AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air pollution: వాయు కాలుష్యంపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కేంద్రం.. పంజాబ్ లో తాజా ఘటనలను ప్రస్తావిస్తూ..

దేశంలో వాయు కాలుష్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని, బీజేపీ పాలిత రాష్ట్రాల పేర్లు ప్రస్తావిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు..

Air pollution: వాయు కాలుష్యంపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కేంద్రం.. పంజాబ్ లో తాజా ఘటనలను ప్రస్తావిస్తూ..
Air pollution in Delhi
Amarnadh Daneti
|

Updated on: Nov 04, 2022 | 2:42 PM

Share

దేశంలో వాయు కాలుష్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని, బీజేపీ పాలిత రాష్ట్రాల పేర్లు ప్రస్తావిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీని, పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజధానిని “గ్యాస్ ఛాంబర్”గా మార్చిందని ఆరోపించారు. దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో ఉన్న పంజాబ్‌లో 2021లో వ్యవసాయ పొలాల్లో మంటలు 19% పైగా పెరిగాయని, హర్యానాలో 30.6% తగ్గుదల కనిపించిందని భూపేంద్రయాదవ్ ట్విట్టర్ లో తెలిపారు. బుధవారం పంజాబ్‌లో 3,634 అగ్నిప్రమాదాలు (వ్యవసాయ పొలాల్లో మంటలు) సంభవించాయని తెలిపారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఉన్న చోట కుంభకోణాలే ఉంటాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన అనేక ఉదాహరణలను కేంద్రమంత్రి ప్రస్తావించారు. పంట అవశేషాల నిర్వహణ యంత్రాల కోసం కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌కు రూ. 1,347 కోట్లు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం 1,20,000 యంత్రాలను కొనుగోలు చేసిందని, వాటిలో 11,275 యంత్రాలు మాయమయ్యాయని ఆరోపించారు. ప్రజాధనాన్ని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. పంట అవశేషాల నిర్వహణ యంత్రాల కోసం కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌కు ఈఏడాది రూ. 280 కోట్లు ఇచ్చిందని, గత సంవత్సరం ఖర్చు చేయకుండా మిగిలిన రూ. 212 కోట్లతో కలిపి సుమారు రూ.492 కోట్లు అందుబాటులో ఉన్నా, రైతులకు అవసరమైన యంత్రాలు కొనుగోలు చేయకుండా, పంటలను రైతులు తగలబెట్టడానికి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కారణమవుతుందని విమర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి తన సొంత ప్రాంతంలో రైతులకు ఉపశమనం కలిగించడంలో కూడా విఫలమయ్యారని, గత సంవత్సరం (సెప్టెంబర్ 15-నవంబర్ 2) మధ్య సంగ్రూర్‌లో పంటలను తగలబెట్టిన ఘటనలు 1,266 కాగా, ఈ సంవత్సరం అదే సమయానికి 139% పెరిగి 3,025కి పెరిగాయని, ముఖ్యమంత్రి అసమర్థతే దీనికి కారణమని భూపేంద్రయాదవ్ అన్నారు.

కాలుష్యం సమస్య ఉత్తరభారతదేశం మొత్తం ఉందని, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వాయు కాలుష్యం సమస్య ఉందని, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు అన్ని చోట్లా సమానంగా ఉందని, ఢిల్లీ-పంజాబ్ మాత్రమే దేశమంతటా కాలుష్యాన్ని వ్యాపింపజేసిందా అంటూ ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో భూపేంద్రయాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ధీటైన జవాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయం చేయడం లేదని, వారిపై ఎఫ్‌ఐఆర్‌లు మాత్రమే నమోదు చేస్తోందని, వాయు కాలుష్యం విషయంలో తమ గోడు పట్టించుకోవడం లేదని, రాజకీయ ప్రయోజనాలనే బీజేపీ ప్రభుత్వం చూసుకుంటోందని ఆమ్ ఆద్మీ అధినేత విమర్శించారు.

మరోవైపు బీజేపీ విమర్శలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కౌంటర్ ఇచ్చారు. రైతుల ఆందోళన కారణంగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవల్సి వచ్చిందని, దీంతో రైతులపై కేంద్రప్రభత్వం కక్ష గట్టిందని ఆరోపించారు. మొత్తం మీద వాయు కాలుష్యం విషయంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు, ఢిల్లీ, పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..