అందుకు వృద్ధురాలు నవ్వుతూ.. ‘కొన్ని వస్తువులు మరమ్మతు చేయడానికి విలువైనవి’ అని చెప్పింది. అనంతరం గిన్నెలోని పగుళ్లను చూపిస్తూ ఇలా అంది.

‘ఈ గిన్నెలోని ముక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి దీన్ని తిరిగి బాగు చేయగలుగుతున్నాను. కానీ ప్రతిరోజూ ఎవరో ఒకరు ఇందులోని ముక్కలను తీసుకెళ్తుంటే ఏం జరుగుతుంది? ఈరోజు ఒక ముక్క, రేపు మరో ముక్క.. ఇలా అన్నీ తీసుకెళ్తే చివరికి దాన్ని మరమ్మతు చేయడానికి ఏమీ మిగలదు కదా!’ ఆ మాటలు క్లారా మనసును తాకాయి. వృద్ధురాలు మళ్లీ ఇలా చెప్పింది. ‘మనుషుల మధ్య సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి. ఒకరు ఎప్పుడూ ఇస్తూనే ఉండి, మరొకరు తీసుకుంటూనే ఉంటే.. ఒకరోజు ఇచ్చే వ్యక్తి దగ్గర ఏమీ మిగలదు.’ క్లారా తన బాధనంతా ఆ వృద్ధురాలితో పంచుకుంది. ఎలీనాకు తాను ఎప్పుడూ ఎలా సహాయం చేసిందో, తనకు అవసరమైనప్పుడు మాత్రం ఎలా నిర్లక్ష్యానికి గురయ్యానో వివరించింది. ‘కానీ నేను నా స్నేహితురాలిని కోల్పోవడానికి ఇష్టపడటం లేదు’ అని బాధగా చెప్పింది. అప్పుడు వృద్ధురాలు ఎంతో ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చింది.

‘బహుశా ఆమె లేకుండా నీ జీవితం అసంపూర్ణంగా మారిపోతుందని నువ్వు భయపడుతున్నావేమో! కానీ ఒక్కసారి ఆలోచించు.. నిన్ను పట్టించుకోని వ్యక్తులను నీ జీవితంలో ఉంచుకోవడం వల్ల నీ జీవితం ఎలా మారుతుంది?’ ఆ ప్రశ్న క్లారాను ఆలోచనలో పడేసింది. ఇన్నాళ్లూ ఎలీనాను ఎలా తన జీవితంలో ఉంచుకోవాలా అని ఆలోచించింది. కానీ ఆమె కోసం తనను తాను ఎందుకు కోల్పోతున్నానని ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. తనకు తాను ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుంది. ఆ రాత్రి క్లారా ఇంటికి వెళ్లి చాలా సేపు ఆలోచించింది. తనను పట్టించుకోని వ్యక్తుల వెంట తాను ఎన్నిసార్లు పరుగెత్తిందో గుర్తుచేసుకుంది. తనను బాధపెట్టిన వారిని ఎన్నిసార్లు క్షమించిందో, ప్రతిఫలం ఆశించకుండా ఎన్నిసార్లు సహాయం చేసిందో ఆలోచించింది. చివరకు ఆమెకు ఒక నిజం అర్థమైంది.

తాను ఒంటరిగా ఉండటానికి భయపడటం లేదు. కానీ అందరి వెంట పరుగెత్తడం మానేస్తే తనతో ఉండటానికి ఎవరూ ఇష్టపడరేమోనని భయపడుతోంది. ఆ ఆలోచన ఆమెను బాధపెట్టినా.. అదే సమయంలో కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. మరుసటి రోజు నుంచి క్లారా తనను తాను నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకుంది. ఎదుటివారికి సహాయం చేయడం మానేయలేదు. కానీ తన అవసరాలు, తన సంతోషం, తన సమయానికి కూడా విలువ ఇవ్వడం ప్రారంభించింది. కొంతమంది స్నేహితులు ఆమె మార్పును గమనించి.. ‘క్లారా.. నువ్వు పూర్తిగా మారిపోయావు’ అని అన్నారు. అందుకు ఆమె చిరునవ్వుతో.. ‘అవును.. బహుశా నేను మారి ఉండవచ్చు’ అని సమాధానమిచ్చింది.

ఈ కథ మనకు నేర్పే జీవిత పాఠాలు

అందరికీ సహాయం చేయండి.. కానీ మిమ్మల్ని మీరు మర్చిపోకండి: ఇతరుల కోసం జీవించడం గొప్ప విషయమే. అయితే మీ సంతోషం, ఆరోగ్యం, ప్రశాంతత కూడా అంతే ముఖ్యం. మీ విలువను గుర్తించని వారి వెంట పరుగెత్తకండి: మీకు అవసరమైనప్పుడు మాత్రమే గుర్తుకొచ్చే వ్యక్తుల కోసం మీ సమయాన్ని, శక్తిని పూర్తిగా ఖర్చు చేయకండి. స్నేహం అనేది ఇచ్చిపుచ్చుకునే అనుబంధం: ఒకరే ఎప్పుడూ ప్రయత్నిస్తూ, మరొకరు పట్టించుకోకపోతే ఆ బంధం ఆరోగ్యకరమైనది కాదు. అవసరమైనప్పుడు ‘నో’ చెప్పడం నేర్చుకోండి: ప్రతి ఒక్కరి కోరికలను తీర్చడం మీ బాధ్యత కాదు. మీకు ఇష్టం లేని విషయాలకు మర్యాదగా నిరాకరించవచ్చు.

ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి: మీకు మీరు విలువ ఇచ్చుకున్నప్పుడే ఇతరుల నుంచి గౌరవాన్ని ఆశించగలుగుతారు. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం మీ జీవితాన్ని చీకటిగా మార్చుకోకండి. మీ మంచితనాన్ని కొనసాగించండి.. కానీ మీ ఆత్మగౌరవాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకండి. ఎందుకంటే అందరి కోసం నిలబడే మీరు.. మీ కోసం కూడా నిలబడటం నేర్చుకోవాలి!

Follow Us
మీ విలువ గుర్తించని వారి కోసం ఎందుకు ఆరాటపడాలి? ఈ కథ చదవండి
మీ విలువ గుర్తించని వారి కోసం ఎందుకు ఆరాటపడాలి? ఈ కథ చదవండి
ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలం.. పెసరపప్పు కిచిడీ ఇలా చేస్తే..
ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలం.. పెసరపప్పు కిచిడీ ఇలా చేస్తే..
ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే అశుభమా? కొత్త మొక్కను ఎప్పుడు నాటాలి?
ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే అశుభమా? కొత్త మొక్కను ఎప్పుడు నాటాలి?
వచ్చే 40 రోజులు గోల్డెన్ డేస్.. వీరి డ్రీమ్స్ సాకారం కాబోతున్నాయి
వచ్చే 40 రోజులు గోల్డెన్ డేస్.. వీరి డ్రీమ్స్ సాకారం కాబోతున్నాయి
గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. నకిలీ బంగారంతో బురిడీ
గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. నకిలీ బంగారంతో బురిడీ
అనంత్‌ అంబానీ మంచిమనసు కాలు విరిగిన ఏనుగు పిల్లకు చికిత్స
అనంత్‌ అంబానీ మంచిమనసు కాలు విరిగిన ఏనుగు పిల్లకు చికిత్స
అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్..
అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్..
రూ.40 లక్షలు ఇచ్చారు..తీరా కట్టలు విప్పిచూసి లబోదిబోమన్న వ్యాపారి
రూ.40 లక్షలు ఇచ్చారు..తీరా కట్టలు విప్పిచూసి లబోదిబోమన్న వ్యాపారి
వెయిట్ లాస్ ఇంజెక్షన్ల పేరుతో భారీ దందా.. వాట్సాప్‌లో ఆర్డర్లు..
వెయిట్ లాస్ ఇంజెక్షన్ల పేరుతో భారీ దందా.. వాట్సాప్‌లో ఆర్డర్లు..
కుజ, కేతువుల కటాక్షం.. డిసెంబర్ 5 వరకు అదృష్టమంటే వీరిదే!
కుజ, కేతువుల కటాక్షం.. డిసెంబర్ 5 వరకు అదృష్టమంటే వీరిదే!