కమలా పండు కంటే 5రేట్లు ఎక్కువగా విటమిన్ సి.. షుగర్‌ను కంట్రోల్ చేసే అద్భుతమైన పండు..
తక్కువ ధరకే మార్కెట్లో లభించే జామపండులో విటమిన్ సి, ఫైబర్ సహా ఎన్నో పోషకాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి, జీర్ణక్రియ మెరుగుపరుచుకోవాలనుకునేవారికి ఇది మంచి ఆహార ఎంపిక. రోగనిరోధక శక్తికి కూడా తోడ్పడుతుంది. శీతాకాలంలో విరివిగా దొరికే జామపండును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.

మనకు మార్కెట్లో సులువుగా, తక్కువ ధరకు లభించే పండ్లలో జామపండు ఒకటి.. సాధారణంగా, మనవారు చవకగా దొరికే వాటిని అంతగా పట్టించుకోరు. కానీ జామపండు విషయంలో ఈ అభిప్రాయం సరికాదు. తక్కువ ధరకే లభించినా, జామకాయలో ఉన్న పోషకాలు మరే ఇతర పండ్లలోనూ దొరకవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనిని పేదల ఆపిల్ అని కూడా పిలుస్తారు. జామలో అద్భుతమైన పోషకాలతో పాటు.. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే, దీనిని తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జామపండులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి జామపండు ఒక అద్భుతమైన ఎంపిక. దీనిలో అధిక పీచు పదార్థం ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగి, అతిగా తినడాన్ని నివారిస్తుంది.
ఇది మలబద్ధకం సమస్యను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారికి జామపండు చాలా మంచిది. దీనిలోని పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
పోషకాల విషయంలో జామపండు ఇతర పండ్లను మించి ఉంటుంది. కమలా (నారింజ) పండులో లభించే విటమిన్ సి కంటే జామపండులో ఐదు రెట్లు అధికంగా ఉంటుంది. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి అంటారు కదా, వాటిలో దొరికే పీచు పదార్థం కంటే జామపండులో రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ఒకే ఒక్క జామకాయలో పది ఆపిల్స్ లో ఉండే పోషకాలు ఉంటాయట. కాబట్టి తక్కువ ధరకు వస్తుందని జామపండును తక్కువ అంచనా వేయకుండా, నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జామపండు శీతాకాలం సీజన్‌లో ఎక్కువగా లభిస్తాయి.. అంతేకాకుండా ధర కూడా తక్కువగా ఉంటుంది. అందుకే.. జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ సీజన్‌లో దొరికే జామను తినాలని డైటీషియన్లు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
