కళ్లముందే మంటల్లో ఐదేళ్ల బాలుడు సజీవ దహనం.. కాపాడుకోలేక తల్లి ఆర్తనాదాలు!
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం బలపాలతిప్పలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పూరింటికి ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ బ్యాటరీ పేలడంతో మంటలు చెలరేగాయి. ఇంట్లో నిద్రిస్తున్న ధర్మతేజ (5) అనే బాలుడు సజీవ దహనమయ్యాడు. కుమారుడిని కాపాడేందుకు తల్లి, స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది..

నంద్యాల, నవంబర్ 25: నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ, అల్లారుముద్దుగా పెరగాల్సిన ఐదేళ్ల బాలుడు అగ్నికి ఆహుతయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి ప్రాణాలు సోలార్ ప్యానెల్ బ్యాటరీ పేలుడు కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంలో బలయ్యాయి. కళ్లముందే కుమారుడు మంటల్లో చిక్కుకోవడంతో తల్లి చేసిన ఆర్తనాదాలు గ్రామస్థులను కలచివేశాయి.
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎర్రమఠం పంచాయతీ పరిధిలోని బలపాలతిప్ప గ్రామంలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాట్రాజు ఈరన్న, భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. ఘటన జరిగిన సమయంలో పెద్ద కుమారుడు తాత వెంట బయటకు వెళ్లగా, తండ్రి ఈరన్న పొలం పనులకు వెళ్లాడు. తల్లి భారతమ్మ ఇంటి బయట దుస్తులు ఉతుకుతోంది. చిన్న కుమారుడు ధర్మతేజ (5) ఇంట్లో నిద్రిస్తున్నాడు.
ఈ క్రమంలో పూరింటికి ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ బ్యాటరీ ఒక్కసారిగా పేలడంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఇంటి మొత్తానికి వ్యాపించాయి. దీంతో ఆందోళనకు గురైన తల్లి భారతమ్మ, స్థానికులు ఇంట్లో చిక్కుకున్న చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ధర్మతేజ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు.
తన బిడ్డను కాపాడాలంటూ తల్లి చేసిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని కన్నీళ్లు పెట్టించాయి. అప్పటివరకు తమతో ఆడుకుంటూ ఉన్న చిన్నారి ఇలా విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో ఇంట్లోని బియ్యం, ఇతర సామగ్రి కాలిపోయాయి. సుమారు రూ.లక్ష మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఉషారాణి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సాయంగా రూ.5,000 అందజేశారు. చేతికి అందివచ్చే వయసులో ఉన్న చిన్నారి అకాల మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.




