Goa Tour: గోవా టూర్ వెళ్తున్నారా? కొత్త నిబంధనలు తెలుసుకోండి.. తేడా వస్తే రూ.50 వేల వరకు జరిమానా
మీరు గోవా టూర్ వెళ్తున్నారా..? అక్కడికి వెళ్లి పార్టీ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే. టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకునే వారు కొత్త నిబంధనలు గుర్తించుకోవాలి..
మీరు గోవా టూర్ వెళ్తున్నారా..? అక్కడికి వెళ్లి పార్టీ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే. టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకునే వారు కొత్త నిబంధనలు గుర్తించుకోవాలి. ఎందుకంటే గోవాలో పర్యాటక ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, పర్యాటకులకు సురక్షితంగా ఉంచడానికి అక్కడి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. పర్యాటకులు ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే భారీ ఎత్తున జరిమానా చెల్లించుకోక తప్పదు. అందుకు ముందు జాగ్రత్తగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
అక్టోబర్ 31న గోవా ప్రభుత్వం జారీ చేసిన నోటీసు ప్రకారం.. ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో వంట చేయడం, బీచ్‌లలో డ్రైవింగ్ చేయడం నిషేధించబడింది. అంతేకాకుండా బీచ్‌లలో చెత్త వేయడం లేదా మద్యం సేవించి సీసాలు పగలగొట్టడం, వంట చేయడం వంటివి చేసినట్లయితే భారీ జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.
సర్వీస్ ప్రొవైడర్లు, స్థానిక వ్యాపారాల కోసం కూడా కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. గుర్తించబడిన మండలాల్లో మాత్రమే వాటర్ స్పోర్ట్స్‌కు అనుమతి ఉంటుంది. అన్ని టికెటింగ్ కార్యకలాపాలు అధీకృత టికెటింగ్ కౌంటర్లలో నిర్వహించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని అక్కడి అధికారులు హెచ్చరించారు. అలాగే పర్యాటకుల వాహనాలకు అడ్డుపడినా, ఎవరైనా డబ్బులు అడిగి పర్యాటకులకు ఇబ్బంది కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. టూరిస్టులతో పాటు వారికి సేవలందిస్తున్న వివిధ సంస్థలు, వ్యాపారస్తులకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయన్నారు. తోపుడు బండిపై వ్యాపారం చేసే వారు పర్యటకులను అడ్డుకుంటే జరిమానా విధిస్తామని తెలిపింది.
ఓ వ్యక్తి, కంపెనీ, సంస్థ, సంఘం ఏదైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఐపీసీలోని సెక్షన్ 188 ప్రకారం చర్యలు తప్పవని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. పోలీసులు కొత్త నిబంధనలను గమనించి తదనుగుణంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి