ఈవీ కొనుగోలుదారులకు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. లక్ష సబ్సిడీ.. 50% టాక్స్ తగ్గింపు..!
దేశవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ, పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచేలా సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా సర్కార్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ, పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచేలా సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తాజాగా బీహార్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘బీహార్ ఎలక్ట్రిక్ వాహనాల (సవరణ) విధానం 2026’ కు ఆమోదం లభించింది.
ఈ కొత్త ఈవీ విధానం ప్రకారం, రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్లను (ఫోర్ వీలర్స్) కొనుగోలు చేసే మహిళలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. మహిళలు ఈవీ కార్లను కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 1 లక్ష వరకు నేరుగా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందించనుంది. ఇది మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి, పర్యావరణహిత ప్రయాణాన్ని ఎంచుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ కొత్త విధానం కేవలం కార్లకే పరిమితం కాకుండా, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల కొనుగోలుదారులకు కూడా భారీ ఉపశమనాన్ని కలిగిస్తోంది. వాహనాల కేటగిరీని బట్టి సబ్సిడీ విధానం మారుతుంది.
సాధారణ వర్గానికి చెందిన వ్యక్తులు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడానికి 10,000 రూపాయల వరకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులు 12,000 రూపాయల వరకు సబ్సిడీని పొందుతారు. ఎలక్ట్రిక్ కార్గో త్రిచక్ర వాహనాల కోసం, సాధారణ వర్గానికి 50,000 రూపాయల వరకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 60,000 రూపాయల వరకు సబ్సిడీ లభిస్తుంది. దీంతో పాటు, బీహార్‌లో ఈవీ వాహనాలను కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రతి ఒక్కరికీ మోటారు వాహన పన్నులో (Motor Vehicle Tax) ఏకంగా 50 శాతం వరకు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ స్క్రాపేజ్ విధానానికి అనుగుణంగా, పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను స్క్రాప్ చేసి కొత్త ఈవీలను కొనే వారికి అదనపు ప్రయోజనాలు కూడా అందుతాయి.
రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛమైన గాలిని అందించడమే లక్ష్యంగా బీహార్ ప్రభుత్వం పని చేస్తోంది. 2030 నాటికి రాష్ట్రంలో నమోదయ్యే మొత్తం కొత్త వాహనాలలో కనీసం 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యం గనుక నెరవేరితే, రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 100 మిలియన్ లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది సామాన్యుడి జేబుకు రవాణా ఖర్చులను తగ్గించడమే కాకుండా, పర్యావరణాన్ని ఎంతగానో కాపాడుతుంది.
ఎలక్ట్రిక్ వాహనదారులకు ఛార్జింగ్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో భారీగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. నగరాల్లోని షాపింగ్ మాల్స్, హోటళ్లు, పెట్రోల్ పంపులు, పెద్ద నివాస సముదాయాలలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసే నిర్వాహకులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా అందించనున్నారు. బీహార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రవాణా రంగాన్ని సరికొత్త హరిత మార్గం వైపు నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
