భర్త మరణంతో కుంగిపోయి చివరకు.. తల్లి, ఆరేళ్ల కుమారుడు మృతి!
ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భర్త మరణంతో మూడేళ్లుగా మానసిక వేదనను అనుభవిస్తున్న ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లి, ఆరేళ్ల చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిదేళ్ల పెద్ద కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకే కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం స్థానికంగా తీవ్ర ఆవేదనను నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఖమ్మం, నవంబర్ 25: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం గ్రామానికి చెందిన షేక్ రంజాన్‌బీ (29)కి తొమ్మిదేళ్ల క్రితం షేక్ అక్బర్‌తో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు నిస్సాన్ ఉద్దీన్ (8), చిన్న కుమారుడు నహీం (6). కొన్నేళ్లపాటు వారి కుటుంబ జీవితం సంతోషంగా సాగింది. అయితే మూడేళ్ల క్రితం అనారోగ్యంతో భర్త అక్బర్ మృతిచెందడంతో రంజాన్‌బీ జీవితంలో తీవ్ర విషాదం నెలకొంది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక, ఇద్దరు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతూ ఆమె కొంతకాలంగా తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ నెల 19న రంజాన్‌బీ తన ఇద్దరు కుమారులకు విషపదార్థం కలిపిన పానీయం ఇచ్చి, తాను కూడా తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వెంటనే తెలియజేయకపోవడంతో చికిత్స ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
రెండు రోజుల తర్వాత పిల్లలకు వాంతులు కావడం, రంజాన్‌బీ కూడా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పిల్లలిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్న కుమారుడు నహీం మంగళవారం మధ్యాహ్నం మృతిచెందాడు. మరోవైపు ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజాన్‌బీ పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి కన్నుమూశారు. పెద్ద కుమారుడు నిస్సాన్ ఉద్దీన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు తల్లితోపాటు మృత్యువాత పడటం గ్రామస్థులను కలచివేసింది. అల్లారుముద్దుగా పెరగాల్సిన చిన్నారులు ఇలాంటి విషాద పరిస్థితులను ఎదుర్కోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలి మామ షేక్ సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై హరిత కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే తీవ్ర నష్టాలు, ఒంటరితనం, కుటుంబ సమస్యలు కొన్నిసార్లు వ్యక్తులను తీవ్రమైన మానసిక సంక్షోభంలోకి నెట్టవచ్చు. అలాంటి సమయంలో బాధితులను ఒంటరిగా వదిలేయకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలవాలి. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.. కష్టకాలంలో సహాయం కోరడం ఎంతో ముఖ్యం.




