AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Update: తెలంగాణలో బండలు పగిలే ఎండలు.. అల్పపీడనంతో ఏపీలో వర్షాలు

Weather Update: తెలంగాణలో బండలు పగిలే ఎండలు.. అల్పపీడనంతో ఏపీలో వర్షాలు

Phani CH
|

Updated on: May 14, 2026 | 5:48 PM

Share

తెలంగాణలో తీవ్ర ఎండలు, వడగాలులు కొనసాగుతున్నాయి, 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు, అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. రైతులు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మే 20న రుతుపవనాలు అండమాన్‌ను తాకి, జూన్ ప్రారంభంలో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. రానున్న మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఎండల తీవ్ర నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి రానున్న మూడు నుంచి నాలుగు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు జిల్లాలు ,రాయలసీమ ప్రాంతంలో వర్షాల తీవ్రత అధికంగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశుకాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. మరోవైపు అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు, పెదబయలు మండలాలు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు బుధవారం రోజున చిత్తూరు జిల్లా రాయలపేటలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లాలోని కొత్తపల్లెలలో 42.4 డిగ్రీలు, కోనసీమ జిల్లాలోని ఎర్రంపేటలో 42 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 41.9 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 143 మండలాల్లో పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదుకావటం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. మరో వైపు నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక అల్పపీడనం కొనసాగుతుండగా, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు, ఈ నెల 16వ తేదీలోపు అండమాన్ సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతోంది, దీనికి తోడు వడగాలులు , ఉక్కపోత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. గురువారం పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుండి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఎండలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు.ఎండల తీవ్రత కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని వాతావణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాగల వారం రోజుల పాటు పొడి వాతావరణం నెలకొని ఉండటంతో ఎండల తీవ్రత భారీగా పెరగనుంది. దాదాపు 20వ తేదీ వరకు రాష్ట్రమంతా ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజల రక్షణ కోసం వాతావరణ హెచ్చరికలను మరియు కలర్ కోడ్ మ్యాపులను ప్రతిరోజూ మూడుసార్లు సంబంధిత విభాగాలకు పంపిస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు పెరగడానికి గల కారణాలేంటీ? రాగల వారంరోజుల పాటు ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయ్‌?.. దీనిపై మరింత సమచారం మా కరస్పాండెంట్ శ్రవణ్‌ వాతావరణ శాఖ కేంద్రం నుంచి రిపోర్ట్ చేస్తారు. తీవ్రమైన ఎండల మధ్య వాతావరణ శాఖ ఒక తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. మే 20 తేదీ నాటికి ఇవి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర పాకిస్థాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావంతో జూన్ ప్రారంభం నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోని ఇరుకైన వీధి !! ఎక్కడ ఉందొ తెలుసా

Follow Us