Money Astrology: గ్రహాల ప్రతికూలత..ఈ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..!
ఆగస్టు 15 తర్వాత గ్రహాల రాశి మార్పుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశుల వారు సెప్టెంబర్ 15 వరకు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. అనవసర ఖర్చులు, ధన నష్టం, రావాల్సిన డబ్బు ఆలస్యం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆదాయ, వ్యయాల విషయంలో జాగ్రత్త అవసరం.

ఈ నెల(ఆగస్టు) 15 తర్వాత రవి, బుధులు రాశులు మారడం, శుక్రుడు కన్యారాశిలో కొనసాగడం వంటి పరిణామాల వల్ల కొన్ని రాశుల వారికి ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 15 వరకు మేషం, సింహం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశుల వారు ఆర్థిక విషయాల జోలికి వెళ్లకపోవడం, ఆర్థిక వ్యవహారాలను నిర్వహించకపోవడం మంచిది. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు, వృథా ఖర్చులతో పాటు ధన నష్టం కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రావలసిన డబ్బు రాకపోవడం, సహాయం పొందినవారు ముఖం చాటేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆదాయ వ్యయాల మధ్య పొంతన కుదరకపోవచ్చు.
- మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో బుధ సంచారం వల్ల చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు అంచనాలను మించుతాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం ఏదో విధంగా వృథా అవుతుంది. ఉచిత సహాయాలు, దానధర్మాలు పెరుగుతాయి. ఆదాయంలో ఎక్కువ భాగాన్ని శుభకార్యాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంది, అనవసర ప్రయాణాల వల్ల కూడా బాగా ఖర్చయ్యే సూచనలున్నాయి. వీరు ఆర్థిక విషయాల జోలికి వెళ్లకపోవడం మంచిది.
- సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాశ్యధిపతి రవి, ధనాధిపతి బుధుడు, ధన కారకుడు గురువు సంచారం వల్ల ఈ రాశివారు అనాలోచితంగా డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. వ్యక్తిగత సుఖ సంతోషాల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆధునిక వస్త్రాలు, వస్తువులు, సౌందర్య సాధనాలు, అలంకార వస్తువులు, వస్త్రాభరణాల మీద ఖర్చు పెరుగుతుంది. ప్రేమ భాగ స్వామి మీద కూడా ఖర్చు వృద్ధి చెందుతుంది. కొందరు మిత్రుల వల్ల ధన నష్టం జరుగుతుంది.
- కన్య: ఈ రాశికి వ్యయ స్థానంలో త్వరలో రవి, బుధులు ప్రవేశిస్తున్నందువల్ల అనవసర వ్యయాలు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సామాజిక హోదా కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆహారం, దుస్తులు, ఆభరణాల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. తల్లి తండ్రుల అనారోగ్యాల మీద ఖర్చయ్యే అవకాశం కూడా ఉంది. కొద్ది కాలం పాటు వీరికి ఖర్చులపై అదుపుండదు. వృథా ఖర్చులు, ఆడంబర ఖర్చులు, కుటుంబ ఖర్చులు తప్పకపోవచ్చు.
- ధనుస్సు: ఈ రాశికి ప్రస్తుతం రవి, బుధులు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శుభకార్యాలు, దైవ కార్యాలు, ఉచిత సహాయాల మీద ఖర్చు పెరిగే సూచనలున్నాయి. కుటుంబ ఖర్చులు పెరగడం వల్ల కూడా ఇబ్బంది పడతారు. నష్టదాయక వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామికి, ప్రేమ భాగస్వామికి వస్త్రాభ రణాలు, కానుకలు కొనివ్వడం జరుగుతుంది. డబ్బు దాచుకోవాలనే ఆలోచన బాగా తగ్గుతుంది.
- మకరం: ఈ రాశికి ఈ నెల 17 నుంచి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధితో పాటు వ్యయ వృద్ధికి కూడా బాగా అవకాశం ఉంది. అష్టమ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. కుటుంబం మీదా, జీవిత భాగస్వామి మీదా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఒకటికి రెండు సార్లు భారీగా షాపింగ్ చేసే అవకాశం ఉంది. విలాసాలు, వినోదాలు, వ్యసనాల మీద ఖర్చు పెరుగుతుంది.
- మీనం: ఈ రాశికి షష్ట స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల చేతిలో ఒక పట్టాన డబ్బు నిలవకపోవచ్చు. అనవసర ఖర్చులకు తోడు, అనేక విధాలుగా ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థిక వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో నష్టపోవడం జరుగుతుంది. సహాయం చేసిన వారు ముఖం చాటేస్తారు. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా నష్టపోయేది ఈ రాశివారే. మదుపులు, పెట్టుబడుల వల్ల నష్టాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య ఫలితాలు సాధారణ గ్రహ సంచారాలు, రాశుల ఆధారంగా చేసిన అంచనాలు మాత్రమే. ఇవి శాస్త్రీయంగా నిరూపితమైనవి కావు. వ్యక్తిగత జాతకం, జన్మ నక్షత్రం, గ్రహస్థితుల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి.