AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉచిత విద్యుత్.. రైతు రుణమాఫీ.. మహిళలకు ఆర్థిక సాయం.. అఖిలేష్‌ మేనిఫెస్టో ఇదే!

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు-2027 లక్ష్యంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో ‘PDA కా ప్రణ్‌పత్ర’ (PDA సంకల్ప పత్రం) పేరుతో పార్టీ ఎన్నికల హామీలను ప్రకటించారు. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగ యువత, పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశారు. వైద్యం, వ్యవసాయం, విద్యుత్‌, ఉద్యోగాలు వంటి కీలక రంగాల్లో పలు హామీలను గుప్పించారు.

ఉచిత విద్యుత్.. రైతు రుణమాఫీ.. మహిళలకు ఆర్థిక సాయం.. అఖిలేష్‌ మేనిఫెస్టో ఇదే!
Samajwadi Party Manifesto
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Nov 26, 2026 | 6:33 PM

Share

లక్నోః ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు-2027 లక్ష్యంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో ‘PDA కా ప్రణ్‌పత్ర’ (PDA సంకల్ప పత్రం) పేరుతో పార్టీ ఎన్నికల హామీలను ప్రకటించారు. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగ యువత, పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశారు. వైద్యం, వ్యవసాయం, విద్యుత్‌, ఉద్యోగాలు వంటి కీలక రంగాల్లో పలు హామీలను గుప్పించారు.

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు హామీ

రాష్ట్రంలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు సమాజ్‌వాదీ పార్టీ ప్రత్యేక హామీలను ప్రకటించింది.

– పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా.

– రాష్ట్రంలోని 18 డివిజన్లలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు.

– అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆరోగ్య విధానం-2027 అమలు.

– ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలు, PDA వర్గాలకు ఉచిత వైద్యం.

– ప్రభుత్వ వైద్యరంగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు.

– లక్నోలోని క్యాన్సర్‌ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి ఉచిత క్యాన్సర్‌ వైద్యం అందించడం.

– ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ వ్యాధుల నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యల వరకు ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పార్టీ స్పష్టం చేసింది.

రైతులకు రుణమాఫీ.. పంటలకు చట్టబద్ధమైన MSP

రైతుల సంక్షేమం విషయంలోనూ అఖిలేష్‌ యాదవ్‌ కీలక హామీలు ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీని దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించారు.

– రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ.

– ఉత్తరప్రదేశ్‌లో పండించే మొత్తం 23 పంటలకు కనీస మద్దతు ధర (MSP)పై చట్టబద్ధమైన గ్యారంటీ.

– పాల ఉత్పత్తులకు కూడా కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ.

– చెరకు రైతులకు 24 గంటల్లోనే బకాయిల చెల్లింపు.

– చెరకు రైతుల చెల్లింపుల కోసం రూ.15 వేల కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు.

– సాగునీటి అవసరాల కోసం ఉచిత విద్యుత్‌ సరఫరా.

బంగాళాదుంప, టమాటా, ఉల్లిపాయ వంటి పంటల ధరలు పడిపోయినప్పుడు రైతులకు నష్టపరిహారం అందించే ప్రత్యేక విధానాన్ని కూడా తీసుకొస్తామని పార్టీ ప్రకటించింది.

300 యూనిట్ల ఉచిత విద్యుత్‌.. గ్రామీణ కుటుంబాలకు ఊరట

విద్యుత్‌ వినియోగదారులను ఆకర్షించేలా మరో కీలక హామీని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని గృహ వినియోగదారులకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని తెలిపారు. వ్యవసాయ సాగుకు అవసరమైన విద్యుత్‌ను కూడా ఉచితంగా సరఫరా చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ హామీ అమలైతే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, సామాన్య కుటుంబాలకు విద్యుత్‌ బిల్లుల భారం తగ్గే అవకాశం ఉంటుంది.

యువతకు 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు

నిరుద్యోగ సమస్యను ప్రధాన ఎన్నికల అంశంగా తీసుకున్న సమాజ్‌వాదీ పార్టీ యువతకు భారీ హామీలు ఇచ్చింది.

– ఐదేళ్లలో 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన.

– రెండు నుంచి మూడు కోట్ల వరకు ఉపాధి అవకాశాల సృష్టి.

– నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.5 వేల భృతి.

– ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత.

– ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు కఠిన చర్యలు.

– కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానానికి బదులుగా శాశ్వత ఉద్యోగాలకు ప్రాధాన్యం.

ఉద్యోగాల కల్పనతో పాటు విద్యావ్యవస్థలోనూ మార్పులు తీసుకొస్తామని పార్టీ పేర్కొంది.

మహిళలు, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం

PDA (వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు) వర్గాల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా ప్రకటించిన అఖిలేష్‌ యాదవ్‌.. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. మహిళలకు ఏడాదికి రూ.40 వేల ఆర్థిక సాయం అందించే హామీతో పాటు, మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నట్లు పార్టీ వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పాత పెన్షన్‌ విధానాన్ని తిరిగి తీసుకురావడం వంటి అంశాలనూ ప్రస్తావించింది.

మూడు స్థాయిల్లో మేనిఫెస్టో.. స్థానిక సమస్యలకూ ప్రాధాన్యం

2027 ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ మూడు స్థాయిల్లో మేనిఫెస్టోలను రూపొందిస్తోంది. మొదట రాష్ట్రస్థాయి ప్రధాన మేనిఫెస్టోను విడుదల చేయగా, మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోతో పాటు జిల్లాలవారీగా స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను ప్రతిబింబించే పత్రాలను కూడా విడుదల చేయాలని పార్టీ యోచిస్తోంది

బీజేపీకి సవాల్‌గా అఖిలేష్‌ ఎన్నికల వ్యూహం

2027లో ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అఖిలేష్‌ యాదవ్‌ ఈ హామీలను ప్రకటించారు. PDA నినాదంతో వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలతో పాటు రైతులు, యువత, మహిళలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్‌, ఉద్యోగాలు, సామాజిక న్యాయం వంటి అంశాలతో సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టో రూపొందింది. అయితే ఈ హామీల అమలుకు అవసరమైన నిధుల సమీకరణ, ఆర్థిక భారం, ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం వంటి అంశాలు ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారనున్నాయి.

2027 అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవ్‌ ప్రకటించిన ఈ సంక్షేమ హామీలు ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? ఉత్తరప్రదేశ్‌లో అధికార మార్పునకు ఇవి దోహదపడతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us