రూ.18 లక్షల ముంపు పరిహారం డబ్బులపై కన్ను.. ప్రియుడితో కలిసి భర్త దారుణ హత్య!
ఉదండాపూర్ జలాశయం ముంపు పరిహారంగా వచ్చిన రూ.18 లక్షల కోసం ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిందనే ఆరోపణలు మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. జడ్చర్ల మండలానికి చెందిన గజ్జి మల్లికార్జున్ (23) అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత మాడ్గుల మండలం నెమళ్లగుట్ట వద్ద మృతదేహంగా కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మహబూబ్‌నగర్, నవంబర్ 25: డబ్బు మనిషిలోని మానవత్వాన్ని ఎలా మంటగలుపుతుందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. ఉదండాపూర్ జలాశయం ముంపు పరిహారం కింద వచ్చిన రూ.18 లక్షలపై కన్నేసిన ఓ మహిళ.. ఆ డబ్బును సొంతం చేసుకునేందుకు కట్టుకున్న భర్తనే హత్య చేయించింది. వివాహేతర సంబంధానికి తోడు డబ్బు ఆశతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన సంచలనంగా మారింది. గ్రామస్థుల కథనం ప్రకారం..
జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు చెందిన గజ్జి మల్లికార్జున్ (23) పశువుల కాపరిగా జీవనం సాగించేవాడు. అతడికి మక్తల్‌కు చెందిన అంజమ్మతో వివాహమైంది. అయితే రెండు నెలల క్రితం శ్రీశైలం వెళ్లిన సమయంలో మల్లికార్జున్‌కు రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన శివ అనే వ్యక్తి బస్సులో పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో శివ తరచూ మల్లికార్జున్ గ్రామానికి వచ్చిపోయేవాడు. ఈ క్రమంలో అంజమ్మతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది.
మల్లికార్జున్ కుటుంబం ఉదండాపూర్ జలాశయం ముంపు బాధితుల జాబితాలో ఉండటంతో ఇటీవల వారికి రూ.18 లక్షల పరిహారం అందింది. ఈ డబ్బును దక్కించుకోవాలని అంజమ్మ, శివతో కలిసి భర్తను హత్య చేయాలని పథకం వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరిహారం సొమ్మును ఇద్దరూ చెరిసగం పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పథకం ప్రకారం ఈ నెల 20న రాత్రి కూలి పని ఉందని చెప్పి శివ.. మల్లికార్జున్‌ను పిలిపించాడు. ఆ తర్వాత అతడిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అదే రోజు మల్లికార్జున్ బైక్‌పై ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అతడి ఆచూకీ కోసం జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన మల్లికార్జున్ మృతదేహాన్ని సోమవారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నెమళ్లగుట్ట సమీపంలో కూలీలు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మంగళవారం అక్కడే ఖననం చేశారు.
రూ.18 లక్షల పరిహారం కోసం కట్టుకున్న భర్తనే హత్య చేయించిందన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, నిందితుల పాత్రపై పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది.




