ప్రపంచంలో యాడా లేని సరుకు మన ఏపీలోనే.. ఆ చేవ, దాని ధర వేరే లెవల్..
ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం శేషాచలం అటవీ ప్రాంతంలోనే ప్రత్యేకంగా పెరుగుతుంది. ఇక్కడి నేల స్వభావమే నాణ్యమైన ఎర్రచందనంకు కారణం. అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉన్న ఈ ఎర్ర బంగారం ఔషధ, వాద్య పరికరాలు, అలంకరణ వస్తువుల తయారీలో వినియోగిస్తారు. అధిక లాభాల కోసం ప్రాణాలకు తెగించి స్మగ్లర్లు దీనిని అక్రమ రవాణా చేస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన ఎర్రచందనం చెట్లు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో, ముఖ్యంగా శేషాచలం అటవీ ప్రాంతంలో సహజంగా విస్తరించి ఉంటుంది. ఈ ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్నే “రెడ్ శాండర్స్” లేదా శాస్త్రీయంగా “టీరోకార్పస్ శాంటాలినస్” అని పిలుస్తారు. దీని రంగు, అధిక విలువ కారణంగా దీనిని “ఎర్ర బంగారం” అని కూడా వ్యవహరిస్తారు. ఎర్రచందనం శేషాచలం అటవీ ప్రాంతంలో నాణ్యంగా పెరగడానికి ప్రధాన కారణం ఇక్కడి నేల స్వభావం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, శేషాచలం కొండల్లో యురేనియం, ఐరన్, గ్రాఫైట్, కాల్షియం వంటి ఖనిజాలు సరైన నిష్పత్తిలో ఉండటమే ఈ మొక్కల వృద్ధికి అత్యంత అనుకూలం. ఇతర ప్రాంతాల్లో రైతులు పెంచినప్పటికీ, శేషాచలంలో సహజసిద్ధంగా పెరిగే నాణ్యతను అవి అందుకోలేవు. సహజసిద్ధంగా పెరిగిన చెట్లు వాణిజ్య వినియోగానికి 20-25 సంవత్సరాలు పడుతుండగా, సాగు చేసే చెట్లకు 30-40 సంవత్సరాలు పడుతుంది.
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, నాణ్యతను బట్టి ఎర్రచందనం దుంగలను A, B, C గ్రేడ్లుగా విభజిస్తారు. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్ ఉంది. వాద్య పరికరాలు, దేవతా విగ్రహాలు, అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు (చెంచాలు, స్టిక్స్, గిన్నెలు) తయారీలో దీనిని ఉపయోగిస్తారు. జపాన్‌లో వివాహ బహుమతిగా ఎర్రచందనం వస్తువులను ఇవ్వడం ఒక సంప్రదాయమని తెలుస్తోంది. ఔషధ రంగంలోనూ దీనికి ప్రాధాన్యత ఉంది. శృంగార సామర్థ్యాన్ని పెంచే మెడిసిన్ తయారీలో, కాస్మొటిక్స్‌లో, అల్సర్‌ను తగ్గించడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి, టానిక్‌గా, చర్మాన్ని కాంతివంతం చేయడానికి, శ్వాసకోశ, మూత్రపిండాల సమస్యల నివారణకు దీనిని ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఎర్రచందనం అధిక డిమాండ్, విలువ కారణంగా స్మగ్లర్లు ప్రాణాలకు తెగించి దీనిని అక్రమ రవాణా చేస్తున్నారు. వీరప్పన్ మరణానంతరం వేల మంది స్మగ్లర్లు శేషాచలం కొండలను తమ స్థావరంగా చేసుకుని అక్రమ రవాణాలో నిమగ్నమయ్యారు. ఈ స్మగ్లింగ్ కార్యకలాపాలు ఏడు స్థాయిల్లో జరుగుతాయని అటవీ శాఖ పేర్కొంది. కర్రలను నరికే కూలీల దగ్గర నుంచి రవాణాదారులు, డంప్ చేసేవారు, దళారులు వరకు ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ పనిచేస్తుంది. ఈ నెట్వర్క్ చాలా రహస్యంగా నిర్వహించబడుతుంది.
ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ (RSATF) ను ఏర్పాటు చేసింది. తిరుపతిలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ టాస్క్‌ఫోర్స్, పోలీసు, అటవీ, APSP, AR ఫోర్సెస్‌ల సమన్వయంతో పనిచేస్తుంది. నిత్యం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తూ స్మగ్లర్లను, వారి అనుచరులను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. చైనా వంటి దేశాలు తమ దేశంలో ఎర్రచందనం పెంచడానికి ప్రయత్నించినప్పటికీ, శేషాచలంలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులు లేకపోవడం వల్ల అవి విఫలమయ్యాయని నిపుణులు తెలిపారు. అందువల్ల, అంతర్జాతీయ డిమాండ్ శేషాచలం ఎర్రచందనంపైనే ఆధారపడి ఉంది.
ఎర్రచందనం ధర దాని నాణ్యత, గ్రేడ్‌ను బట్టి భారీగా మారుతుంది. ఇటీవలి మార్కెట్ నివేదికల ప్రకారం A-గ్రేడ్ ఎర్రచందనం టన్నుకు సుమారు రూ.75 లక్షల వరకు పలికింది.. అంటే కిలోకు దాదాపు రూ.750. గతంలో అత్యుత్తమ నాణ్యత కలిగిన A-గ్రేడ్ దుంగలకు కిలోకు రూ.1,950 వరకు కూడా వేలంలో ధర పలికింది.
