‘నా భార్యను చంపేశా.. నువ్వూ చచ్చిపో! అప్పుడు నీ భార్య నాది అవుతుంది’
వివాహేతర సంబంధం రెండు కాపురాల్లో చిచ్చురేపింది. స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో భర్త. ఇదేందని భార్య నిలదీయడంతో.. గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అతన్ని స్నేహితుడు హతమార్చాడు. ఈ దారుణ ఘటన..
సూరత్: వివాహేతర సంబంధం రెండు కాపురాల్లో చిచ్చురేపింది. స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో భర్త. ఇదేందని భార్య నిలదీయడంతో.. గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే స్నేహితుడు అతన్ని హతమార్చాడు. ఈ దారుణ ఘటన గుజరాత్ లో సోమవారం చోటుచేసుకుంది. సూరత్ పోలీస్ కమిషనర్ అజయ్ కుమార్ తోమర్ వెల్లడించిన వివరాల ప్రకారం..
అసలేంజరిగిందంటే..
సూరత్‌లోని పాలన్‌పూర్ ప్రాంతానికి చెందిన కౌశిక్ రావత్, కల్పనలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. కౌశిక్ రావత్ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసేవాడు. ఐతే రావత్‌కు అక్షయ్ కటారా అనే స్నేహితుడు ఉన్నాడు. అతను వృత్తిరీత్యా ప్లంబర్. అక్షయ్‌కు నెల క్రితం మీనా అనే యువతితో వివాహం జరిగింది. అక్షయ్ కూడా సూరత్‌కు వచ్చి స్నేహితుడైన రావత్ ఇంట్లోనే కాపురం ఉన్నాడు. ఈ క్రమంలో రావత్‌కు స్నేహితుడి భార్య మీనాతో అక్రమ సంబంధం ఏర్పడింది. వీరి వ్యవహారం రావత్ భార్య కల్పన కనిపెట్టి నిలదీసింది. ఈ విషయమై రావత్, అతని భార్య కల్పన నిత్యం గొడవ పడేవారు. తీరు మార్చుకోమని భర్తను హెచ్చరించింది. ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో చివరికి అక్షయ్‌కి అసలు విషయం చెప్పింది కల్పన. ఈ విషయమై సోమవారం అక్షయ్, మీనా గొడవపడటంతో మీనా పుట్టింటికి వెళ్లిపోయింది. అక్షయ్ కూడా భార్య వెంటే వెళ్లిపోయాడు.
జంట హత్యలు జరిగిన తీరిది..
ఆ తర్వత ఇంట్లోనే ఉన్న రావత్, కల్పన ఈ విషయమై మళ్లీ గొడవపడ్డారు. ఈ క్రమంలో అతను కల్పన గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సీలింగ్ హుక్‌కు ఉరివేసాడు. అక్షయ్ తిరిగి వచ్చేటప్పటికి సీలింగ్‌కు వేలాడుతూ కల్పన మృతదేహం, దాని పక్కనే కూర్చున్న రావత్‌ను చూశాక.. భార్యను హత్య చేసి ఉంటాడని ఊహించి మౌనంగా ఉంటాడు. స్నేహితులిద్దరూ కలిసి కల్పన మృతదేహాన్ని గోనె సంచిలో చౌక్ బజార్‌లోని ఫూల్‌పాడ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ తాపీ నది ఆనకట్ట గోడ సమీపంలో ఉన్న పొదల్లో మృతదేహాన్ని పారవేశారు. అనంతరం అక్షయ్, తన స్నేహితుడైన రావత్‌ను తాపీ నది ఒడ్డుకు తీసుకెళ్లి, రాయితో అతని తలపై మోది హత్య చేశాడు.
నిందితుడు అక్షయ్ అరెస్ట్
అదే రోజు చౌక్ బజార్ పోలీసులు సూరత్‌లోని ఫూల్‌పాడ ప్రాంతానికి సమీపంలోని తాపీ నది ఆనకట్ట గోడ వద్ద ఓ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తాపీ నది ఒడ్డున మరో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ జంట హత్యలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ జంట హత్యల దర్యాప్తులో దహోద్‌కు చెందిన అక్షయ్ కటారా నిందితుడిగా గుర్తించారు. సోమవారం రాత్రి అక్షయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
నన్ను చంపుతానని బెదిరించాడు: అక్షయ్
విచారణలో రావత్‌ను చంపినట్లు అక్షయ్ నేరం అంగీకరించాడు. ఐతే.. అక్షయ్‌ని చంపడానికి రావత్ ప్రయత్నించాడని, అక్షయ్ చనిపోతే అతని భార్య మీనా తనదేనదవుతుందని రావత్ బెదిరించినట్లు విచారణలో తెలిపాడు. అతని నుంచి తననితాను కాపాడుకోవడానికి రావత్‌ను హత్య చేసినట్లు.. క్రైమ్ బ్రాంచ్ సబ్-ఇన్‌స్పెక్టర్ పివై చిట్టే తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.