Ration Card: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి పండుగే పండగ.. ఎగిరి గంతేసే వార్త చెప్పిన ప్రభుత్వం..
ఏపీలో రేషన్ కార్డు ఉందా.. అయితే ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రేషన్ షాపుల్లో కందిపప్పు, గోధుమపిండి, పామాయిల్ తక్కువ ధరకే అందించనుంది. ఇది లక్షలాది సమాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చనుంది. వీటిని మూడు నెలల పాటు నిరంతరం సరఫరా చేయనున్నారు.

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను అతి తక్కువ ధరకే సబ్సిడీ ప్రాతిపదికన అందించాలని నిర్ణయం తీసుకుంది. ఎల్‌నివో ప్రభావంతో దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతున్నాయి. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారంగా మారుతున్నాయి. నెలవారీ ఇంటి ఖర్చుల కోసం ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది. దీని నుంచి సామాన్య ప్రజలకు కొంత ఆర్థిక ఊరట కల్పించాలనే లక్ష్యంతో కిరాణా సరుకులను తక్కువ ధరకే రేషన్ షాపుల ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యంనే కాకుండా కందిపప్పు, గోధుమపిండి, పామాయిల్ వంటివి కూడా అందించనుంది.
డిసెంబర్ 1వ తేదీ నుంచి నిత్యావసర సరుకులను కూడా సబ్సిడీ ధరకు ఏపీ ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు ధరలను కూడా ఫిక్స్ చేసింది. కిలో కందిపప్పును రూ.100కు అందించనుంది. రిటైల్ మార్కెట్లో ఇదే కందిపప్పు ధర కిలోకు రూ.170 నుండి రూ.200 వరకు పలుకుతోంది. కానీ షాపుల ద్వారా కేవలం రూ.100కే అందించనుంది. కిలో గోధుమపిండిని రూ.25కు, లీటర్ పామాయిల్‌ను రూ.125కు విక్రయించనున్నారు. ఈ మూడు వస్తువులను నిర్ణయించిన పరిమాణంలో కొనుగోలు చేస్తే మొత్తం రూ.250కే పొందవచ్చు. అయితే లబ్దిదారులందరికీ అందించాలనే లక్ష్యంతో కొన్ని పరిమితులు విధించారు. ప్రతి రేషన్ కార్డుకు నెలకు ఒక కిలో కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్ చొప్పున పంపిణీ చేయనున్నారు.
ఇక గోధుమపిండికి సంబంధించి నెలవారీ కోటా పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. నిల్వలను బట్టి వచ్చిన వారికి ప్రాధాన్యత ఆధారంగా గోధుమపిండిని పంపిణీ చేయనున్నారు. మూడు నెలల పాటు ఈ రాయితీ సరుకులను సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఇది అమలు చేసేందుకు రూ.100 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. మూడు నెలలకు కలిపి సుమారు రూ.300 కోట్లకు పైగా రాయితీ భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటు ప్రభుత్వం మరికొన్ని కార్యక్రమాలను కూడా కొనసాగిస్తోంది. రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయిస్తోంది. ఆధార్ కార్డు తీసుకెళ్లి వీటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. అలాగే రైతు బజార్లలో ధరణి బ్రాండ్ సన్న బియ్యంను తక్కువ ధరకే అందిస్తోంది. బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ప్రజలపై భారం తగ్గించేందుకు బియ్యం గరిష్ట ధరలను ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరల్లోపే వ్యాపారులు విక్రయించాల్సి ఉంటుంది.
