UPSC ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసా..? టాపర్ IAS రితికా తివారీని అడిగిన ప్రశ్నలివే!
UPSC సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలు డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో UPSC CSE 2025 ఇంటర్వ్యూకు హాజరైన రితికా తివారీ తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మోడలింగ్ కెరీర్, ఆర్థిక శాస్త్రం, పోర్షే హిట్ అండ్ రన్ కేసు, మహిళల భద్రత, పుస్తకాలు, పర్యాటక ప్రాంతాల వరకు బోర్డు సభ్యులు ఆమెను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఇంతకీ ఆమెకు ఎదురైన ప్రశ్నలేమిటి? ఇంటర్వ్యూలో ఆమె ఎలా స్పందించారు? తెలుసుకుందాం..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 ఇంటర్వ్యూలు డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థుల అనుభవాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా 33వ ర్యాంక్ సాధించి IAS గా సెలెక్ట్ అయిన రితికా తివారీ తన UPSC ఇంటర్వ్యూ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మోడలింగ్ కెరీర్ నుంచి ఆర్థిక శాస్త్రం, మహిళల భద్రత, పుస్తకాలు, పర్యాటక ప్రాంతాల వరకు బోర్డు సభ్యులు ఆమెను పలు అంశాలపై ప్రశ్నించారు. UPSC అధికారిక ప్రకటన ప్రకారం, సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 పర్సనాలిటీ టెస్ట్ డిసెంబర్ 7, 2026 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 2,526 మంది అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూ దశకు హాజరుకానున్నట్లు సమాచారం. నవంబర్ 5న విడుదలైన UPSC CSE మెయిన్స్ ఫలితాల ఆధారంగా డిసెంబర్ 7 నుంచి 12 వరకు పర్సనాలిటీ టెస్టులు నిర్వహించనున్నారు.
మోడలింగ్ కెరీర్‌తో మొదలైన ప్రశ్నలు
ఇన్‌స్టాగ్రామ్‌లో రితికా తివారీగా తనను పరిచయం చేసుకున్న అభ్యర్థిని, UPSC ఇంటర్వ్యూకు రెండుసార్లు హాజరైనట్లు వెల్లడించారు. UPSC CSE 2025లో 946 మార్కులు సాధించినట్లు ఆమె తన ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. తన ఇంటర్వ్యూ అనుభవాన్ని వివరిస్తూ.. తొలుత బోర్డు చైర్‌పర్సన్ తన మోడలింగ్ కెరీర్ గురించి ప్రశ్నించినట్లు తెలిపారు. మోడలింగ్ రంగంలో తన అనుభవం ఏమిటి? ఆ పరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలు ఏమిటి? వంటి ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు. ఇంటర్వ్యూలో ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలతో పాటు, అప్పట్లో వార్తల్లో నిలిచిన పోర్షే కారు హిట్ అండ్ రన్ ఘటనపై కూడా ప్రశ్నలు ఎదురయ్యాయని రితికా వెల్లడించారు. ఓ టీనేజర్ పోర్షే కారును నడుపుతూ ప్రమాదానికి కారణమైన ఘటనపై బోర్డు సభ్యులు ఆమె అభిప్రాయాన్ని అడిగారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మరింత కఠినమైన చట్టాలు, విధానాలు అవసరమా? అని ప్రశ్నించినట్లు తెలిపారు. అనంతరం పన్నుల విధానం (Taxation), ప్రిలిమ్స్ స్థాయి కాన్సెప్ట్ ప్రశ్నలు కూడా అడిగినట్లు చెప్పారు.
సమాధానం తెలియకపోయినా నిజాయితీగా స్పందన
ఇంటర్వ్యూలో తనకు తెలియని ఆర్థిక శాస్త్ర ప్రశ్న ఎదురైనప్పుడు.. ‘సారీ సర్, ఈ విషయం నాకు తెలియదు’ అని నిజాయితీగా చెప్పినట్లు రితికా వివరించారు. తాను ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ, ఆ తర్వాత సోషియాలజీలో మాస్టర్స్ చేసి, జేఆర్‌ఎఫ్ సాధించిన విషయాన్ని బోర్డుకు వివరించినట్లు తెలిపారు. ఇంటర్వ్యూ మొత్తం ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు పదేపదే ఎదురయ్యాయని పేర్కొన్నారు. తన జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? మహిళల భద్రతను మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే ప్రశ్నలను కూడా బోర్డు సభ్యులు అడిగినట్లు రితికా తెలిపారు. అలాగే తనకు ఇష్టమైన పుస్తకాలు, 20వ శతాబ్దానికి చెందిన ఓ స్వీయ అభివృద్ధి పుస్తకం (Self-help Book), మోడలింగ్ రంగానికి సంబంధించిన విషయాలపై ప్రశ్నలు ఎదురయ్యాయని చెప్పారు. తొలి భారతీయ మిస్ వరల్డ్ ఎవరు? అనే ప్రశ్నతో పాటు తన హాబీల గురించి కూడా అడిగినట్లు వెల్లడించారు.
కేరళ, కాజా ప్రాంతాల మధ్య తేడా ఏమిటి?
ఇంటర్వ్యూలో మరో ఆసక్తికరమైన ప్రశ్న తనకు ఇష్టమైన ప్రదేశాలు, ఇటీవల సందర్శించిన ప్రాంతాల గురించి ఎదురైందని రితికా చెప్పారు. తాను కేరళ, కాజా ప్రాంతాలను సందర్శించినట్లు చెప్పడంతో.. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రధాన తేడా ఏమిటి? అని బోర్డు సభ్యుడు ప్రశ్నించినట్లు వివరించారు. తన UPSC ఇంటర్వ్యూలో వ్యక్తిగత అనుభవాలు, విద్యార్హతలు, సమకాలీన అంశాలు, ఆర్థిక శాస్త్రం, సామాజిక సమస్యలు, పర్యాటకం వంటి విభిన్న అంశాలపై ప్రశ్నలు ఎదురైనట్లు రితికా తివారీ వెల్లడించారు. UPSC ఇంటర్వ్యూలో కేవలం పుస్తకాల్లోని పరిజ్ఞానమే కాకుండా, అభ్యర్థి వ్యక్తిత్వం, సమయస్ఫూర్తి, నిజాయితీ, సమకాలీన అంశాలపై అవగాహన, ప్రశ్నలకు సమతుల్యంగా స్పందించే సామర్థ్యాన్ని కూడా పరిశీలిస్తారనే విషయాన్ని ఈ అనుభవం తెలియజేస్తోంది.




