Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అశ్రునయనాల మధ్య సంస్కరణలకర్తకు తుది వీడ్కోలు.. నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి..!

ఢిల్లీ నిగమ్‌బోధ్ ఘాట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. అతిరథ మహారథులు తరలివచ్చి ఆర్థిక మేధావికి కడసాలి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి దనకర్, భూటాన్ రాజు జిగ్మే వాంగ్‌చుక్, ప్రధాని మోదీ, స్పీకర్ ఓంబిర్లా, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీకి నివాళి అర్పించారు.

అశ్రునయనాల మధ్య సంస్కరణలకర్తకు తుది వీడ్కోలు.. నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి..!
Manmohan Singh Last Rights
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 28, 2024 | 1:18 PM

ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు జరిపారు. నిగంబోధ్‌ ఘాట్‌లో మన్మోహన్ భౌతికకాయానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా నివాళులర్పించారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మన్మోహన్‌ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య సంస్కరణల యోధుడికి తుది వీడ్కోలు పలికారు అభిమానులు. నిగమ్‌బోధ్ ఘాట్‌కు మన్మోహన్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు.

అంతకుముందు ఏఐసీసీ ఆఫీస్‌లో మన్మోహన్‌కు ప్రజలు, కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వరకు మన్మోహన్‌ అంతిమయాత్ర కొనసాగింది. అంతిమయాత్ర వాహనంలోనే రాహుల్ గాంధీ నిగమ్‌బోధ్‌ ఘాట్‌కు వచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు మన్మోహన్ సింగ్‌కు ఘననివాళులర్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎంపీ మల్లురవి మన్మోహన్‌కు అంజలి ఘటించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు పల్లంరాజు, కేవీపీ రామచంద్రరావు మన్మోహన్‌ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు యావత్‌ దేశం అంతిమ వీడ్కోలు పలుకుతున్న సందర్భం ఇది. యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అనీ, మౌనముని అని ముద్రపడిన మన్మోహన్‌ చేసిన సేవలను ఆసేతుహిమాచలం గుర్తుచేసుకుంటోంది. 1991 నుంచి 2024 వరకు- దేశనిర్మాణంలో ఆయన పాత్రను నిన్నటితరం నెమరువేసుకుంటోంది. ఆయన సేవలను ఈ తరం తెలుసుకుంటోంది. మన్మోహన్‌ సింగ్‌ 1991లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టినా, 2004లో ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినా, ఆయన జీవితంలో అన్నీ యాక్సిడెంట్లే. కానీ ఈ అనుకోని ఘటనలు, దేశానికి మేలు చేశాయి. మేలు చేయడమే కాదు, దేశాభివృద్ధికి బాటలు పరిచాయి.

మన్మోహన్‌ సింగ్‌ మౌనంగా ఉండే ఆర్థిక మేధావే అయినా, అంతే దీటుగా జవాబు ఇచ్చే మిస్టర్‌ పర్‌ఫెక్ట్ కూడా. ఆర్థికమంత్రిగా మన్మోహన్‌ ఫస్ట్‌ స్పీచ్‌ నుంచి, ప్రధానిగా చివరి స్పీచ్‌ వరకు మన్మోహన్‌లో ఇదే ధోరణి కనిపించింది. ఎలాంటి మాటలదాడి జరిగినా, ఎలాంటి విమర్శలు వచ్చినా ఎదుర్కోవడానికి తాను సిద్ధమంటూ 1991 బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా మన్మోహన్‌ వ్యాఖ్యానించారు. చివరిగా 2014లో ప్రధాని పదవి నుంచి గుడ్‌బై చెప్పే సందర్భంలోనూ, ప్రెస్‌మీట్‌లో ఇలాగే మాట్లాడారు. తాను విలేకరుల సమావేశాలకు భయపడే ప్రధానమంత్రిని కానంటూ మన్మోహన్‌ సింగ్‌ నాటి ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు జనం గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..