AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలులోనే గుడి కట్టేశాడు? ఏసీ కోచ్‌లో దీపం.. శంఖనాదంతో ప్రయాణికులకు షాక్!

భారతీయ రైలు ప్రయాణాల్లో భిన్న మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలకు చెందిన ప్రజలు కలిసి ప్రయాణిస్తుంటారు. ప్రతి ఒక్కరికీ తమ తమ విశ్వాసాలు, ఆచారాలను పాటించే స్వేచ్ఛ ఉంటుంది. అయితే వ్యక్తిగత విశ్వాసాల పేరుతో తోటి ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడితే మాత్రం సమస్యలు తప్పవు. తాజాగా ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కదులుతున్న ఏసీ రైలు కోచ్‌లో ఓ ప్రయాణికుడు దీపం వెలిగించి, శంఖం ఊదుతూ పూజలు చేసిన వీడియో వైరల్‌గా మారింది.

రైలులోనే గుడి కట్టేశాడు? ఏసీ కోచ్‌లో దీపం.. శంఖనాదంతో ప్రయాణికులకు షాక్!
Passenger Performs Puja In Train
Balaraju Goud
|

Updated on: Nov 26, 2026 | 6:47 PM

Share

భారతీయ రైలు ప్రయాణాల్లో భిన్న మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలకు చెందిన ప్రజలు కలిసి ప్రయాణిస్తుంటారు. ప్రతి ఒక్కరికీ తమ తమ విశ్వాసాలు, ఆచారాలను పాటించే స్వేచ్ఛ ఉంటుంది. అయితే వ్యక్తిగత విశ్వాసాల పేరుతో తోటి ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడితే మాత్రం సమస్యలు తప్పవు. తాజాగా ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కదులుతున్న ఏసీ రైలు కోచ్‌లో ఓ ప్రయాణికుడు దీపం వెలిగించి, శంఖం ఊదుతూ పూజలు చేసిన వీడియో వైరల్‌గా మారింది.

ఏసీ కోచ్‌లో దీపం వెలిగించి పూజలు!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి రైలు ఏసీ కోచ్‌లో పూజా సామగ్రిని ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీపం వెలిగించడంతో పాటు శంఖం ఊదుతూ ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. రైలు ప్రయాణం కొనసాగుతుండగానే ఈ కార్యక్రమం నిర్వహించడం తోటి ప్రయాణికుల్లో ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా కదులుతున్న రైలులో బహిరంగంగా మంటను ఉపయోగించడం ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు తలెత్తాయి.

ప్రయాణికుల అభ్యంతరాలు.. భద్రతపై ఆందోళన

రైలు కోచ్‌లో దీపం వెలిగించడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని పలువురు ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీ కోచ్‌లలో బెర్తులు, దుప్పట్లు, కర్టెన్లు, ఇతర వస్తువులు ఉండటంతో చిన్న మంట కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అగరబత్తుల పొగ కారణంగా ఫైర్ అలారం వ్యవస్థ పనిచేసే అవకాశం ఉందని పలువురు పేర్కొన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత మత విశ్వాసాలను గౌరవించాల్సిందేనని, అయితే ప్రజా రవాణాలో అందరి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

స్పందించిన రైల్వే శాఖ..!

ఈ వీడియోపై రైల్వే శాఖ అధికారికంగా స్పందించింది. రైల్వే సేవా (Railway Seva) అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఘటనపై విచారణ జరిపేందుకు అవసరమైన వివరాలను కోరింది. ఘటన జరిగిన తేదీ, సమయం, రైలు నంబర్, పీఎన్‌ఆర్‌ లేదా యూటీఎస్‌ నంబర్‌తో పాటు సంబంధిత సమాచారాన్ని అందించాలని సూచించింది. వివరాలు అందిన తర్వాత తగిన విచారణ, చర్యలు చేపడతామని వెల్లడించింది. లాగే ఇలాంటి భద్రతాపరమైన సమస్యలు ఎదురైతే ప్రయాణికులు రైల్వే అధికారిక ఫిర్యాదుల వేదిక RailMadad ద్వారా లేదా 139 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.

భక్తికి గౌరవం.. భద్రతకు ప్రాధాన్యం!

నిజానికి రైలు అనేది వేలాది మంది ప్రయాణించే ప్రజా రవాణా వ్యవస్థ. అందులో ప్రతి ప్రయాణికుడి భద్రత అత్యంత ముఖ్యం. మతపరమైన ఆచారాలు, ప్రార్థనలు వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినవే అయినప్పటికీ, వాటి వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ముఖ్యంగా అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే దీపాలు, మంటలు, ఇతర వస్తువులను రైళ్లలో ఉపయోగించకుండా ఉండటం అవసరం.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, రైలు గుర్తింపు, బాధ్యులపై తీసుకునే చర్యలపై రైల్వే శాఖ విచారణ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వైరల్ వీడియో రైలు ప్రయాణాల్లో పౌర స్పృహ, ప్రయాణికుల బాధ్యత, భద్రతా నిబంధనల అమలుపై మరోసారి చర్చకు తెరలేపింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us