AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉచిత విద్యుత్‌ పథకం.. 125 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌! ఎవరికి వర్తిస్తుందంటే..?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2025 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ప్రకటించారు. దీనివల్ల 1.67 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చే ఈ పథకంతో పాటు, రాబోయే మూడు సంవత్సరాలలో సౌర విద్యుత్తు వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఉచిత విద్యుత్‌ పథకం.. 125 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌! ఎవరికి వర్తిస్తుందంటే..?
Free Electricity
SN Pasha
|

Updated on: Jul 17, 2025 | 12:26 PM

Share

పాట్నా, 17 జులై 2025: బీహార్ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర ప్రజలకు మరో హామీ ఇచ్చారు. ఇప్పటికే భారీగా పెన్షన్లు పెంచిన నితీష్‌ ప్రభుత్వం.. ఇప్పుడు ఎన్నిక ముందు ఉచిత విద్యుత్‌ ప్రకటించింది. అర్హత కలిగిన గృహాలకు 125 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తామని గురువారం సీఎం నితీష్‌ ప్రకటించారు. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.67 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఆగస్టు 1 నుండి రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 125 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా లభిస్తుంది.

ప్రస్తుత కుటిర్ జ్యోతి యోజన కింద గ్రామీణ లబ్ధిదారులు యూనిట్‌కు రూ.1.97 కు విద్యుత్తును పొందుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని ఇతర గృహ వినియోగదారులు యూనిట్‌కు రూ.2.52 చెల్లిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రామాణిక రేటు యూనిట్‌కు రూ.7.57, కానీ ప్రభుత్వ సబ్సిడీ కారణంగా యూనిట్‌కు రూ.4.52 కు తగ్గుతుంది.

సౌర విద్యుత్ వ్యవస్థలతో..

రాబోయే మూడు సంవత్సరాలలో ఇంటి పైకప్పులపై లేదా ప్రజా ప్రదేశాలలో సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను కూడా ముఖ్యమంత్రి నితీష్‌ తెలియజేశారు. “మేం మొదటి నుంచీ అందరికీ సరసమైన ధరలకు విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పుడు ఆగస్టు 1, 2025 నుండి అంటే జూలై బిల్లు నుండే రాష్ట్రంలోని అన్ని గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు విద్యుత్ కోసం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని మేం నిర్ణయించాం. దీని వల్ల రాష్ట్రంలోని మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. రాబోయే మూడు సంవత్సరాలలో ఈ గృహ వినియోగదారులందరి సమ్మతితో ప్రయోజనాలను అందించడానికి వారి పైకప్పులపై లేదా సమీపంలోని ప్రజా ప్రదేశాలలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాం” అని సీఎం నితీష్‌ అన్నారు. కుటిర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు, సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, మిగిలిన కుటుంబాలకు ప్రభుత్వం తగిన మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో 10,000 మెగావాట్ల వరకు సౌరశక్తి అందుబాటులో ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు.

ఎన్నికలను ప్రభావితం చేస్తుందా?

2025 చివరిలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నితీష్ కుమార్ పార్టీ JDU, NDAతో కలిసి ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం గేమ్ ఛేంజర్‌గా మారవచ్చు. బీహార్ వంటి రాష్ట్రంలో అనేక గృహాలకు విద్యుత్ బిల్లులు భారంగా ఉన్నందున 125 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పథకం ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేస్తుందని నితీష్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రజల మద్దతును పెంచుతుందని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి