SAD BJP Alliance: ఎన్నికల వేళ కీలక పరిణామం.. మళ్లీ NDAలోకి అకాళీదల్.. పొత్తు ప్రకటన
దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మధ్య మరోసారి పొత్తు కుదిరింది. దీనితో శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరింది. ఈ మేరకు శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో నితిన్ నబీన్, అమిత్ షాతో భేటీ అయ్యారు.

పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ – అకాలీదళ్ మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. ఆరేళ్ల క్రితం NDA కూటమిలో నుంచి తప్పుకున్న శిరోమణి అకాలీదళ్ పార్టీ మళ్లీ ఇప్పుడూ కూటమిలోకి చేరింది. తాజాగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు నితీన్ నబీన్, కేంద్ర హోమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో అకాళీదల ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈరోజు నుంచి అకాలీదళ్ ఎన్డీఏ భాగస్వామిగా కొనసాగుతుందని, ఇకపై వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
కలయికపై అమిత్‌షా ప్రకటన
అకాళీదల్ మళ్లీ కూటమిలో చేరడంపై కేంద్ర మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ.. ఈరోజు నుంచి అకాలీదళ్ ఎన్డీఏ భాగస్వామిగా కొనసాగుతుందని, ఇకపై వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. ఎన్డీఏలోని చిరకాల మిత్రుడైన అకాలీదళ్ మళ్లీ తిరిగిరావడం మిగతా భాగస్వాములందరికీ సంతోషం కలిగించే అంశమని, గురుపూర్ణిమ పర్వదినాన ఈ వార్త అందరికీ సంతోషదాయకమని పేర్కొన్నారు. బాదల్ తిరిగిరావడంతో ఎన్డీఏ పూర్ణత్వం సంతరించుకుందని, బీజేపీ-అకాలీదళ్ సంబంధం హిందూ-సిఖ్ సహృద్భావానికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపాయి. గతంలో తాము అనేక ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని, అనేక ఎన్నికలు గెలిచామన్నారు.
గతంలో కూటమికి అకాలీదళ్ వీడ్కోలు
గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా 2020 సెప్టెంబర్ 26న శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. అయితే, ఈ ఏడాది ఆగస్టులో అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు అకాలీదళ్ మద్దతు తెలిపింది. ఇటీవల చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆప్‌లను వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా పొత్తు చర్చలకు సిద్ధమని అకాలీదళ్ ప్రకటించడం ఈ కలయికకు మార్గం సుగమం చేసింది.
సీట్ల సర్దుబాటు
పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 40 నుండి 48 సీట్లను బీజేపీ అడుగుతోంది. రాష్ట్రంలో గ్రామీణ జాట్ సిక్కు ఓటర్లపై అకాలీదళ్‌కు బలమైన పట్టు ఉండగా, పట్టణ హిందూ, వ్యాపార వర్గాల ఓటర్లపై బీజేపీకి పట్టు ఉంది. ఇక గత లోక్‌సభ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే.. బీజేపీకి 18.56 శాతం ఓట్లు రాగా, అకాలీదళ్ 13.42 శాతం ఓట్లతో ఒక లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల కలయిక పంజాబ్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
