చిన్నారులకు H3N2 ముప్పు.. ఎక్కవగా యాంటీబయాటిక్స్ తీసుకొవద్దంటున్న నిపుణులు
ఇన్‌ఫ్లుయెంజా వైరస్ H3N2 దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఒడిశా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ ప్రాణాంతకమని ఆరోగ్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు .

ఇన్‌ఫ్లుయెంజా వైరస్ H3N2 దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఒడిశా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ ప్రాణాంతకమని ఆరోగ్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు . పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రజలంఆ తప్పనిసరిగా నివారణ చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్ గరిష్ట ప్రభావం పిల్లలలో కనిపిస్తోందని ఇటీవల పలు నివేదికలు పేర్కొన్నాయి. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అలాగే ఆసుపత్రిలో చేరే ప్రమాదం పెంచుతుందని హెచ్చరిస్తున్నారు . H3N2తో పాటు, పలు రాష్ట్రాల్లో H1N1 కేసులు కూడా పెరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న ముప్పునకు అడ్డుకట్ట వేసేందుకు నిపుణులు పలు సూచనలు చేశారు.
H3N2 సహా సీజనల్ ఇన్‌ఫ్లుయెంజాతో వచ్చే వ్యాధులు ఈ ఏడాది మార్చి నెలాఖరుకు తగ్గుముఖం పడుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు కూడా నమోదవడంతో వీటిలో చాలా లక్షణాలు H3N2 మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. వీటివల్ల శ్వాసకోశ వ్యాధుల ప్రభావం ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుందని తెలిపారు . వైరస్ సోకిన పిల్లలలో అధిక జ్వరంతో పాటు ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు కనిపిస్తాయని చెప్పారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా తీవ్రమైన లక్షణాలను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఐసీయూలో చేరాల్సి వస్తుందన్నారు. ఇన్‌ఫ్లుయెంజా సబ్ వేరియంట్ తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని, పిల్లలకు, వృద్ధులతో పాటు కోమోర్బిడిటీతో బాధపడే వారికి ప్రత్యేక రక్షణ అవసరమని సూచించారు.




యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు.. ఇన్‌ఫ్లూయెంజా కేసులు చాలా వరకు సాధారణ మందులు, తగిన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు వాడాలని సూచిస్తున్నారు. H3N2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబయాటిక్స్ పని చేయనప్పటికీ, చాలా మంది దుకాణాల్లో యాంటీబయాటిక్స్ కొనుగోలు చేసి తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు సొంత వైద్యం చేయొద్దని తల్లిదండ్రులకు సూచించారు. లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి.. సూచించిన మందులను మాత్రమే వాడాలని చెబుతున్నారు . వైరస్ నివారణకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..