IND vs AFG: ఆఫ్ఘాన్‌తో సిరీస్‌కు భారత జట్టు.. ఛోటా ప్యాకెట్ రీఎంట్రీ ఫిక్స్..!
India vs Afghanistan 2026: ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలో భారత జట్టు అంతర్జాతీయ ప్రయాణం మొదలవ్వనుంది. ఈ క్రమంలో స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్, వన్డే సిరీస్ ఆడనుంది. ఈ రెండు జట్లను ఇప్పటికే బీసీసీఐ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

India vs Afghanistan 2026: ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు మరో ఉత్సాహభరితమైన పోరుకు సిద్ధమవుతోంది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ వచ్చే వారం జట్టును ప్రకటించనుంది. ఈ సిరీస్‌లో పలువురు సీనియర్లకు విశ్రాంతినిస్తూనే, యువ ఆటగాళ్లకు చోటు కల్పించే అవకాశం కనిపిస్తోంది.
వచ్చే వారమే టీమ్ ఇండియా ఎంపిక..
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ ఎంపిక కమిటీ మే 19న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడే భారత జట్టును వెల్లడించనుంది. తాజా సమాచారం ప్రకారం, కొత్త చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ మైదానంలో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఆ తర్వాత జూన్ 14, 17, 20 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం కాకపోయినప్పటికీ, ఈ సిరీస్‌ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.
టెస్టు జట్టులో మార్పులు.. బుమ్రాకు విశ్రాంతి..?
పనిభారం నిర్వహణలో భాగంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఆయన స్థానంలో గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ వంటి యువ బౌలర్లకు తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు తమ స్థానాలను నిలబెట్టుకోనున్నారు.
రిషబ్ పంత్‌పై వేటు.. ఇషాన్ కిషన్‌కు లక్కీ ఛాన్స్..
వన్డే జట్టు ఎంపికలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆశించిన స్థాయిలో రాణించని రిషబ్ పంత్‌ను వన్డే జట్టు నుంచి తప్పించే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పంత్ గత 11 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 251 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్, 185 స్ట్రైక్ రేటుతో 420 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీ టోర్నీల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసిన కిషన్, రిజర్వ్ వికెట్ కీపర్‌గా జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది.
జడేజా వర్సెస్ అక్షర్.. సెలక్టర్ల మల్లగుల్లాలు..
స్పిన్ ఆల్ రౌండర్ స్థానం కోసం రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. వన్డేల్లో లోయర్ ఆర్డర్‌లో జడేజా బ్యాటింగ్ శైలిపై సెలక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చివరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడంలో జడేజా తడబడుతుండటం అక్షర్ పటేల్‌కు కలిసొచ్చే అంశం. వెన్నునొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా లభ్యతపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. 2027 ప్రపంచకప్ సన్నద్ధతలో భాగంగా ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
