Ranya Rao: సవితి తండ్రి ప్రొటోకాల్‌తో..! రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బయటపడ్డ సంచలన నిజాలు
నటి రన్యా రావు 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించినందుకు అరెస్టు అయింది. ఆమె సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు, ఆమెకు బెంగళూరు విమానాశ్రయంలో ప్రోటోకాల్ సౌకర్యాలను అందించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తు ఆదేశించింది. రన్యా రావు దుబాయ్ నుండి 27 సార్లు ప్రయాణించిందని, ప్రతిసారీ ప్రోటోకాల్ సౌకర్యాలను ఉపయోగించుకుందని తేలింది.

భారీ ఎత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్డుబడిన నటి రన్యా రావు కేసు విషయంలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో ప్రోటోకాల్ సౌకర్యాలను సీనియర్ ఐపీఎస్ అధికారి కె. రామచంద్రరావు సవతి కూతురు, నటి రన్యా రావుకు ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం ఆదేశించిన దర్యాప్తులో, ఆమె దుబాయ్ నుండి వచ్చిన ప్రతిసారీ తన తండ్రి పేరుతో ప్రోటోకాల్ ఉపయోగించుకున్నారంటూ తేలింది. నటి దుబాయ్ నుండి బెంగళూరు విమానాశ్రయానికి వచ్చినప్పుడల్లా డీజీపీ స్థాయి అధికారి ప్రోటోకాల్ సేవలను పొందిందని సూచించే సీసీటీవీ ఫుటేజ్, కమ్యూనికేషన్ వివరాలు కూడా విచారణలో లభించాయి.
మార్చి 3న దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో వచ్చిన రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమె రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించినట్లు డీఆర్‌ఐ అధికారులు ఆరోపిస్తూ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం ఆధారంగా, నటి తన సవతి తండ్రికి అందుబాటులో ఉన్న పోలీసు ప్రోటోకాల్ సేవను ఉపయోగించి కస్టమ్స్ ప్రాంతం నుండి నిష్క్రమించడానికి బంగారం లెక్క చూపకుండా కస్టమ్స్ శాఖ గ్రీన్ ఛానల్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు DRI ఆమెను అడ్డుకుంది. ప్రోటోకాల్ సేవలను ఉపయోగించినట్లు వెల్లడైన తర్వాత , రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది, పరిపాలనా సంస్కరణల విభాగం మార్చి 10న ప్రోటోకాల్ సేవలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సీనియర్ ఐఏఎస్ అధికారి గౌరవ్ గుప్తాతో విచారణకు ఆదేశించింది.
“ప్రోటోకాల్ వినియోగంపై ఆమె సవితి తండ్రి, కర్ణాటక రాష్ట్ర పోలీసు హౌసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రామచంద్రరావు, ఐపీఎస్ పాత్రపై దర్యాప్తు నిర్వహించడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది” అని DPAR ఉత్తర్వులో పేర్కొంది. రామచంద్రరావు దుబాయ్ సందర్శనల సమయంలో తన సవతి కూతురుతో, దుబాయ్ నుండి తిరిగి వచ్చినప్పుడు విమానాశ్రయంలోని ప్రోటోకాల్ అధికారితో కూడా సంప్రదింపులు జరిపినట్లు అధికారిక రికార్డుల ద్వారా విచారణలో తేలింది.
ఈ ఏడాది జనవరి నుంచి రన్యా రావు దుబాయ్‌కు 27 సార్లు ప్రయాణించినట్లు DRI నివేదించింది. ఈ క్రమంలో మూడు సార్లు దుబాయ్ నుండి వచ్చినప్పుడు, రన్యా రావు ఎయిర్ పోర్టులో ఐపీఎస్ అధికారికి కేటాయించే అధికారిక రాష్ట్ర కారులోనే ఇంటికి వెళ్లారని కూడా నివేదికలో వెల్లడించారు. తన కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు తనకు పాటించే ప్రోటోకాల్‌నే వాళ్లకు పాటించాలని ఎయిర్ పోర్టులో ప్రోటోకాల్ అధికారిగా ఉన్న బెంగళూరు పోలీసు కానిస్టేబుల్ బసప్ప బిల్లూర్‌ను రామచంద్రరావు ఆదేశించాడని తేలింది. ఎయిర్ పోర్టులో చాలా సంవత్సరాలుగా రన్యా రావుకు తాను సహాయం చేస్తున్నానని బసప్ప చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..