AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ 65లో 65 అంటే ఏంటీ..? 99శాతం మందికి తెలియని అసలు నిజాలు ఇవే..

Chicken 65: ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా మెనూ కార్డు చూడకుండానే టక్కున ఆర్డర్ చేసే ఫేవరెట్ స్టార్టర్ చికెన్ 65. కరకరలాడుతూ, కరివేపాకు ఘుమఘుమలతో నోరూరించే ఈ వంటకం రుచి గురించి అందరికీ తెలుసు. కానీ దాని పేరు వెనుకున్న ఆ 65 అనే నంబర్ రహస్యం ఏంటో తెలుసా..? దీని వెనుక ఉన్న అసలు కథేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చికెన్ 65లో 65 అంటే ఏంటీ..? 99శాతం మందికి తెలియని అసలు నిజాలు ఇవే..
Why Is It Called Chicken 65
Krishna S
|

Updated on: Nov 26, 2026 | 5:56 PM

Share

దక్షిణ భారతదేశంలోని ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా, మెనూ కార్డు కూడా చూడకుండా చాలామంది ఆర్డర్ చేసే మొదటి వంటకం చికెన్ 65. కరకరలాడుతూ, కారంగా నోరూరించే ఈ వంటకం భారతీయుల ఫేవరెట్ స్టార్టర్‌గా దశాబ్దాలుగా రాజ్యమేలుతోంది. అందుకే అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో ఇది కంపల్సరీ ఉంటుంది. అయితే దీని రుచిపై ఎవరికీ సందేహం లేదు కానీ ఆ పేరు వెనుక ఉన్న 65 అనే సంఖ్య గురించే రకరకాల డౌట్లు ఉంటాయి. అసలు ఈ పేరు ఎలా పుట్టిందో చాలా మందికి తెలియదు. చికెన్ 65 పుట్టుకపై అత్యధికులు నమ్మే కథనం తమిళనాడు రాజధాని చెన్నైతో ముడిపడి ఉంది. 1965వ సంవత్సరంలో చెన్నైలోని ప్రఖ్యాత హోటల్ బుహారీ ఈ ప్రత్యేక వంటకాన్ని తొలిసారిగా పరిచయం చేసిందని చెబుతారు. 1965లో తయారు చేసిన వంటకం కావడంతో దానికి గుర్తుగా చికెన్ 65 అని పేరు పెట్టారనేది అత్యంత ప్రాచుర్యం పొందిన వాదన.

ఆసక్తికరమైన ఇతర ప్రచారాలు

ఒక వంటకం సూపర్ హిట్ అయ్యాక, దాని పేరు వెనుక రకరకాల ఊహాగానాలు పుట్టుకురావడం సహజం. చికెన్ 65 విషయంలోనూ ఇలాంటి ఎన్నో కథలు వినిపిస్తుంటాయి:

మెనూలో 65వ ఐటమ్: ఒక హోటల్ మెనూ కార్డులో 65వ నంబర్ వంటకంగా ఇది ఉండేదని, ఆర్డర్ చేసేటప్పుడు పేరు పలకడం కష్టమై జనం 65 అని పిలవడం మొదలుపెట్టారని కొందరు అంటారు.

మిలిటరీ క్యాంటీన్ కోడ్: సైనికుల క్యాంటీన్లలో వంటకాలను నంబర్లతో పిలిచేవారని, అలా 65వ నంబర్‌లో ఉన్న చికెన్ వంటకమే చికెన్ 65గా స్థిరపడిందని మరో కథనం.

65 రకాల మసాలాలు లేదా మిరపకాయలు: ఈ వంటకం తయారీలో 65 రకాల మసాలా దినుసులు వాడతారని కొందరు, ఏకంగా 65 మిరపకాయలు వేసి వండుతారని మరికొందరు చెబుతుంటారు.

65 రోజుల కోడి: పుట్టిన 65 రోజుల వయసున్న కోడిల మాంసంతో దీనిని వండుతారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఆహార చరిత్రకారులు వీటిని కేవలం సరదా కథలుగానే కొట్టిపారేస్తుంటారు.

హోటల్ వంటకం నుండి నేషనల్ ఫేవరెట్ వరకు..

పుట్టుక ఏదైనా, చికెన్ 65 చెన్నై దాటి అతి తక్కువ కాలంలోనే తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ అంతటా విస్తరించింది. ప్రాంతాన్ని బట్టి దీని రుచిలో మార్పులు వచ్చాయి. కొన్ని చోట్ల ఎక్కువ కారంగా, మరికొన్ని చోట్ల పెరుగు మసాలా కోటింగ్‌తో, ఇంకొన్ని చోట్ల డ్రైగా దీనిని తయారు చేస్తారు. ముఖ్యంగా కేరళలో కరివేపాకుతో పాటు కరకరలాడే అప్పడాల (పాపడ్) ముక్కలు కలిపి వడ్డించడం ప్రత్యేక ఆకర్షణ. నేడు చికెన్ 65 బిర్యానీ, రోల్స్, ఫ్రైడ్ రైస్, చివరికి పిజ్జాలపై టాపింగ్‌గా కూడా ఇది మారిపోయింది.

ఎన్ని కొత్త వంటకాలు వచ్చినా తగ్గని క్రేజ్

గత కొన్నేళ్లుగా బ్రోస్టెడ్ చికెన్, అంతర్జాతీయ ఫ్రైడ్ చికెన్ చెయిన్స్, కొత్త రకం స్టార్టర్లు మార్కెట్లోకి ఎన్నో వచ్చాయి. అయినా సరే, చికెన్ 65 స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేకపోయింది. చిన్న చికెన్ ముక్కలకు అల్లం వెల్లుల్లి, కారం, మసాలాలు పట్టించి నూనెలో వేయించి, కరివేపాకు, పచ్చిమిర్చితో తాలింపు వేయగానే వచ్చే ఆ ఘుమఘుమలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆరు దశాబ్దాలు దాటినా, డైనింగ్ టేబుల్‌పైకి రాగానే క్షణాల్లో ఖాళీ అయ్యే స్టార్టర్‌గా చికెన్ 65 తన రారాజు కిరీటాన్ని అలాగే నిలబెట్టుకుంది.

Follow Us